సమీక్ష : జయమ్మ పంచాయితీ – కాన్సెప్ట్ బాగున్నా.. సినిమా కనెక్ట్ కాదు !

 Jayamma Panchayathi Movie Review

విడుదల తేదీ : మే 06, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: సుమ కనకళా, దేవి ప్రసాద్ ,దినేష్ కుమార్, కదంబాల షాలిని, కొండెపూడి జాయ్ తదితరులు.

దర్శకత్వం : విజయ్ కుమార్ కలివరపు

నిర్మాతలు: బలగ ప్రకాష్

సంగీత దర్శకుడు: ఎం.ఎం. కీరవాణి

సినిమాటోగ్రఫీ: అనూష్ కుమార్

ఎడిటర్ :

యాంకర్ సుమ ప్రధాన పాత్రలో దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘జ‌యమ్మ పంచాయతీ’. కాగా ఈ సినిమా ఈ రోజే ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

క‌థ‌:

 

జయమ్మ (సుమ) తన భర్త గౌరీ నాయుడు (దేవి ప్రసాద్)తో పాటు పిల్లలతో సంతోషంగా ఉంటుంది. బంధువులు మరియు తన గ్రామంలోని ప్రజల ఇళ్ళల్లో ఏ శుభకార్యం జరిగిన ఈడ్లు (చదివింపులు) తాహత్తుకి మించి ఇస్తూ ఉంటారు. అయితే, జయమ్మ భర్త (దేవి ప్రసాద్) అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవుతాడు. గుండె ఆపరేషన్ చేయాల్సి వస్తోంది. డబ్బులు లేని జయమ్మకు బాగా డబ్బు అవసరం అవుతుంది. మరీ ఆ డబ్బు కోసం జయమ్మ ఏమి చేసింది ? అసలు తన సమస్యను పరిష్కరించాలని గ్రామ పంచాయతీకి జయమ్మ ఎందుకు వెళ్తుంది ? చివరకు జయమ్మ కథలో ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాకి ప్రధానంగా ప్లస్ పాయింట్ అంటే.. ఈ కథలోని మెయిన్ పాయింట్, అలాగే ఈ కథ జరిగిన నేపథ్యమే. దర్శకుడు రాసుకున్న సున్నితమైన అంశాలు, భావోద్వేగాలు కొన్నో చోట్ల బాగానే ఉన్నాయి. అలాగే ప్రధానంగా ఓ చిన్న గ్రామంలోని ప్రజలలో ఉండే అమాయకత్వం, కన్నింగ్ నేచర్ సినిమాకు కావాల్సినంత సహజత్వాన్ని అందించింది.

ఇక జయమ్మ పాత్రలోని తాపత్రయాన్ని, బాధను, వెటకారాన్ని సుమ చాలా చక్కగా పలికించింది. జయమ్మ భర్తగా దేవి ప్రసాద్ నటన కూడా చాలా సహజంగా ఉంది. దినేష్ కుమార్, కదంబాల షాలిని, కొండెపూడి జాయ్ తదితరులు కూడా బాగా నటించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అన్నిటికీ మించి కథలోని ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

కథా నేపథ్యం, పాత్రల చిత్రీకరణ పరంగా పర్వాలేదు అనిపించినా దర్శకుడు కథను మొదలు పెట్టడంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించారు. పాత్రలు పరిచయానికి సమయం తీసుకున్నారనుకున్నా.. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా బోరింగ్ గా సాగుతుంది. అయినా పంచాయితీ అనే పాయింట్ చుట్టూ కథను నడుపుతూ కూడా దర్శకుడు కథలో ఎక్కడ టర్నింగ్ పాయింట్లు కూడా లేకుండా.. చివరి వరకూ సింగిల్ ప్లాట్ తోనే ప్లేను చాలా బోరింగ్ గా నడపడంతో సినిమా ఎవరికీ కనెక్ట్ కాదు.

దీనికి తోడు ప్రతి పాత్ర ఒకే ఎమోషన్ తో ఎలాంటి బలమైన సంఘర్షణ లేకుండా చాలా నిస్సహాయతతోటి సాగుతాయి. అయినా ఏ పాత్ర ఎందుకు వస్తోంది ?
అసలు ఆ పాత్రల తాలూకు బాధ, ఆలోచనా విధానం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోతే, జరుగుతున్న కథలో ప్రేక్షకుడు ఎలా ఇన్వాల్వ్ అవుతాడు ? అందుకే ఈ సినిమాలో ఏ ఎలిమెంట్ కి ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ కాలేదు. పైగా ఎలాంటి కమర్షియల్ హంగులు ఆర్భాటాలు లేకపోవడం కూడా ఈ సినిమా ఫలితాన్ని దెబ్బతీసింది. ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా అసలు మెప్పించదు.

 

సాంకేతిక విభాగం :

 

విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేయలేదు. అలాగే రచయితగా కూడా ఆయన ఏ మాత్రం తన కథనంతో ఆకట్టుకోలేదు. సినిమా స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. సినిమాటోగ్రఫర్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. నిర్మాత ప్రొడక్షన్ డిజైన్ బాగుంది.

 

తీర్పు :

 

జయమ్మ పంచాయితీ అంటూ గ్రామీణ నేపథ్యంలో ఓ విభిన్న కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేదు. అయితే, సుమ నటనతో పాటు డిఫరెంట్ సినిమాగా కొన్ని అంశాల్లో ఈ చిత్రం ఆకట్టుకున్నా.. స్లో నేరేషన్, బోరింగ్ ట్రీట్మెంట్, బలమైన కాన్ ఫ్లిక్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం, మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. దాంతో ఈ సినిమా ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం :