సమీక్ష : మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు – ఓ అందమైన కావ్యం..

Mallela-Teeramlo-Sirimalle- విడుదల తేదీ : 06 జూలై 2013
దర్శకుడు : రామరాజు
నిర్మాత : ఉమాదేవి
సంగీతం : పవన్ కుమార్
నటీనటులు : శ్రీ దివ్య, క్రాంతి…


ఈ మధ్య కాలంలో ఎక్కడో ఒకటి మచ్చుకి హృదయానికి హత్తుకునే సినిమాలు వస్తుంటాయి. అలా తెరకెక్కించిన సినిమానే ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’. ‘మనసారా’, ‘బస్ స్టాప్’ సినిమాలో నటించిన శ్రీ దివ్య ప్రధాన పాత్రలో, క్రాంతి హీరోగా నటించిన ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయ్యింది. కానీ కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల చాలా కాలంగా రిలీజ్ కి నోచుకోని ఈ సినిమాని రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాని మేము ఒక రోజు ముందే ప్రత్యేకంగా తిలకించడం వల్ల ఈ సినిమా రివ్యూని మీకందిస్తున్నాం..

కథ :

ఈ సినిమా కథ మొత్తం లక్ష్మీ(శ్రీ దివ్య) చుట్టూ తిరుగుతూ ఉంటుంది. లక్ష్మీ చాలా సింపుల్ గా, అందంగా ఉండే ఓ సాంప్రదాయబద్దమైన అమ్మాయి. లక్ష్మీ వాళ్ళ నాన్న(రావు రమేష్) ఓ మంచి సంబంధం వచ్చిందని నీకు ఇష్టమైతే పెళ్లి చేస్తానని చెప్పడంతో మంచి సంబంధం అబ్బాయి కూడా బాగున్నాడు కదా అని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి అయిన తర్వాత తన భర్త తనతో సరిగా ఉండడు. ఎప్పుడూ డబ్బు సంపాదించాలి అనే మూడ్ లోనే ఉంటాడు. ఇంకేమీ ఆలోచించాడు, ఇక దేని గురించి పెద్దగా పట్టించుకోడు. అది లక్ష్మీకి అంతగా ఇష్టం ఉండదు. అదే సమయంలో తనకి సినిమాలకి పాటలు రాసే క్రాంతి(క్రాంతి) పరిచయమవుతాడు. వారిద్దరి పరిచయం కాస్తా మంచి స్నేహంగా మారుతుంది. కానీ కొద్ది రోజులకి లక్ష్మీ తనకి క్రాంతి మీద ఉన్నది స్నేహం కాదు ప్రేమ అని తెలుసు కుంటుంది. లక్ష్మీ ప్రేమని క్రాంతి అంగీకరించాడా? లేదా? అలాగే లక్ష్మీ తనతో సరిగా లేని భర్తని వద్దనుకొని తెగతెంపులు చేసుకొని క్రాంతి దగ్గరికి వెళ్లిపోయిందా? లేక తనతోనే సర్దుకు పోయిందా? అనేది మీరు వెండి తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే డైలాగ్స్. ఈ మూవీలోని డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీ దివ్య నటన సింప్లీ సూపర్బ్. శ్రీ దివ్య సాంప్రదాయబద్దమైన చీరల్లో అచ్చమైన బాపు బొమ్మలా కనిపించింది. అలాగే దర్శకుడు అనుకున్న పాత్రకి వందకి వంద శాతం న్యాయం చేసింది. క్రాంతి నటన పాత్రకి తగ్గట్టుగా చాలా నీట్ గా ఉంది. సినిమాలో శ్రీ దివ్యకి భర్తగా చేసినతని నటన చాలా బాగుంది. ఈ సినిమా మన తెలుగు కల్చర్ ని, మన లైఫ్ గురించి చెప్పే కొన్ని ఫిలాసఫీ సూత్రాలను ఇష్టపడే వారికి సినిమా బాగా నచ్చుతుంది. సినిమాలో హీరో హీరోయిన్ , హీరోయిన్ – తన ఫాదర్ మధ్య వచ్చే కొన్ని సంభాషణలు ప్రేక్షకులకి చాలా కనెక్ట్ అవుతాయి.

సినిమాలో విజువల్స్ చాలా అందంగా ఉన్నాయి. సినిమాలో చూపించే ప్రతి ఫ్రేం కన్నుల విందుగా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ ఎంతో బ్రిలియంట్ గా కలర్స్ ని ఉపయోగించారు. ఈ సినిమాకోసం ఎంచుకున్న కథని, దాన్ని చూపించిన విధానం చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా రోటీన్ సినిమా ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు ఎందుకంటే ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు ఏవీ లేవు ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ అస్సలు లేదు. సినిమా మొదటి నుంచి చివరి దాకా కాస్త సీరియస్ గా కాస్త అందమైన కవితలా సాగుతుంది. అలాగే సినిమాని చాలా నిదానంగా సాగుతుంది. ఈ సినిమాని కొంతమంది ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొనే తీసారు అందుకే ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కొంతమంది మనసునే గెలుచుకుంటుంది. ఈ సినిమాలో రొమాంటిక్ ట్రాక్ బాగుంది కానీ ప్రస్తుతం ఉన్న యువతని ఆకట్టుకునేలా లేదు. ఈ సినిమాలో డైలాగ్స్ బాగున్నాయి కానీ పిలాసఫీ మీద రాసిన కొన్ని డైలాగ్స్ అన్ని వర్గాల వారికీ అర్థం కాకపోవచ్చు. దర్శకుడు చెప్పాలనుకున్న విషయానికి కనెక్ట్ అయిన వారికి సినిమా బాగానిపిస్తుంది కానీ ఎవరికైతే కనెక్ట్ అవ్వదో వారు మాత్రం నిరుత్సాహానికి గురవుతారు.

సాంకేతిక విభాగం :

ఇది వరకే చెప్పినట్టు ఈ సినిమాని అద్భుతమైన దృశ్య కావ్యంలా మన కళ్ళకు చూపించిన సినిమాటోగ్రాఫర్ బాల్ రెడ్డికి హ్యాట్సాఫ్ చెప్పాలి. సినిమా మొత్తం చూపించేది రెండు మూడు లొకేషన్ లే అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ చూపించే ప్రతి లొకేషన్ కొత్తగా చూపించడానికి ప్రయత్నించాడు. డైలాగ్స్ చాలా బాగున్నాయి, దర్శకుడు ఎంచుకున్న కథకి డైలాగ్స్ ప్రాణం పోశాయని చెప్పాలి. సినిమా కాస్త బోర్ కొట్టేలా ఉంది, సీన్ సాగదీసినట్టుగా ఉంది అనుకున్న ప్రతి చోటా ఎడిటర్ కాస్త కత్తెర పెట్టుంటే బాగుండేది.

రామరాజు రాసుకున్న కథ బాగుంది, దానిని అంతే అందంగా తెరపై ఆవిష్కరించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అలాగే సినిమాలో అచ్చమైన తెలుగుదనాన్ని చూపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కానీ ఆయన వీటన్నిటితో పాటు కమర్షియల్ అంశాలలో కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. సినిమాలోని చాలా సైలెంట్ సన్నివేశాలకు మ్యూజిక్ డైరెక్టర్ పవన్ కుమార్ చెవులకు వినసొంపైన సంగీతాన్ని అందించి మనం ఆ సీన్ లో లీనమయ్యీల చేసాడు. పాటలు కూడా బాగున్నాయి.

తీర్పు :

‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ సినిమా ఓ అందమైన కావ్యం లాంటి సినిమా. ఈ సినిమా చూడటానికి ఓ అద్భుతమైన దృశ్య కావ్యంలా ఉంటుంది. ఎంతమందికి నచ్చుతుంది అనేది చెప్పలేము కానీ ఒకటి మనందరికీ బాపు గారి బొమ్మలంటే చాలా ఇష్టం. కానీ అయన ఆ బొమ్మని ఎలా గీసారా అని మొదటి చూసే ఓపిక చాలా తక్కువ మందికి ఉంటుంది. అంత ఓపిక ఉన్నవారు మరియు రొటీన్ కి భిన్నంగా సినిమా చూడాలనుకునేవారు ఈ సినిమాని హ్యాపీ గా చూడొచ్చు. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు లేని బాపు సినిమాలా ఉంటుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : (ఈ సినిమాకి మన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ఇచ్చినట్లు 1 నుంచి 5 లోపు రేటింగ్ ఇవ్వలేము, అలా ఇచ్చే సినిమా కాదు)

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version