విడుదల తేదీ : మే 18, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : విజయ్ ఆంటోని, అంజలి, సునైన
దర్శకత్వం : కిరుతిగ ఉదయనిధి
నిర్మాత : విలియమ్ అలెగ్జాండర్
సంగీతం : విజయ్ ఆంటోనీ
సినిమాటోగ్రఫర్ : రిచర్డ్ ఎమ్. నాథన్
ఎడిటర్ : లారెన్స్ కిషోర్
స్క్రీన్ ప్లే : కిరుతిగ ఉదయనిధి
ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించే నటుడు విజయ్ ఆంటోని ఈసారి ‘కాశి’ సినిమాతో మన ముందుకొచ్చారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..
కథ:
అమెరికాలోని భరత్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చీఫ్ భరత్ (విజయ్ ఆంటోనీ) జీవితంలోని అన్ని రకాల సుఖాలతో హాయిగా ఉంటాడు. కానీ చిన్ననాటి జ్ఞాపకం ఒకటి అతన్ని పెద్దయ్యాక కూడ వెంటాడుతూ ఉంటుంది. ఆ తరుణంలోనే అతనికి తన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు తన కన్న తల్లిదండ్రులు కారని తెలుస్తుంది.
దీంతో అతను తనను కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ఇండియా బయలుదేరుతాడు. అలా ఇండియా వచ్చిన భరత్ తన తల్లి దండ్రుల్ని కనుక్కోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఇంతకీ అతని తల్లిదండ్రులెవరు అనేదే తెరపై నడిచే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
దర్శకురాలు కిరుతిగ ఉదయనిధి సినిమాను చాలా ఆసక్తికరమైన రీతిలో మొదలుపెట్టారు. ముందుగా హీరోను, అతని పరిస్థితిని పరిచయం చేసి కొద్దిసేపటికే అతన్ని కన్న తల్లిదండ్రుల వేటలో పడేయడంతో సినిమా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఆ వేటలో తల్లిని కనుగొన్న హీరోకు తండ్రిను కనుక్కోవడం కష్టతరంగా మారడంతో సినిమా ఇంకాస్త ఆసక్తికరంగా మారుతుంది.
హీరో విజయ్ అంటోనీ తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో సినిమాను తన భుజాలపైనే మోసే ప్రయత్నం చేసి మెప్పించాడు. అలాగే సినిమా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, ముగింపు రెండూ బాగానే ఉన్నాయి. కథానాయకుడు తన తల్లిదండ్రులకి ఎలా దూరమయ్యాడు, అతని తల్లి ఎందుకు తన భర్తను వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది, అసలు హీరో తండ్రి ఎవరు, అతని కథేమిటి వంటి ఎపిసోడ్స్ ప్రేక్షకులకి సంతృప్తినిచ్చే విధంగానే ఉన్నాయి.
మైనస్ పాయింట్స్ :
దర్శకురాలు కిరుతిగ ఉదయనిధి ఎంచుకున్న ఒక కొడుకు తన తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ గత జీవితంలోకి వెళ్ళడం అనే అంశం బాగానే ఉంది కానీ ఆ పాయింట్ ను పూర్తి కథగా డెవలప్ చేయడానికి ఆమె రాసుకున్న కథనమే నిరుత్సాహకారంగా ఉంది. సినిమాను ఆసక్తికరమైన రీతిలో మొదలుపెట్టిన ఆమె కొద్దిసేపటికి కథాన్ని పూర్తిగా వేరే దారిలోకి మళ్లించి ముఖ్యమైన అసలు అంశంపై ప్రేక్షకులు ఆసక్తిని కోల్పోయేలా చేశారు.
హీరో గురించి రాసుకున్న కథలో హీరో గురించి మాత్రమే చెప్పాల్సింది పోయి మధ్యలో కథతో, హీరోతో ఏమాత్రం సంబంధంలేని ఇద్దరు వ్యక్తుల పూర్తి కథల్ని చెప్పడంతో అనవసరంగా గంటకు పైగా రన్ టైమ్ ను వృథా చేశారు. ఆ గంటసేపు సినిమాలో ఏం జరుగుతుంది, కథ ఎటుపోతుంది, హీరో కథలోకి సంబంధంలేని వ్యక్తుల జీవితాలు ఎందుకొచ్చాయి అనేది అంతుపట్టక ప్రేక్షకుడు గందరగోళానికి గురి కావాల్సి వచ్చింది.
ఇక మధ్యలో మధ్యలో వచ్చే పాటలు కూడ చికాకు పెట్టగా హీరోయిన్ అంజలి ట్రాక్ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేక చప్పగా సాగిపోయింది. దర్శకురాలు, హీరో కథ ద్వారా ప్రధానంగా ఎలివేట్ చేద్దామనుకున్న మథర్ సెంటిమెంట్ ప్రేక్షకుల్ని కదిలించే స్థాయిలో ఎలివేట్ కాలేదు.
సాంకేతిక విభగం :
పైన చర్చించినట్టు దర్శకురాలు కిరుతిగ ఉదయనిధి సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా దాన్ని డీల్ చేసిన విధానమే దెబ్బ కొట్టింది. హీరోని ఇతరుల కథలోకి, పాత్రల్లోకి ప్రవేశపెట్టి ఆమె చేద్దామనుకున్న ప్రయోగం విఫలమై సుమారు గంటకు పైగా ప్రేక్షకులు నిరుత్సాహకరమైన సినిమాను చూసేలా చేసింది.
విజయ్ ఆంటోనీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నా పాటల సంగీతం మెప్పించలేకపోయింది. రిచర్డ్ ఎమ్.నాథన్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. లారెన్స్ కిషోర్ తన ఎడిటింగ్ ద్వారా వృధాగా పెట్టిన 60 నిముషాల కథనంలో కొన్ని సన్నివేశాలనైనా కత్తిరించి ఉండాల్సింది. విలియమ్ అలెగ్జాండర్ పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
తీర్పు :
‘బిచ్చగాడు’ మాదిరిగానే ఈసారి కూడ మధర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల్ని ముగ్దుల్ని చేయాలని విజయ్ ఆంటోనీ చేసిన ప్రయత్నం ‘కాశి’ ఆయన ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పాలి. స్టోరీ లైన్ బాగానే ఉన్న దర్శకురాలు కిరుతిగ ఉదయనిధి రాసిన కథనం గంటకు పైగా సినిమాను చాలా బోర్ కొట్టేలా తయారుచేయడంతో ఫలితం దెబ్బతింది. సినిమా ప్రారంభం, ముగింపు, విజయ్ ఆంటోనీ నటన మినహా ఈ సినిమా మిగిలిన అన్ని అంశాలు నిరుత్సాహకరంగానే ఉన్నాయి. మొత్తంగా అనవసరమైన ఉప కథలు కలిగిన ‘కాశి’ ప్రేక్షకులకి పెద్దగా వినోదాన్ని పంచదని చెప్పొచ్చు.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team