సమీక్ష : మహానుభావుడు – మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్

Mahanubhavudu movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 29, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

దర్శకత్వం : మారుతి దాసరి

నిర్మాత : యువీ క్రియేషన్స్

సంగీతం : థమన్ . ఎస్

నటీనటులు : శర్వానంద్, మెహ్రీన్ కౌర్

ఇప్పటికి రెండుసార్లు పెద్ద హీరోల సినిమాలతో పోటీపడి విజయాల్ని అందుకున్న యంగ్ హీరో శర్వానంద్ ఈసారి ‘మహానుభావుడు’ చిత్రం ద్వారా ‘జై లవ కుశ, స్పైడర్’ వంటి భారీ సినిమాలకు పోటీగా దసరా బరిలోకి దిగాడు. మారుతితో దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…

కథ:

ఓసిడి (అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్) అనగా అతి శుభ్రత.. ఈ లక్షణంతో ఉండే కుర్రాడు ఆనంద్ (శర్వానంద్) తనతో పాటు తన చుట్టూ ఉండే పరిసరాలు, వస్తువులు, వ్యక్తులు కూడా శుభ్రంగా ఉండాలని అనుకుంటాడు. అలా కాకుండా ఎవరైనా చిన్న అశుభ్రతతో కనిపించినా ఓవర్ గా రియాక్టవుతుంటాడు. ఎవరైనా చూయింగ్ గమ్ నమిలి రోడ్డు మీద ఊసినా వాళ్ళకి పెద్ద క్లాస్ పీకుతాడు, జబ్బుతో ఉంటే కనీసం కన్నతల్లిని కూడా దగ్గరకు రానివ్వనంతటి శుభ్రత అతనిది.

అలాంటి లక్షణం కలిగిన ఆనంద్ తన కొలీగ్ మేఘనను ప్రేమిస్తాడు. మేఘన కూడా అతన్ని ఇష్టపడి ఆరంభంలో అతని ఓసిడి లక్షణాల్ని పెద్దగా పట్టించుకోకపోయినా తర్వాత తర్వాత కొన్ని సందర్భాల వలన తట్టుకోలేక బ్రేకప్ చెబుతుంది. అలా ఓసిడి వలన ప్రేమను కోల్పోయిన ఆనంద్ తిరిగి ప్రేమను ఎలా దక్కించుకున్నాడు, ఓసిడికి, ప్రేమకి మధ్యన ఎలా నలిగిపోయాడు, చివరికి అతని జీవితం ఏమైంది అనేదే ఈ ‘మహానుభావుడు’ కథ..

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన ఆకర్షణ హీరో క్యారెక్టరైజేషన్. క్రితంసారి ‘భలే భలే మగాడివోయ్’ లో మతిమరుపు కలిగిన హీరోతో మెప్పించిన దర్శకుడు మారుతి ఈసారి అతి శుభ్రత కలిగిన హీరో పాత్రతో ఆకట్టుకున్నాడు. ఓసిడి లక్షణం అతి మోతాదులో ఉన్నవాళ్లు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వంటి అంశాల్ని చాలా బాగా చూపించడమే గాక వాటి ద్వారానే మంచి హెల్తీ ఫన్ ను జనరేట్ చేశాడు మారుతి. హీరోకి ఇరిటేషన్ వచ్చిన ప్రతిసారి మనకి నవ్వొస్తుంటుంది. హీరో అతి శుభ్రతను ప్రదర్శించే ప్రతి సన్నివేశం మంచి హ్యూమర్ ను కలిగి ఆకట్టుకుంది.

కేవలం ఒక పాత్ర, దానికున్న ఒకే ఒక లక్షణం ద్వారా 2 గంటలకు పైగా సినిమా నడపడమంటే సులభం కాదు. కానీ మారుతి రెండోసారి కూడా ఇదే పనిని సక్సెస్ ఫుల్ గా చేసి మెప్పించాడు. ఫస్టాఫ్ అక్కడక్కడా కొంచెం నెమ్మదించినా సెకండాఫ్ నుండి సినిమా ఊపందుకుని చివరి వరకు ఫన్, లవ్, ఎమోషన్ వంటి అంశాలతో పూర్తి వినోదాన్ని పంచింది. ఓసిడి కలిగిన పాత్రలో హీరో శర్వానంద్ పరకాయ ప్రవేశం చేశాడనే చెప్పాలి. డ్రెస్సింగ్ దగ్గర్నుంచి, ఇతరులతో ప్రవర్తించే తీరు, పరిస్థితులకు స్పందించే విధానాల్లో పర్ఫెక్షన్ చూపించి ఆద్యంతం ఆహ్లాదపరిచాడు.

ఇక మెహ్రీన్, శర్వాల లవ్ ట్రాక్ కూడా కీలకంగా ఉండి ఎక్కడా బోర్ కొట్టలేదు. మెహ్రీన్ కూడా అందంగా కనిపిస్తూనే నటనతో ఆకట్టుకుంది. పాటలు కూడా వినడానికి, చూడడానికి బాగున్నాయి. థమన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించాయి. నాజర్ షఫీ సినిమాటోగ్రఫీ చిత్రాన్ని చాలా అందంగా చూపించి ఆహ్లాదాన్నందించింది.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఆరంభం నుండే ఎలా ఉంటుందో ఊహించేయవచ్చు. హీరో పాత్ర చేసే పనుల్ని, ప్రతిస్పందించే తీరుని తప్ప ఫస్టాఫ్ దాని తర్వాత సెకండాఫ్ ఎలా నడుస్తుంది, క్లైమాక్స్ ఎలా ఉంటుంది, ఎక్కడ కథ మలుపు తిరుగుతుంది అనే అంశాలన్నీ ప్రేక్షకుడు ముందుగా అనుకున్నట్టే ఉంటాయి.

ఇక క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ కోసం ధైర్యం చేసే సీన్ చాలా సినిమాల్లోలాగే రొటీన్ గానే ఉంది. అక్కడ కాస్తంత కొత్తదనమేమన్నా పాటించి ఉంటే బాగుండేది. అలాగే కథనం క్లైమాక్స్ కు దారితీసే కీలకమైన సన్నివేశం కొంత నాటకీయంగా అనిపించింది. సినిమా ఆరంభంలో హీరో పాత్రను పరిచయం చేయడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయమే తీసుకోవడంతో అసలు కథను కాస్తంత ఆలస్యంగా ప్రారంభించిన ఫీల్ కలిగింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు మారుతి హీరోకి ఓసిడి అనే లక్షణాన్ని ఆపాదించి దాని ద్వారానే ఫన్ ను జనరేట్ చేస్తూ, నవ్వించే ఫన్నీ సన్నివేశాలతో, వాటికి కొంత ప్రేమను, చివర్లో ఎమోషన్ ను కనెక్ట్ చేసి సినిమా తీసిన విధానం బాగుంది. ఆరంభం నుండి చివరి వరకు ఎక్కడా బోర్ అనిపించకుండా కథనాన్ని నడిపిన ఆయన రచయితగా, దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశారు. సంగీత దర్శకుడు థమన్ సినిమాకు కావాల్సిన మంచి సంగీతాన్ని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చి తన వంతు న్యాయం చేశాడు.

నాజర్ షఫీ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా మొత్తం కలఫ్ ఫుల్ గా, క్లిస్టర్ క్లియర్ గా అనిపించింది. పాత్రల డైలాగులు, పాటల్లోని లిరిక్స్ ఆకట్టుకున్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. యువీ క్రియఁషన్స్ వారు పాటించిన నిర్మాణ విలువలు గొప్ప స్థాయిలో ఉన్నాయి. ఎక్కడా లోటు కనబడలేదు.

తీర్పు :

మొత్తం మీద ఈ ‘మాహానుభావుడు’ చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి బేషుగ్గా ఎంజాయ్ చేయవచ్చు. కొద్దిగా నెమ్మదించిన ఫస్టాఫ్, ఊహించేయగల కథనం ఇందులో చిన్న చిన్న బలహీనతలు కాగా ఆరంభం నుండి చివరి వరకు నవ్వించే ఫన్నీ సన్నివేశాలు, ఆసక్తికరమైన ఓసిడి కాన్సెప్ట్, మంచి పాటలు, శర్వానంద్ నటన, సినిమా చివర్లో ఎలివేట్ అయ్యే ఎమోషన్ ఆకట్టుకునే అంశాలుగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దసరా పండుగకి కుటుంబమంతా సరదాగా వినోదాన్ని పొందాలి అనుకుంటే ‘మహానుభావుడు’ సినిమాకి వెళితే చాలు.

123telugu.com Rating : 3.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version