విడుదల తేదీ : సెప్టెంబర్ 27, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : ఎ.ఆర్.మురుగదాస్
నిర్మాత : ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు
సంగీతం : హరీశ్ జైరాజ్
నటీనటులు : మహేష్ బాబు, ఎస్.జె.సూర్య, రకుల్ ప్రీత్ సింగ్
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’. రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. మరి ఇన్ని అంచనాలను మోస్తున్న ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
కథ :
ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో ఫోన్ టాపింగ్ ఆఫీసర్ గా పనిచేసే శివ (మహేష్ బాబు) ప్రమాదం జరిగాక నేరస్తుల్ని పట్టుకునే బదులు ఆ ప్రమాదం జరగకుండా చూడాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తూ వీలైనంత మందిని ఆపదల నుండి కాపాడుతూ ఉంటాడు. అదే సమయంలో భైరవుడు (ఎస్.జె. సూర్య) మాత్రం విపరీతమైన తన మానసిక స్థితి వలన ప్రమాదకరంగా తయారై జనాల్ని చంపుతూ ఒక హత్య వలన శివ దృష్టిలో పడతాడు.
అలా తన దృష్టిలో పడ్డ భైరవుడ్ని శివ ఎలా ఎదుర్కున్నాడు ? అసలు భైరవుడి మానసిక స్థితి ఎలాంటిది ? ఎందుకలా తయారైంది ? వరుసగా మనుషుల్ని ఎందుకు చంపుతుంటాడు ?ఎలా చంపుతుంటాడు ? చివరికి అతన్ని శివ ఎలా ఆపాడు ? అనేదే సినిమా కథ..
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ దర్శకుడు మురుగదాస్ ఎంచుకున్న కథాంశం. మనిషిలో కొంత స్థాయిలో మాత్రమే ఉండే పైశాచికత్వం స్థాయిని మించి పెరిగిపోతే ఆ మనిషి మృగంలా ఎలా మారతాడు, ఏం చేస్తాడు, అతను సమాజానికి ప్రమాదంలా ఎలా పరిణమిస్తాడు అనే అంశాలని చాలా బాగా చూపించారాయన. సినిమా చూస్తున్నంత సేపు దర్శకుడు ఎంచుకున్న కథాంశం బాగుందనే ఆలోచన స్ఫురణకు వస్తూనే ఉంటుంది. మంచి కథతో పాటే మురుగదాస్ ఇచ్చిన ప్రస్తుత సమాజానికి అవసరమైన మంచి సందేశం కూడా వాస్తవానికి దగ్గరగా ఉండి ఆకట్టుకుంది.
ఇక ఆయన కథను చెప్పిన తీరు కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫస్టాఫ్లో విలన్ పాత్రను ఎస్టాబ్లిష్ చేయడం, అతనెందుకు అలా తయారయ్యాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాల్ని స్ట్రైకింగా చూపించారు. వాటికి తోడు ఆ పాత్రలో ఎస్.జె సూర్య వంటి నటుడ్ని ఎంచుకుని సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. ఎస్.జె. సూర్య భిన్నమైన సైకిక్ పాత్రకు తన నటనతో ప్రాణం పోశాడు. మహేష్ కి అతనికి మధ్య నడిచే సంభాషణలు, పోరాట సన్నివేశాలు బ్రిలియంట్ గా ఉన్నాయి. ఈమధ్య కాలంలో వచ్చిన విలన్ పాత్రల్లో ఇదే గొప్పదని చెప్పొచ్చు.
అలాగే హీరో మహేష్ బాబు కూడా రెగ్యులర్ స్టార్ హీరోలా కాకుండా కథకు ప్రాధాన్యమిచ్చి సినిమా చేయడం బాగుంది. సినిమా మొత్తంలో ఒక ఇంటెలిజెంట్ పాత్రలానే కదులుతూ, నటనతో ఆకట్టుకుని సినిమాకు తన వంతు చేయాల్సిందంతా చేశాడు. ఇక సెకండాఫ్లో వచ్చే హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే హారీస్ జైరాజ్ సంగీతం యావరేజ్ గానే ఉన్నా కీలక సన్నివేశాల్లోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ భిన్నంగా ఉండి ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమాలోని ప్రధాన అంటే సెకండాఫ్లో తీవ్రత లోపించడం. మొదటి అర్థ భాగం ఉన్నంత బలంగా రెండవ అర్థ భాగం అనిపించదు. దానికి ప్రధాన కారణం మహేష్ పాత్రకు ఒక స్టార్ హీరోకు ఉండాల్సినంత ఎలివేషన్ లేకపోవడమే. మహేష్ ను మొదటిసారి తమిళ ప్రేక్షకులకు పరిచయం చేస్తుండటం వలన భారీ హంగామా లేకుండా కొంచెం ఈజీగానే పరిచయం చేస్తే రిసీవింగ్ పాజిటివ్ గా ఉంటుందనే ఉద్దేశ్యంతో మురుగదాస్ మహేష్ ను ఒక బలమైన పాత్రలా, నటుడిలా మాత్రమే చూపించి ఉండొచ్చు. ఇది మహేష్ అభిమానులకు కాస్త నిరుత్సాహాన్ని కలిగించే అంశం.
అలాగే సెకండాఫ్లో నడిచే మైండ్ గేమ్ ఎపిసోడ్స్ బాగున్నా కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలిగింది. క్లైమాక్స్ లో విలన్ అంతమవడం కూడా ఉన్నట్టుండి జరిగిపోవడం భారీ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులకి కొంత కష్టంగా అనిపించవచ్చు. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ పెద్ద ఆకర్షణీయంగా అనిపించలేదు. ఆరంభంలో బాగున్నా ఆ తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఫీలింగ్ కలిగింది. అలాగే సామాన్య ప్రేక్షకులకు కావల్సిన రెగ్యులర్ కామెడీ స్టఫ్ ఈ సినిమాలో పెద్దగా దొరకదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు మురుగదాస్ ‘స్పైడర్’ కు మంచి కథని దానికి కావాల్సిన ముఖ్యమైన విలన్ పాత్రని, అందులోకి నటుడు ఎస్.జె.సూర్యని, రెండు భాషలకు సరిపడేలా హీరోగా మహేష్ ను ఎంచుకొని ఫస్టాఫ్, సెకండాఫ్ ఆరంభం వరకు సినిమాను ఆకట్టుకునే విధంగా నడిపారు కానీ ఆ తర్వాత భాగాన్నే కొంచెం వీక్ గా తీశారు. ఇక సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనితనం ప్రతి ఫ్రేమ్ లో కనబడింది. క్యాప్చర్ చేయడానికి కష్టమైన యాక్షన్ సన్నివేశాల్ని చాలా స్పష్టంగా కళ్ళ ముందు ఉంచారాయన.
అలాగే స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాలోని మేజర్ హైలెట్స్ లో ఒకటిగా నిలిచాయి. కీలక సన్నివేశాల్లోని విజువల్ ఎఫెక్ట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో గొప్పగా ఉన్నాయి. హారిశ్ జైరాజ్ పాటల సంగీతం యావరేజ్ గానే ఉన్నా సరికొత్త తరహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అలరించారు. శేఖర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాలా గొప్ప స్థాయిలో ఉన్నాయి.
తీర్పు :
మహేష్ ఈసారి రెగ్యులర్ స్టార్ హీరోయిలా కాకుండా బలమైన కథకు, పాత్రలకు ప్రాధాన్యమిచ్చి చేసిన ‘స్పైడర్’ చిత్రం ఆయన చేసిన మంచి ప్రయత్నమని చెప్పొచ్చు. దర్శకుడు మురుగదాస్ ఎంచుకున్న కథ, రాసుకున్న కథనం, ప్రతినాయకుడి పాత్ర, అందులో ఎస్.జె. సూర్య నటన, మహేష్ పెర్ఫార్మెన్స్, ఫస్టాఫ్ కథనం, సినిమాలోని సోషల్ మెసేజ్ ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా సెకండాఫ్లో తీవ్రత లోపించడం, ఫ్యాన్స్ ఆశించే స్థాయిలో మహేష్ కు ఎలివేషన్ లేకపోవడం, రెగ్యులర్ ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మిస్సవడం బలహీనతలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ ‘స్పైడర్’ రెగ్యులర్ ఆడియన్సుని మరీ ఎక్కువగా మెప్పించలేకపోవచ్చు కానీ బలమైన కథలని, మహేష్ నుండి భిన్నత్వాన్ని కోరుకునే ప్రేక్షకులకు నచ్చుతుంది.
123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team