సమీక్ష : కళ్యాణ వైభోగమే – అందమైన ‘పెళ్ళి’ కథ!

Shourya review

విడుదల తేదీ : 04 మార్చ్ 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : నందిని రెడ్డి

నిర్మాత : కె.ఎల్. దామోదర్ ప్రసాద్

సంగీతం : కళ్యాణ్ కోడూరి

నటీనటులు : నాగ శౌర్య, మాళవిక నాయర్..

వరుస సినిమాలతో మెప్పిస్తూ వస్తోన్న యువహీరో నాగశౌర్య, ‘అలా మొదలైంది’తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ నందిని రెడ్డిల కాంబినేషన్‌లో రూపొందిన ‘కళ్యాణ వైభోగమే’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పెళ్ళైన కొత్తలో భార్య, భర్తల నడుమ జరిగే ఎమోషనల్ జర్నీని చెప్పిన కథగా ప్రచారం పొందిన ‘కళ్యాణ వైభోగమే’పై ట్రైలర్, ఆడియో రిలీజ్ అయినప్పట్నుంచే మంచి క్రేజ్ ఉంది. మరి సినిమా ఆ క్రేజ్‌కు తగ్గట్టుగానే సినిమా ఉందా? చూద్దాం..

కథ :

గేమింగ్ సాఫ్ట్‌వేర్ సంబంధిత ప్రొఫెషన్‌లో పనిచేసే శౌర్య (నాగ శౌర్య)కి మొదట్నుంచీ పెళ్ళంటే ఏమాత్రం ఆసక్తి ఉండదు. పెళ్ళి అనే బంధంలో చిక్కుకోవద్దనే సిద్ధాంతాన్ని పెట్టుకొని బతుకుతూంటాడు. ఇక ఇలాంటి ఆలోచనలనే నింపుకున్న దివ్య (మాళవిక నాయర్) కూడా పెళ్ళి అనే బంధంలో పడేందుకు ఒప్పుకోదు. విచిత్రంగా వీరిద్దరికి ఇరు కుటుంబాలూ పెళ్ళి ఫిక్స్ చేస్తాయి.

ఈ పరిస్థితుల్లో పెళ్ళి అంటేనే ఇష్టం లేని వీరిద్దరూ ఏం చేశారు? పెళ్ళిని తప్పించుకోవడానికి ఏం ప్లాన్ చేశారు? తర్వాత వీరిద్దరి ప్రయాణం ఎటువైపు దారితీసింది? లాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఫ్యామిలీ ఎమోషన్‌ను అద్భుతంగా తెరకెక్కించిన విధానం గురించి చెప్పుకోవచ్చు. పెళ్ళి అనే బంధంపై ఈతరం ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? నేటితరం సమాజం ఈ అంశాన్ని ఎలా చూస్తుందీ? అన్న విషయాన్ని దర్శకురాలు నందిని రెడ్డి చెప్పిన విధానాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇక ఎక్కడా అసభ్యతకు తావివ్వకుండా ఒక పెళ్ళి జంట ఆలోచనలను, ఫ్యామిలీ డ్రామాను చెప్పిన విధానం పూర్తి స్థాయి ఫ్యామిలీ సినిమా వస్తే చూడాలనుకునే వారికి బాగా నచ్చే అంశం.

హీరో నాగ శౌర్య ఎప్పట్లానే తనదైన యాక్టింగ్‌తో బాగా మెప్పించాడు. లుక్స్ పరంగానూ నాగ శౌర్య సినిమాకు మంచి ఫీల్ తెచ్చాడు. ఇక మాళవిక నాయర్ కూడా చాలా బాగా నటించింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో మాళవిక నాయర్ యాక్టింగ్‌తో కట్టి పడేసింది. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. చాలాకాలం తర్వాత తెరపై కనిపించిన రాశి, ఓ మంచి పాత్రలో మెప్పించారు.

సినిమా పరంగా చూసుకుంటే, సెకండాఫ్‌లోని ఎమోషన్‌ను సినిమాకే హైలైట్‌గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా హీరో-హీరోయిన్ల మధ్యన చివర్లో ప్రేమ చిగురించే నేపథ్యంలో సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఇక ఈ ఫ్లోకి కళ్యాణ్ కోడూరి అందించిన సంగీతం కూడా బాగా కలిసివచ్చింది.

మైనస్ పాయింట్స్ :

ఒక తెలిసిన కథనే బాగా చెప్పినా, ఎక్కువ నిడివి ఉండడం ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. కొన్ని సన్నివేశాలు చాలా లెంగ్తీగా ఉన్నట్లు అనిపిస్తాయి. సినిమా కథకు ప్రధాన అంశమైన హీరో పాత్ర పెళ్ళి చేసుకోకుండా ఎందుకు ఉంటాలనుకుంటాడన్నది సరిగ్గా చెప్పినట్లు కనిపించదు. పాటలు వినడానికి బాగున్నా, కొన్నిసార్లు వెంటవెంటనే వచ్చి రన్‌టైమ్ పెంచిన ఫీలింగ్ కలిగిస్తాయి. ‘అలా మొదలైంది’ తరహాలో తాగుబోతు రమేష్ పాత్రను క్లైమాక్స్‌ కన్ఫ్యూజన్‌కు వాడుకోవడం పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ఇక చివర్లో హీరో మరో అమ్మాయిని ప్రేమించడమనే పాయింట్‌లో క్లారిటీ లేదు.

సాంకేతిక విభాగం :

ముందే చెప్పినట్లు సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ఈ సినిమాకు కళ్యాణ్ కోడూరి మ్యూజిక్‌ను హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఆయన అందించిన పాటలన్నీ వినడానికి బాగుంటే, విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు అందంగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇక సినిమాటోగ్రాఫర్ సత్యనారాయణ రాజు సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్ళారు. సినిమా మూడ్‌ను సరిగ్గా పట్టుకుంటూనే, ప్రతీ ఫ్రేం అందంగా ఉండేలా చూడడంలో సినిమాటోగ్రాఫర్ చూపిన ప్రతిభను మెచ్చుకోవాలి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి.

దర్శకత్వం విషయానికి వస్తే, సినిమాను ఒక పూర్తి స్థాయి ఎమోషనల్ డ్రామాగా, క్లీన్‌గా తెరకెక్కించడంలో నందిని రెడ్డి అద్భుతమైన ప్రతిభ చూపారు. చెప్పాలనుకున్న కథను ఎక్కడా పక్కదారి పట్టించకుండా, తెలివైన నెరేషన్‌తో, జెన్యూన్‌గా నవ్వించే కామెడీతో నందిని రెడ్డి ఈ స్క్రీన్‌ప్లేను రూపొందించిన విధానం కట్టిపడేస్తుంది. ఇక నందిని రెడ్డి తెలివైన నెరేషన్‌కు లక్ష్మీ భూపాల్ అందించిన మాటలు కూడా తోడ్పడి సినిమాకు మరింత అందం వచ్చింది. ఒక్క రన్‌టైమ్ విషయంలో నందిని రెడ్డి జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదనిపిస్తుంది.

తీర్పు :

‘అలా మొదలైంది’తో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకురాలు నందిని రెడ్డి, రెండో సినిమా ‘జబర్దస్త్’తో తీవ్రంగా నిరాశపరిచారు. ఇక ఆ తర్వాత తన కొత్త సినిమా ‘కళ్యాణ వైభోగమే’ను దాదాపు మూడేళ్ళ తర్వాత తీసుకొచ్చిన నందిని రెడ్డి మరోసారి తానేంటో నిరూపించే సినిమాతోనే ముందుకు వచ్చారనే చెప్పాలి. ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్‌ను, ఈతరం ఆలోచనలు, అభిప్రాయాలకు జతచేస్తూ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చెప్పాలనుకున్న పాయింట్‌ను సరిగ్గా చేర్చిందనే చెప్పుకోవచ్చు. రన్‌టైమ్ ఎక్కువైందన్న మైనస్ పాయింట్‌ను పక్కన బెడితే ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్‌ను బాగా అలరిస్తుందనే చెప్పొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘కళ్యాణ వైభోగమే’ ఒక అందమైన ఎమోషనల్ జర్నీ!

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version