విడుదల తేదీ : ఏప్రిల్ 21, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం : శ్రీముని
నిర్మాత : నమన దినేష్, నమన విష్ణు కుమార్
సంగీతం : శ్రీ చరణ్ పాకల
నటీనటులు : రాశి, సాయి రోనక్, ఎన సాహ
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి చాలా ఎళ్ళ తర్వాత ప్రధాన పాత్రలో నటిస్తూ చేసిన థ్రిల్లర్ చిత్రం ‘లంక’. రాశి భర్త ‘శ్రీముని’ స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం..
కథ :
మలయాళ స్టార్ హీరోయిన్ అయిన స్వాతి (ఎన సాహ) తన పర్సనల్ పని మీద హైరదరాబాద్ వస్తుంది. ఆమె పని పూర్తై తిరిగి వెళ్లిపోదామనుకునే సమయానికి ఒక షార్ట్ ఫిలింలో నటించాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత కథ మొత్తం రెబెకా (రాశి) గెస్ట్ హౌస్ కు మారుతుంది. గెస్ట్ హౌజ్ కు చేరుకున్న స్వాతిని రెబెకా తన టెలీపతితో ఇబ్బంది పెట్టడం మొదలుపెడుతుంది.
అలా కథ నడుస్తుండగా స్వాతి ఉన్నట్టుండి కనబడకుండా పోతుంది. దాంతో పోలీసులు రెబెకాను అనుమానిస్తారు. అసలు రెబెకా స్వాతిని ఎందుకు ఇబ్బంది పెట్టింది ? ఈ టెలీపతి ఏమిటి ? అనే అంశాలు తెసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
టెలీపతి ఆధారంగా సాగే కథ కావడంతో సినిమా కాస్త ఆసక్తికరంగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత ఒక ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించిన రాశి నటన బాగుంది. క్లైమాక్స్ లో అయితే బాగా ఆకట్టుకుంది. మొదటి అర్థ భాగంలో సత్య అతని స్నేహితుల ద్వారా పండించిన కామెడీ అక్కడక్కడా నవ్వించింది.
స్ట్రిక్ట్ పోలీస్ ఆఫర్ పాత్రలో సుప్రీత్ నటన పర్వాలేదనిపించింది. చిత్ర నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఫస్టాఫ్ లో కొన్ని మంచి సన్నివేశాలతో కథలోని అసలు ట్విస్ట్ తెలియకుండా మెయింటైన్ చేయడం బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా పర్వాలేదనిపించింది.
మైనస్ పాయింట్స్ :
సినిమాలోని అతి పెద్ద డ్రాబ్యాక్ అంటే అది సంక్లిష్టంగా మారిన కథనమనే చెప్పాలి. దాని వలన ఒకానొక దశలో అసలు సినిమాలో ఏం జరుగుతోంది అర్థం కాదు. సినిమాను ఆసక్తికరంగా తయారు చేయాలన్న ప్రయత్నంలో ఎక్కువ ఉప కథలు, అనవసరమైన ట్విస్టులు పెట్టి ఇరిటేట్ చేశారు.
సినిమా కాస్త బాగుంది అనుకునే సమయానికి విభిన్నమైన అంశాలు వచ్చి బోర్ ఫీలింగ్ తెప్పిస్తాయి. పోలీస్ స్టేషన్ సన్నివేశంలో రాశి నటన మరీ ఓవర్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ మరీ ఇబ్బందికరంగా ఉంది. అందులో అనవసరమైన ట్విస్టులు వరుసగా ఒకదాని వెంట మరొకటి వస్తుంటాయి. కథను వివరించిన విధానం అస్సలు బాగోలేదు. దర్శకుడు కథకు అవసరం లేని క్రియేటివిటీనంతా చూపడంతో ఒక మంచి కథ చెడిపోయింది.
సాంకేతిక విభాగం :
బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్ వర్క్ జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి. డైలాగ్స్ బాగున్నాయి. కెమెరా వర్క్ చాలా బాగుంది. కథలోని సీరియస్ సన్నివేశాల్ని చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ ఏమంత చెప్పుకోదగ్గదిగా లేదు. కనీసం ఇంకో 20 నిముషాల సినిమాను కట్ చేసి ఉండాల్సింది.
ఇక దర్శకుడు ముని విషయానికొస్తే ఆయన కథను పేపర్ మీద బాగానే రాసుకున్నా తెరపై మాత్రం ఆకట్టుకునే విధంగా ఆవిష్కరించలేదు. ఆయన లాజిక్ లేని సన్నివేశాలతో, అనవసరమైన ఇతర అంశాలతో సినిమాను చాలా వరకు చెడగొట్టారు.
తీర్పు :
మొత్తం మీద ఈ ‘లంక’ చిత్రం సాధారణంగా తీసుంటే ఇప్పుడున్న దానికన్నా ఇంకాస్త బెటర్ గా ఉండేది. అనవసరమైన ట్విస్టులు, ఇతర డ్రామా, సంక్లిష్టమైన కథనం సినిమాను ప్రేక్షకులకు అందకుండా చేశాయి. దీంతో సినిమాను అర్థం చేసుకోవడం కష్టమైంది. ఒక్క రాశి పాత్ర తప్ప ఈ సినిమాలో మనకు కొత్తగా ఏమీ దొరకదు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team