ఆడియో సమీక్ష : జనతా గ్యారెజ్ – లిరికల్ బ్యూటీ!

janatha-garage1
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘జనతా గ్యారెజ్’ సినిమా రోజు రోజుకీ అంచనాలను పెంచుకుంటూ దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ లాంటి రెండు బ్లాక్‌బస్టర్స్ తెరకెక్కించిన కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో ‘జనతా గ్యారెజ్’ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. సినిమాతో పాటు దేవిశ్రీ అందించిన ఆడియోపై కూడా అదే స్థాయిలో అంచనాలున్నాయి. మరి ఎన్టీఆర్, కొరటాల శివ, దేవిశ్రీ కలిస్తే వచ్చే అంచనాలను ఆడియో అందుకుందా? చూద్దాం…

1. పాట : ప్రణామం
గాయనీ గాయకులూ : శంకర్ మహదేవన్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

ప్రణామం.. ప్రణామం అనే ఈ పాటలో ‘తోం దిరనా’ అంటూ మొదలయ్యే బిట్ బాగుంది. ట్యూన్ పరంగా దేవిశ్రీ ప్రసాద్ కొత్తదనం చూపించినట్లు కనిపించలేదు. అయితే మధ్యలో గిటార్, కీ బోర్డ్ మిక్స్ చేస్తూ చేసిన ప్రయోగం బాగా ఆకట్టుకుంది. శంకర్ మహాదేవన్ ఎప్పట్లానే తన స్టైల్లో పాటకు ఓ స్థాయి తీసుకొచ్చాడు. ఇక రామ జోగయ్య శాస్త్రి ప్రకృతికి ప్రణామం అంటూ రాసిన సాహిత్యం చాలా బాగుంది. వినగానే ఎక్కేసే స్థాయిలో లేకపోయినా వినగా, వినగా ఈ పాట బాగానే ఎక్కేస్తుందని చెప్పొచ్చు.

2. పాట : రాక్ ఆన్ బ్రో
గాయనీ గాయకులూ : రఘు దీక్షిత్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

‘రాక్ ఆన్ బ్రో’ అంటూ సాగే ఈ పాటను లిరికల్ బ్యూటీగా చెప్పుకోవచ్చు. రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం అదిరిపోయేలా ఉంది. ముఖ్యంగా మనసిపుడూ మబ్బులో విమానం, మన్నాటలో చండోడిలా, కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం.. లాంటి ప్రయోగాలు పాట నిండూతా ఉన్నాయి. దేవిశ్రీ ట్యూన్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు. ఇదే ట్యూన్‌తో దేవిశ్రీయే గతంలో ఎన్నో పాటలను సమకూర్చి ఉన్నాడన్న విషయం పాట వింటూంటే ఇట్టే అర్థమైపోతుంది. అయితే రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం, రఘు దీక్షిత్ గానం కలిసి ఆ లొసుగును బయటపెట్టకుండా పాటకు మంచి ఫీల్ తెచ్చిపెట్టాయి.

3. పాట : ఆపిల్ బ్యూటీ
గాయనీ గాయకులూ : యాజిన్ నిజార్, నేహా బాసిన్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

ఆపిల్ బ్యూటీ అంటూ సాగే ఈ పాట ఆల్బమ్ మొత్తంలో చాలా సాదాసీదా పాటగా చెప్పుకోవచ్చు. అమ్మాయి అందాన్ని పొగుడుతూ వచ్చే సాహిత్యం కూడా తెలుగు సినిమాల్లో ఎప్పుడూ వినిపించేదే! దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కూడా సాదాసీదాగా ఉంది. యాజిన్ నిజార్, నేహా బాసిన్‌ల గానం ఫర్వాలేదు. ఆడియోగా చూస్తే ఈ పాట వినగలిగేంత స్థాయిలో లేకపోయినా, సినిమాలో విజువల్స్ పరంగా చూస్తే బాగుంటుందని ఊహించొచ్చు.

4. పాట : జయహో జనతా
గాయనీ గాయకులూ : సుక్విందర్ సింగ్, విజయ్ ప్రకాష్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

ఆల్బమ్ మొత్తంలో హైలైట్ పాటంటే ‘జయహో జనతా’ అనే చెప్పుకోవచ్చు. పాటలో అన్నివిధాలా మంచి ఫీల్ ఉంది. సుక్విందర్ సింగ్, విజయ్ ప్రకాష్‌ల గానం పాటకు స్థాయి పెంచింది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్ వినగానే ఎక్కేసేలా ఉంది. మధ్యలో ఇన్స్ట్రుమెంట్స్‌తో చేసిన ప్రయోగం కూడా చాలా బాగుంది. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం పాటకు ఓ అర్థాన్ని తెచ్చిపెట్టింది. సంగీతం, సాహిత్యం, గానం.. మూడూ సరిగ్గా కుదిరిన ఈ పాట సినిమాలో విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు మరో రేంజ్‌లో ఉంటుందనే ఊహించొచ్చు.

5. పాట : నీ సెలవడిగీ
గాయనీ గాయకులూ : శ్వేతా మోహన్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

నీ సెలవడిగీ.. అంటూ సాగే ఈ పాట జయహో తర్వాత ఆ స్థాయి పాటగా చెప్పుకోవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ మెలోడియస్ ట్యూన్ చాలా బాగుంది. దానికితోడు శ్వేతా మోహన్ గానంలో ఫీల్ కూడా బాగా క్యారీ అయింది. రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఈ పాటకు ఓ స్థాయి తీసుకొచ్చింది. ‘భారంగా ఉంది నిజం.. దూరంగా వెళుతోంది జీవితం..’ లాంటి లిరిక్స్ ఉన్న ఈ పాట సినిమాలో ఓ బలమైన సన్నివేశంలో వస్తుందని ఊహించొచ్చు. వినగానే ఎక్కేసే ఈ పాట వినగా వినగా, ఇంకా బాగా ఎక్కేస్తుంది.

6. పాట : పక్కా లోకల్
గాయనీ గాయకులూ : గీతా మాధురి, సాగర్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

పక్కా లోకల్ అంటూ సాగే ఈ పాట గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అన్ని ఐటెమ్ సాంగ్‌ల తరహాలోనే ట్యూన్, బీట్స్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. దేవిశ్రీ ఈ పాట విషయంలో సేఫ్ గేమ్ ఆడి ఐటెమ్ సాంగ్స్‌లో ఏమేం కోరుకుంటారో అవన్నీ ఉండేలా చూసుకున్నాడు. గీతా మాధురి, సాగర్‌ల గానం కూడా ఈ శైలికి తగ్గట్టే కొనసాగింది. ఇక రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పక్కా మాస్ అనేలా ఉంది. సినిమాలో విజువల్స్‌తో కలిపి ఎన్టీఆర్, కాజల్ స్టెప్స్ వేస్తుంటే ఈ పాట బాగా ఆకట్టుకుంటుందని ఆశించొచ్చు.

తీర్పు :

ఒక పెద్ద సినిమా వస్తుందంటే ఆ సినిమా పోస్టర్ దగ్గర్నుంచి మొదలుకొని ప్రతీ అంశమూ ఎలా ఉందన్నది చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆడియోను సినిమాకు మొదటి విజయంగా భావించే తెలుగు పరిశ్రమలో ఆడియో బాగుంది అన్న టాక్ రావడమన్నది బాగా అవసరం. భారీ అంచనాల నడుమ విడుదలైన దేవిశ్రీ ప్రసాద్ అందించిన ‘జనతా గ్యారెజ్’ ఆడియో, అంచనాలకు దగ్గరగా వచ్చి బాగానే మెప్పించిందని చెప్పాలి. ఎక్కువగా అన్ని పాటల్లో లిరిక్స్‌దే డామినేషన్ కనిపించిందని ఒప్పుకొని తీరాలి. ‘జయహో జనతా’, ‘నీ సెలవడిగీ’, ‘ప్రణామం’.. ఈ మూడు పాటలనూ వినగానే ఎక్కేసేలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ‘రాక్ ఆన్ బ్రో’ పూర్తిగా సాహిత్య పరంగానే చూడదగ్గ పాట. మిగతా రెండు పాటలూ ఆడియోగా పెద్దగా ఆకట్టుకునే స్థాయిలో లేవని చెప్పుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎన్టీఆర్, కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్.. ఈ ముగ్గురూ కలిశారంటే ఆ ఆడియో ఎలా ఉంటుందో అని ఎదురుచూస్తూ వస్తోన్న అభిమానులకు మంచి సంతృప్తినిచ్చే ప్యాకేజ్డ్ ఆల్బమ్ వచ్చిందనే చెప్పాలి.

Click here for English Music Review


సంబంధిత సమాచారం :