సమీక్ష : “కాంతారా” – ఎమోషనల్ గా సాగే గుడ్ యాక్షన్ డ్రామా !

 kantara Movie-Review-In-Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 15, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: రిషబ్ శెట్టి, కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, వినయ్ బిడ్డప్ప

దర్శకత్వం : రిషబ్ శెట్టి

నిర్మాతలు: విజయ్ కిరగందూర్

సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్

సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్

ఎడిటర్స్: ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

రిషబ్ శెట్టి దర్శకత్వంలో తానే హీరోగా తెరకెక్కించిన చిత్రం “కాంతారా”. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..

 

కథ :

 

ఆటవిక ప్రాంతంలోని ఓ గ్రామం చుట్టూ ఈ కథ సాగింది. ఆ గ్రామానికి భూస్వామ్య దొర (అచ్యుత్ కుమార్). అతను ఆ గ్రామానికి పెద్ద. మరోపక్క శివ(రిషబ్ శెట్టి) తన స్నేహితులతో కలిసి వేటాడుతూ తాగి తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఫారెస్ట్ ఆఫీసర్ మురళీ(కిశోర్)తో శివ కి గొడవ జరుగుతూ ఉంటుంది. అంతలో శివ లవర్ లీల (సప్తమి గౌడ) కూడా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఫారెస్ట్ గార్డ్‌గా చేరుతుంది. ఈ లోపు ప్రభుత్వ అటవీ భూమిని సర్వే చేయడానికి ఫారెస్ట్ ఆఫీసర్ మురళీ పూనుకుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా కొన్ని సంగటనలు జరుగుతాయి. శివకి ఎప్పటి నుంచో దేవ నర్తకుడు కలలోకి వస్తూ భయ పెడుతూ ఉంటాడు. అసలు ఈ దేవ నర్తకుడు ఎవరు?, ఎందుకు శివ కలలో కి వస్తున్నాడు?, చివరకు ఈ గ్రామానికి వచ్చిన సమస్య ఏమిటి?, దాన్ని శివ ఎలా పరిష్కరించాడు? ఫైనల్ గా శివ ఏమయ్యాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

కర్ణాటకలోని ఓ తెగకు సంబంధించిన ఇతివృత్తం ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో గుడ్ ఎమోషన్స్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సెన్స్ ఉన్నాయి. దేవ నర్తకుడు మరియు శివ పాత్రల్లో రిషబ్ శెట్టి ఎప్పటిలాగే తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా తన తమ్ముడు గురవా చనిపోయాడని తెలిసే సన్నివేశంలో మరియు హెవీ ఎమోషన్స్ అండ్ భారీ యాక్షన్ తో సాగే క్లైమాక్స్ లో.. అలాగే మిగిలిన క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో.. రిషబ్ శెట్టి అద్భుతమైన తీవ్రమైన భావోద్వేగాలను పండించాడు.

ఇక రిషబ్ శెట్టికి జోడిగా నటించిన సప్తమి గౌడ కొన్ని సన్నివేశాల్లోనే కనిపించినప్పటికీ.. తన అందంతో అభినయంతో ఆమె ఆకట్టుకుంది. ఫారెస్ట్ ఆఫీసర్ గా నటించిన కిషోర్ కుమార్ కూడా సినిమాలో కనిపించనంతసేపూ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన అచ్యుత్ కుమార్ తన నటనతో మెప్పించాడు. ప్రమోద్ శెట్టి, వినయ్ బిడ్డప్ప మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు.

దర్శకుడు రిషబ్ శెట్టి సినిమాలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు మెయిన్ ఎమోషన్స్ ను కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా దర్శకుడు రిషబ్ శెట్టి సినిమా ముగింపులో చక్కని దర్శకత్వ పనితనం కనబర్చాడు. క్లైమాక్స్ చాలా బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

రిషబ్ శెట్టి మంచి స్టోరీ థీమ్ అండ్ మంచి నేపథ్యం తీసుకున్నప్పటికీ.. కొన్ని సీన్స్ లో మాత్రం టిపికల్ నేరేషన్ తో, పూర్తి ఆసక్తికరంగా సాగని యాక్షన్ డ్రామాతో సినిమాను కొన్ని చోట్ల పూర్తిగా ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కథనం ఉండాల్సిన స్థాయిలో ఆసక్తికరంగా లేదు.

అయితే, ఇంట్రెస్టింగ్ పాయింట్ తో సినిమాని ప్రారంభించి.. అలాగే మంచి ఎమోషనల్‌ సన్నివేశాలతో రిషబ్ శెట్టి ఆకట్టకున్నా.. సినిమా కొన్ని చోట్ల స్లోగా సాగుతుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టు లేదు. అలాగే కథ తాలూకు సెటప్ కూడా తెలుగు ప్రేక్షకలకు కనెక్ట్ కావడానికి కొంత సమయం పడుతుంది.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. రిషబ్ శెట్టి మంచి స్టోరీ ఐడియాతో గుడ్ ఎమోషన్స్ తో అద్భుతమైన క్లైమాక్స్ తో ఆకట్టుకున్నారు. అయితే ఆయన కొన్ని సన్నివేశాల్లో ఇంకా బెటర్ గా సినిమాని మలచొచ్చు. సంగీత దర్శకుడు బి అజనీష్ లోక్‌నాథ్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. ముఖ్య సన్నివేశాల్లో ఆయన నేపధ్య సంగీతం అద్భుతంగా ఉంది. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

రిషబ్ శెట్టి దర్శకత్వంలో తానే హీరోగా వచ్చిన ఈ భారీ యాక్షన్ విజువల్ డ్రామాలో బరువైన భావోద్వేగాలు, ప్రాంతీయ దైవత్వం తాలూకు నమ్మకాలు, ఇక గుడ్ యాక్షన్ తో సాగే ఎమోషనల్ సీన్స్ మరియు అద్భుతమైన క్లైమాక్స్.. ఈ సినిమాలో బాగా అలరిస్తాయి. అయితే సినిమాలో కొన్ని చోట్ల పూర్తిగా ఇన్ వాల్వ్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ సాగలేదు. కానీ, రిషబ్ శెట్టి తన అద్భుతమైన నటనతో, దర్శకత్వంతో ఈ సినిమా స్థాయిని పెంచాడు. ఓవరాల్ గా ఈ సినిమా బాగుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version