సమీక్ష : లాల్ సింగ్ చడ్డా – నిరాశ పరిచిన అమిర్ ఖాన్ !

Sita Ramam Movie Review

విడుదల తేదీ : ఆగష్టు 11, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగ చైతన్య, మోనా సింగ్

దర్శకత్వం : అద్వైత్ చందన్

నిర్మాతలు: అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధరే

సంగీత దర్శకుడు: తనూజ్ టికు, ప్రీతమ్

సినిమాటోగ్రఫీ: సత్యజిత్ పాండే (సేతు)

ఎడిటర్: హేమంతి సర్కార్

అమిర్ ఖాన్ – నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన సినిమా లాల్ సింగ్ చడ్డా . కాగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ

లాల్ సింగ్ చడ్డా ( అమిర్ ఖాన్) తన చిన్నతనం నుంచి తెలివి తక్కువ అబ్బాయి. అయితే, లాల్ సింగ్ చడ్డాకి స్కూల్ లో రూపా (కరీనా కపూర్) మంచి ఫ్రెండ్ అవుతుంది. ఆమెతో లాల్ సింగ్ చడ్డా ప్రేమలో పడతాడు. కానీ, రూపా మాత్రం డబ్బు పై ఉన్న కోరికతో లాల్ సింగ్ చడ్డా జీవితంలోని వివిధ దశలలో అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. లాల్ జీవితంలోని మిగతావాళ్ళు కూడా అతనికి దూరమవుతారు. ఆ నిరాశలో లాల్ తన కొత్త జర్నీ ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ? చివరకు రూపాను పెళ్లి చేసుకున్నాడా ? లేదా ? ఈ మొత్తం కథలో నాగ చైతన్య పాత్ర ఏమిటి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా 1970 కాలంలో మరియు ఆ తర్వాత కాలంలోని సంఘటనల సమాహారంగా సాగుతూ.. సినిమాలో అక్కడక్కడ వచ్చే కొన్ని భావోద్వేగాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు సినిమాలో ఆకట్టుకుంటాయి. అలాగే అమిర్ ఖాన్ యాక్టింగ్ అండ్ లాల్ సింగ్ చడ్డా క్యారెక్టర్ లోని షేడ్స్, అమిర్ – చైతు సీన్స్ బాగున్నాయి. మొత్తమ్మీద తన పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేస్తూ సినిమాలోనే అమిర్ హైలెట్ గా నిలిచాడు.

ఇక కథానాయకగా నటించిన కరీనా కపూర్ తన పాత్రల్లో చాలా చక్కగా నటించింది. ముఖ్యంగా కరీనా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ కరీనా పలికించిన హావభావాలు చాల బాగున్నాయి. ఇక చైతు కూడా బాలరాజు పాత్రలో చాలా బాగా నటించాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు అద్వైత్ చందన్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేకపోయారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు ఇంటర్వెల్ లాంటి కొన్ని సీక్వెన్స్ స్ పర్వాలేదు అనిపించినా.. స్క్రీన్ ప్లే సాగతీసినట్లు చాల స్లోగా సాగుతుంది. దానికి తోడు కొన్ని మెయిన్ సన్నివేశాలు కూడా బోర్ కొడతాయి.

పైగా సీరియ‌స్ గా ఎమోషనల్ గా సాగే క‌థ కావడంతో బిసి ప్రేక్షకులు ఆశించే ఎలిమెంట్స్, ట్విస్టులు, సర్‌ ప్రైజ్‌లు ఈ సినిమాలో లేవు.. ఉన్నవి కూడా ఆకట్టుకునేలా అనిపించవు. అలాగే సినిమాలో హీరో చుట్టూ సాగే డ్రామా అంతా బలహీనమైన సంఘర్షణకి లోబడి బలహీనంగా సాగుతుంది. అయితే దర్శకుడు హీరో జర్నీని బలంగా ఎలివేట్ చేసినప్పటికీ.. హీరోకి ఎదురయ్యే సమస్యలను కానీ.. హీరో పాత్రకి వచ్చే సంఘర్షణ గానీ ఆ స్థాయిలో మలచలేదు. .

దీనికి తోడు సినిమాలో కొన్ని సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి. అయితే దర్శకుడు సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. మెయిన్ గా సెకండ్ హాఫ్ స్లోగా సాగుతూ బోర్ కొడుతోంది. ఎడిటర్ అనవసరమైన సన్నివేశాలను ట్రీమ్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. పాటలు బాగున్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు కూడా చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లు సరైన కథాకథనాలను రాసుకోలేకపోయారు.

 

తీర్పు :

అమిర్ ఖాన్ – నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామాలో కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు కొన్ని ఎమోషన్స్ ఆకట్టుకున్నా.. కథాకథనాలు మాత్రం ఆకట్టుకోలేదు. సినిమా బాగా స్లోగా సాగుతూ బోర్ కొడుతోంది. దర్శకుడు అద్వైత్ చందన్ ఈ సినిమాని ఆకట్టుకునే విధంగా మలచలేకపోయాడు. అయితే సినిమాలో అమిర్ ఖాన్ యాక్టింగ్ మాత్రం హైలైట్ గా నిలుస్తోంది. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రం కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :