సమీక్ష : కెవ్వు కేక – కేక పెట్టించదు..

విడుదల తేదీ : 19 జూలై 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకుడు : దేవీ ప్రసాద్
నిర్మాత : బొప్పన చంద్ర శేఖర్
సంగీతం : భీమ్స – చిన్ని చరణ్
నటీనటులు : అల్లరి నరేష్, షర్మిల మాండ్రే

కామెడీ కింగ్ గా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కితకితలు పెడుతూనే ఉన్నాడు. వరుసగా బాక్స్ ఆఫీసు వద్ద విజయాలు అందుకుంటున్న అల్లరి నరేష్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులకి తన కామెడీతో ‘కెవ్వు కేక’ పుట్టించడానికి వచ్చేసాడు. గతంలో అల్లరీ నరేష్ ని ‘బ్లేడ్ బాబ్జీ’ గా చూపించి ఆడియన్స్ ని తెగ నవ్వించేసిన దేవీ ప్రసాద్ ఈ సినిమాకి డైరెక్టర్. షర్మిలా మాండ్రే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి బొప్పన చంద్ర శేఖర్. పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది అని అనుకుంటున్న ఈ సినిమా ఎలా ఉంద ఇప్పుడు చూద్దాం…

కథ :

బుచ్చిరాజు(అల్లరి నరేష్) తన మామ మెజీషియన్ అబ్రకదబ్ర అప్పారావు(కృష్ణ భగవాన్) దగ్గర ఉంటూ కళానికేతన్ షాపింగ్ మాల్ లో సేల్స్ మాన్ గా పనిచేస్తూ ఉంటాడు. బుచ్చిరాజు మహా లక్ష్మి(షర్మిల మాండ్రే)ని చూసి ప్రేమలో పడతాడు. మహాలక్ష్మి కూడా బుచ్చిరాజుని ప్రేమిస్తుంది. కానీ మహాలక్ష్మి నాన్న అయిన సుబ్బారావు(ఎం ఎస్ నారాయణ)కి బాగా ఆస్థి ఉన్న వాళ్ళే తన ఇంటికి అల్లుడు కావాలని వారానికో డబ్బున్న పెళ్లి కొడుకుల్ని చూస్తుంటాడు. అందుకోసం బుచ్చిరాజు మొదట్లో డబ్బున్న వాడిలా నటించినా కొద్ది రోజులకి నిజం తెలిసిపోతుంది. దాంతో సుబ్బారావు వారి పెళ్ళికి ఒప్పుకోనంటాడు. దాంతో మన బుచ్చిబాబు 6 నెలల్లో తన పనిచేస్తున్న దానికన్నా పెద్ద షాపింగ్ మాల్ కొంటానని శబధం చేస్తాడు.

అదే తరుణంలో తన మామ అప్పారావు వల్ల బుచ్చిరాజుకి ఓ నిజం తెలుస్తుంది. దాని ప్రకారం బ్యాంకాక్ లో పెద్ద బిజినెస్ మాన్ అయిన గొట్టం గోపాలకృష్ణ (ఆశిష్ విద్యార్ధి) దగ్గర నుంచి బుచ్చిరాజుకి డబ్బు రావాల్సి ఉంటుంది. దాంతో బుచ్చిరాజు బ్యాంకాక్ పయనమవుతాడు. తనకి రావాల్సిన డబ్బు గురించి అడిగితే మెడపట్టి బయటకి గెంటేసిన గొట్టం గోపాలకృష్ణ దగ్గర నుంచి చివరికి తనకి రావాల్సిన డబ్బుని ఎలా సంపాదించుకున్నాడు? చివరికి మహాలక్ష్మి ని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అనేదే కథని మీరు తెరపైన చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

అల్లరి నరేష్ ఎప్పటిలానే తన కామెడీ, పంచ్ డైలాగ్స్ తో బాగానే ఆకట్టుకున్నాడు, కానీ అతను కొత్తగా చేయాడానికి మాత్రం ఈ సినిమాలో ఏమీ లేదు. అల్లరి నరేష్ ఈ మూవీలో చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఈ సినిమాతో తెలుగువారికి పరిచయమైన షర్మిల మాండ్రే చూడటానికి బాగుంది. పాటల్లో కాస్త గ్లామర్ ఒలకబోసిన షర్మిల మాండ్రే అమాయకపు అమ్మాయి పాత్రలో బాగానే నటించింది. ఆశిష్ విద్యార్ధి ఇప్పటి వరకూ ఎక్కువగా విలన్ పాత్రలే చేసాడు కానీ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలో నటించి ప్రేక్షకుల్ని బాగానే నవ్వించాడు. కృష్ణ భగవాన్, అలీ, ధన రాజ్ కాసేపు నవ్వించారు.

ఫస్ట్ హాఫ్ లో వచ్చే కళానికేతన్ షాపింగ్ మాల్ ఎపిసోడ్, ఒక పార్టీ ఎపిసోడ్, సెకండాఫ్ లో దెయ్యం ఎపిసోడ్ బాగా నవ్విస్తాయి. అలాగే చాలా త్వరగా డబ్బు సంపాదించేయాలని ప్రయత్నించే నరేష్ కి ‘జయమ్ము నిశ్చయమ్మురా, జీవితం అంటే పోరాటం, నీదారి పూలదారి, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు’ అనే పాటలను బ్యాక్ గ్రౌండ్ లో పెట్టి చేసిన కొన్ని సీన్స్ బాగా నవ్విస్తాయి.

మైనస్ పాయింట్స్ :

ముందుగా అల్లరి నరేష్ సినిమా అనగానే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునే కామెడీని ఆశిస్తారు. కానీ ఈ సినిమాలో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించే కామెడీ లేకపోవడం మొదటి మైనస్. సినిమాలో కామెడీ బాగా తక్కువగా ఉంది. ఎం.ఎస్ నారాయణ, అలీ, మరి కొంత మంది కమెడియన్స్ సినిమాలో ఉన్నప్పటికీ ప్రేక్షకుల్ని నవ్వించలేకపోయారు. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త పరవాలేదనిపించినా సెకండ్ హాఫ్ మొత్తం బోర్ కొట్టిస్తుంది. డైరెక్టర్ సెకండాఫ్ లో ప్రేక్షకులకి కామెడీని పంచడం కంటే గందరగోళాన్ని ఎక్కువ క్రియేట్ చేసాడు. ఫస్ట్ హాఫ్ కాస్త లెంగ్త్ ఎక్కువైనట్టు అనిపించడం, సెకండాఫ్ లో కాస్త గందరగోళం తోడవడం, పాత్రలు ఎక్కువగా కనిపిస్తుండడం వల్ల ఆడియన్స్ అయోమయంలో పడడం వల్ సెకండాఫ్ అస్సలు కనెక్ట్ అవ్వదు.

సినిమా మొదటి నుంచి ఊహాజనితంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే ఇంకాస్త ఆసక్తికరంగా ఉండేలా డైరెక్టర్ ప్లాన్ చేసుకోవాల్సింది. సినిమాలో చాలా చోట్ల కెవ్వు కేక అనే పదాన్ని వాడినా సినిమాలో కామెడీ మాత్రం కెవ్వు కేక అని అరిచేంత రేంజ్ లో లేదు. సినిమా ప్రీ క్లైమాక్స్ ని చేజ్ లని చెప్పి, ఐటెం సాంగ్ అని సాగదీసారు. పాటలకి పెద్ద ప్రాముఖ్యత లేదు, ఏదో పాటలు ఉండాలంటే ఉన్నాయి అనేలా ఉన్నాయి. నరేష్ – షర్మిల మధ్య లవ్ ట్రాక్ ఇంకాస్త బాగుండాల్సింది. కామెడీ సినిమాకి ముఖ్యంగా కావాల్సింది డైలాగ్స్. కానీ అక్కడక్కడా కొన్ని ఎపిసోడ్స్ కి డైలాగ్స్ బాగున్నా మొత్తంగా చూసుకుంటే పెద్దగా అనిపించవు.

సాంకేతిక విభాగం :

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఈ మూడు బాధ్యతల్ని తీసుకున్న దేవీ ప్రసాద్ ఏ ఒక్క విభాగంలోనూ సక్సెస్ కాలేక పోయాడని చెప్పుకోవాలి. చాలా రొటీన్ కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేదు, దర్శకత్వం విషయానికొస్తే అనుకున్న కాన్సెప్ట్ ని తెరపై చూపించడంలో సక్సెస్ కాలేకపోయాడు. ముఖ్యంగా ప్రేక్షకులని నవ్వించలేకపోయాడు. సినిమాటోగ్రఫీ బాగింది. ఎడిటర్ సెకండాఫ్ విషయంలో కాస్త జాగ్రత్త వహించి బాగా లెంగ్త్ గా ఉన్న సీన్స్ ని, కొన్ని అనవసరమైన సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది. భీమ్స్ – అచ్చు అందించిన సాంగ్స్ కాస్త పరవాలేదనిపించాయి. ఇఎస్ మూర్తి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. సినిమా మొత్తంగా అక్కడక్కడా ఎరుకుంటే కొన్ని డైలాగ్స్ బాగుంటాయి.

తీర్పు :

‘కెవ్వు కేక’ సినిమా కెవ్వు కేక అనే రేంజ్ లో లేదు. జస్ట్ ఓకే అనేలా ఉంది. ‘బ్లేడ్ బాబ్జీ’ సినిమాలో నరేష్ తో కామెడీ పంచించిన దేవీ ప్రసాద్ ‘కెవ్వు కేక’ తో ఆ మేజిక్ ని రిపీట్ చేయలేకపోయాడు. ఎప్పటిలానే నవ్వించే అల్లరి నరేష్ నటన, షర్మిల మాండ్రే గ్లామర్, కృష్ణ భగవాన్ పంచ్ డైలాగ్స్, నవ్వించే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అయితే రొటీన్ స్టొరీ, వీక్ స్క్రీన్ ప్లే, పరవాలేదనిపించే డైరెక్షన్, ఆడియన్స్ ని నవ్వించడం కంటే అయోమయంలో పడేయడం ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. చివరిగా ప్రేక్షకుల దగ్గర నుంచి జస్ట్ ఓకే అని పించుకునే సినిమా అవుతుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version