సమీక్ష : ‘కార్తికేయ 2’ – ఇంట్రెస్ట్ గా సాగే అడ్వెంచర్ థ్రిల్లింగ్ డ్రామా !

సమీక్ష : ‘కార్తికేయ 2’ – ఇంట్రెస్ట్ గా సాగే అడ్వెంచర్ థ్రిల్లింగ్ డ్రామా !

Published on Aug 14, 2022 3:01 AM IST
 Karthikeya 2 Movie Review

విడుదల తేదీ : ఆగష్టు 13, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి

దర్శకత్వం : చందూ మొండేటి

నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, టి జి విశ్వ ప్రసాద్

సంగీత దర్శకుడు: కాలభైరవ

సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని

ఎడిటర్: కార్తీక్ ఘట్టమనేని

 

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘చందు మొండేటి’ డైరెక్షన్ లో ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌ ‘కార్తికేయ 2’. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

కార్తికేయ (నిఖిల్) ఒక డాక్టర్. చాలా ప్రాక్టికల్ పర్సన్. సమస్యను వెతుక్కుంటూ వెళ్ళే సమాధానం. ఓ సమస్యను చేధించడానికి ఎంత దూరం అయినా వెళ్తాడు. అయితే, ఇలాంటి కార్తికేయ తన తల్లి మొక్కిన మొక్కును తీర్చడానికి ఆమెతో కలిసి ద్వారక కు వెళ్తాడు. శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైన ఈ ద్వారకా నగరంలో కార్తికేయ ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. అయితే పోలీసుల నుంచి ముగ్ధ (అనుపమ పరమేశ్వరన్) కార్తికేయను తప్పిస్తొంది. ఇంతకీ ముగ్ధ ఎవరు ?, ఆమెకు కార్తికేయకు మధ్య సంబంధం ఏమిటి ?, అసలు కార్తికేయను ద్వారకకు శ్రీకృష్ణుడు ఎందుకు రప్పించాడు ? చివరకు కార్తికేయ ఏం సాధించాడు ?, ఈ మొత్తం వ్యవహారంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ చందు మొండేటి రాసుకున్న కథ. పైగా చందు ఆ కథను తెరపై అద్భుతంగా చూపించాడు. ఇక నటీనటుల విషయానికి వస్తే.. నిఖిల్ పాత్ర చాలా బాగుంది. కార్తికేయ పాత్రలో నిఖిల్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పెస్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సాగే కొన్ని అడ్వెంచర్ సన్నివేశాల్లో అలాగే సెకండాఫ్ లో వచ్చే కీలక సీన్స్ లో కూడా నిఖిల్ నటన చాలా బాగుంది.

 

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన అనుపమ్ ఖేర్ బాగా నటించారు. శ్రీనివాస్ రెడ్డి, హర్ష అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల్లో మెప్పించారు. దర్శకుడు చందు కథలో ఉన్న సస్పెన్స్ ని బాగా మెయింటైన్ చేసాడు. పైగా అడ్వెంచర్ సీన్స్ ను కూడా చందు చాలా బాగా పిక్చరైజ్ చేసాడు.

 

అన్నిటికీ మించి శ్రీకృష్ణుడు గురించి ద్వారక నేపథ్యంలో రూపొందంటమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు చందు రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఒక సరి కొత్త అనుభూతినిస్తుంది. ఇక సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో వచ్చే సన్నివేశాలు ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. ఈ సినిమాలో చాలా లాజికల్ పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా రివీల్ చేసిన డైరెక్టర్ కొన్నిటిని మాత్రం ఇన్ డైరెక్ట్ గా చాలా సింపుల్ గా చూపించి వదిలేశాడు. అలాగే కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో కొన్నిటిని మాత్రం ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది.

 

సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, హీరో అండ్ టీమ్ ఎలాంటి కష్టాల్లో పడతారో, వాళ్ళు అనుకున్నది ఎలా సాధిస్తారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో బాగానే కలిగించారు. కాకపోతే.. కొన్ని సీన్స్ ను ఇంకా బెటర్ చూపించే స్కోప్ ఉంది. అలాగే ఇంకా క్లారిటీగా చూపించి ఉండాల్సింది.

 

సాంకేతిక విభాగం :

మంచి కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు చందు, ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కొన్ని చోట్ల కాస్త వెనుకబడ్డారు. కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ వర్క్ ను వాడుకున్న విధానం ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు కాలభైరవ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాతలను అభినందించాలి. నిర్మాతల నిర్మాణ విలువులు కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు :

‘కార్తికేయ 2’ అంటూ వచ్చిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా దర్శకుడు చందు రాసిన కథ, అడ్వెంచర్ సన్నివేశాలు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, కొన్ని సీన్స్ కన్ ఫ్యూజన్ గా క్లారిటీ లేకుండా సాగడం వంటి అంశాలు బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా భిన్నమైన, కొత్త తరహా చిత్రాలని ఇష్టపడేవారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు