సమీక్ష: “మేజర్” – ఎమోషనల్ యాక్షన్ డ్రామా

సమీక్ష: “మేజర్” – ఎమోషనల్ యాక్షన్ డ్రామా

Published on Jun 4, 2022 3:03 AM IST
Major Movie Review

విడుదల తేదీ : జూన్ 03, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు: అడివి శేష్, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ

దర్శకత్వం : శశి కిరణ్ టిక్కా

నిర్మాత: సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, AMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A ప్లస్ S సినిమాలు

సంగీత దర్శకుడు: శ్రీ చరణ్ పాకాల

సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు

ఎడిటర్: వినయ్ కుమార్ సిరిగినీడి & కోదాటి పవన్ కళ్యాణ్

అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం “మేజర్‌”. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ప్రతిష్టాత్మక చిత్రం మంచి అంచనాల మధ్య నేడు థియేటర్లలో విడుదల అయ్యింది. మరీ ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ:

 

సందీప్ ఉన్ని కృష్ణ‌న్ (అడివి శేష్‌) ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన యువకుడు. చిన్ప‌ప్ప‌టి నుంచి నేవీలో చేరాల‌నే కోరిక సందీప్‌లో బాగా ఉండేది. కానీ అనుకోకుండా ఆర్మీలో జాయిన్ అవుతాడు. ఆ స‌మయంలోనే ఇషా (సాయి మంజ్రేక‌ర్‌)తో సందీప్‌కి పరిచ‌యం ఏర్ప‌డుతుంది. అది కాస్త ప్రేమ‌గా మారి, ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత సందీప్ ఆర్మీలో ఎన్ఎసీజీ క‌మెండో టీమ్‌కు ట్రైన‌ర్‌గా ఎదుగుతాడు. ఇంట్లో చిన్న స‌మ‌స్య రావడంతో సందీప్ ఇంటికి బయలుదేరుతాడు. కానీ సందీప్ ముంబై చేరుకోగానే ఉగ్రదాడి మొద‌ల‌వుతుంది. ఆ సమయంలో సందీప్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడు? తాజ్ హోట‌ల్‌లో దాగిన ఉగ్ర వాదుల‌ను మ‌ట్టు పెట్ట‌డంలో సందీప్ ఎలాంటి పాత్ర‌ను పోషించాడు? అనేది తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

గతంలో ముంబై 26/11 దాడులపై అనేక చిత్రాలు రూపొందించబడ్డాయి. కానీ మేజర్ సినిమాను మాత్రం దర్శకుడు శశి కిరణ్ నటీనటులు ఎంపిక, వారి నటన, కాస్ట్యూమ్స్, మ్యూజిక్‌, ఆర్ట్ వర్క్, టెక్నికల్‌ అంశాలు ఇలా అన్నింటిని పర్‌ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి తెరక్కించాడు.

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివిశేష్‌ కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించాడు. అంతేకాదు ఈ సినిమా కోసం అడివి శేష్ తన లుక్‌ని పూర్తిగా మార్చుకున్నాడు. ఇంట‌ర్ చ‌దివే కుర్రాడిగా, యుక్త వ‌య‌స్కుడిగా, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుడిగా తన మార్క్ నటనని ప్రదర్శించాడు. ఇక క‌థ‌, స్క్రీన్ ప్లే విష‌యంలో కూడా అడివి శేష్ అంతా తానై ముందుండి న‌డిపించాడు.

ఇక తండ్రి పాత్రలో ప్రకాష్‌ రాజ్‌ చక్కగా సెట్ అయ్యాడు. కథని నడిపించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోశించారు. క్లైమాక్స్‌లో ఆయన చెప్పే డైలాగులు ప్రేక్ష‌కుడికి ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అవుతాయి. అడివి శేష్‌కి తల్లిగా రేవతి కూడా చక్కగా నటించారు.

అడివిశేష్ ప్రియురాలిగా, భ‌ర్త ప్రేమ కోసం ఎదురు చూసే ఇల్లాలి పాత్ర‌లో సాయీ మంజ్రేకర్‌ చక్కగా నటించింది. మరియు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ఇక అతిథి పాత్రలో శోభితా ధూళిపాళ్ల మెప్పించింది. ఆమె పాత్రను క్లైమాక్స్‌కి లింక్ చేసిన విధానం చాలా బాగుంది. సుపీరియ‌ర్ ఆఫీస‌ర్‌గా మురళీ శర్మ తన పాత్రకి చక్కటి న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్:

 

ఫస్ట్ హాఫ్‌లో సినిమా చాలా స్లోగా మొదలవుతుందన్న భావన ప్రేక్షకుడిలో కలుగుతుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తన జీవితంలో సైనికుడిగా మారాలనే లక్ష్యం మరింత మెరుగైన పద్ధతిలో ఉండి దానిని చూయించిన విధానం మరి కాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది.

ఒక కొన్ని సన్నివేశాలు ఊహించదగినవిగా ఉన్నాయి. అలాగే సినిమాను ఒకింత నాటకీయంగా మార్చాలంటే భార్యాభర్తల సమస్యలకు మరింత డ్రామా జోడించి ఉండాల్సింది. 26/11 దాడులలో ముంబై పోలీసులు కీలక పాత్ర పోషించారు మరియు అనేక మంది వీర సైనికులు ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ అంశాన్ని అసలు చూపించలేకపోయారు.
 

సాంకేతిక విభాగం:

 

అడివి శేష్ యొక్క సినిమాలు వాటి పటిష్టమైన సాంకేతిక అంశాలకు ప్రసిద్ధి చెందాయి మరియు మేజర్‌ కూడా అలాంటిదే. తాజ్ హోటల్‌ను ప్రదర్శించడానికి వేసిన ప్రొడక్షన్ డిజైన్ మరియు సెట్‌లు అత్యుత్తమమైనవి. శ్రీచరణ్ పాకాల సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది.. వంశీ ప‌చ్చి పులుసు సినిమాటోగ్ర‌ఫీ బావుంది.

దర్శకుడు శశి కిరణ్ తిక్క విషయానికి వస్తే అతను సినిమాను చాలా బాగా తెరక్కించాడు. భావోద్వేగాలను చూపెడుతూనే 26/11 దాడులలో ఏమి జరిగిందో వివరంగా మరియు ఖచ్చితమైన పద్ధతిలో చూపించాడు. అబ్బూరి ర‌వి రాసిన ఎమోష‌న‌ల్ డైలాగ్స్ చివ‌ర‌లో ప్రేక్ష‌కుడికి ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అవుతాయి. ఈ ముగింపు కథనంలో ఉత్తమ భాగమని చెప్పాలి.

 

తీర్పు:

 

ఇక మొత్తంగా చూసుకున్నటైతే దేశభక్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన “మేజర్” సినిమా క్రియేట్ చేసుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గలేదు. అడివి శేష్ అద్భుతమైన నటన, మంచి కథనం, మరియు ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయి. ఒక్క స్లోగా సాగే కథనం అనే దానిని పక్కన పడితే ఈ వారాంతంలో ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చూసేయొచ్చు.

123telugu.com Rating: 3.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు