విడుదల తేదీ : నవంబర్ 25, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, సత్యరాజ్, యోగి బాబు, ఇవానా, రాధిక శరత్‌కుమార్, తదితరులు.
దర్శకుడు : ప్రదీప్ రంగనాథన్
నిర్మాత: కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్
సంగీత దర్శకులు: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్
సంబంధిత లింక్స్: ట్రైలర్
హీరో ప్రదీప్ రంగనాథన్ నటించి స్వయంగా దర్శకత్వం వహించిన తమిళ మూవీ లవ్ టుడే. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
ఉత్తమన్ ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్) – నిఖిత (ఇవానా) ఇద్దరు ఖడంగా ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నిఖిత – ప్రదీప్ ప్రేమ సంగతి నిఖిత పాదర్ (సత్యరాజ్)కి తెలుస్తోంది. నిఖిత ఫాదర్ ప్రదీప్ ని ఇంటికి పిలుస్తాడు. ప్రదీప్ & నిఖిత వివాహాన్ని తాను అంగీకరించడానికి షరతుగా ఒక రోజు పాటు ఒకరి మొబైల్ ఫోన్‌లను ఒకరు మార్చుకోవాలని
నిఖిత ఫాదర్ చెబుతాడు. ప్రదీప్ & నిఖిత ఆ షరతును అంగీకరించి ఫోన్‌లను మార్చుకున్న తర్వాత వారి పరిస్థితి ఏమిటి? ఒకరి గురించి మరొకరకి ఎలాంటి నిజాలు తెలిశాయి? ఈ క్రమంలో వాళ్ళ మధ్య ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి ?, చివరకు వీరి ప్రేమ కథ ఎలా సుఖాంతం అయింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
జంటలు చిన్న చిన్న విషయాలకే అపోహలు అపార్థాలతో విడిపోతున్న ఈ జనరేషన్ లో.. దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో లవర్స్ మధ్య అద్భుతమైన ఎమోషన్ ఉంటే ఎంత బాగుంటుందో
చాల చక్కగా చూపించాడు. మళ్లీ అంతలోనే ఆ పాత్రల మధ్యనే నవ్వులను కన్నీళ్లను మరియు అభిమానాలతో కూడుకున్న ఆత్మాభిమానాలను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. మొత్తానికి సినిమాలో వాస్తవ పరిస్థితులు.. అలాగే సగటు కుర్రాళ్ళ భావోద్వేగాలు బాగున్నాయి.
నేటి తరం కుర్రాళ్ళు సరదా కోసం అవసరాల కోసం చాటుగా ఎలా ఉంటున్నారు ?, మళ్లీ బయటకు ఎలా కనిపిస్తారు? అనే కోణాలని కూడా బాగా చూపించారు. ఇక ప్రదీప్ రంగనాథన్ రాసుకున్న కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సత్యరాజ్ ఎపిసోడ్ చాల బాగుంది. నటన విషయానికి వస్తే.. హీరోగా కూడా నటించిన ప్రదీప్ రంగనాథన్ తన కామెడీ టైమింగ్ తో అండ్ తన ఎమోషనల్ యాక్టింగ్ తో బాగా నటించాడు.
సినిమాలోని కోర్ ఎమోషన్ని ప్రదీప్ రంగనాథన్ తన హావభావాలతోనే బాగా పలికించాడు. అలాగే హీరోయిన్ ఇవానా కూడా చాలా బాగా నటించింది. ఇక ఈ చిత్రానికి మరో బలం యోగిబాబు కామెడీ. ఆయన తన టైమింగ్ తో బాగా నవ్వించాడు. మిగిలిన ప్రధాన పాత్రధారులు రాధికా శరత్ కుమార్, సత్యరాజ్ కూడా ,తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా సాగుతుంది. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో స్లోగా సాగుతుంది. ఇక హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని లవ్ సీన్స కూడా రెగ్యులర్ గానే ఉంటాయి. దీనికితోడు దర్శకుడు కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని అనవసరమైన కామెడీ సన్నివేశాలను జోడించాడు.
పైగా కథకు బలం పెంచలేని లవ్ అండ్ ఫ్యామిలీ సీన్స్ ఎక్కువైపోయాయి. అలాగే కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి ప్లస్ అయ్యేది.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ప్రదీప్ రంగనాథన్ దర్శకుడిగా మంచి కథాంశంతో ఆకట్టుకున్నాడు. అలాగే ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే పై కూడా బాగుంది. సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
లవ్ టుడే అంటూ లవర్స్ మధ్య నిజమైన లవ్ ను అండ్ ట్రూ ఎమోషన్స్ ను గుర్తుచేసే కథాంశంతో సాగిన ఈ చిత్రం.. మంచి మెసేజ్ మరియు ఎమోషనల్ సీన్స్ తో పాటు కొన్ని కుటుంబ భావోద్వేగాలతో బాగా ఆకట్టుకుంది. అయితే, కొన్ని చోట్ల కొన్ని స్లో సీన్స్ ఉన్నా.. ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team