విడుదల తేదీ : నవంబర్ 4, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : ఆర్పీ పట్నాయక్
నిర్మాత : గురజాల జగన్‍మోహన్
సంగీతం : ఆర్పీ పట్నాయక్
నటీనటులు : ఆర్పీ పట్నాయక్, అనిత..
గతంలో మ్యూజిక్ డైరెక్టర్‌గా స్టార్ స్టేటస్‌ను కొట్టేసిన ఆర్పీ పట్నాయక్, కొద్దికాలంగా దర్శకత్వ బాధ్యతలను చేపట్టి పలు ఆసక్తికర సినిమాలను చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఆ కోవలోనే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాయే ‘మనలో ఒకడు’. విడుదలకు ముందు మంచి అంచనాలనే రేకెత్తించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..
కథ :
కృష్ణమూర్తి (ఆర్పీ పట్నాయక్) తన భార్య (అనిత)తో కలిసి సాఫీగా బతికే ఓ నిజాయితీ గల ప్రొఫెసర్. అంతా బాగానే ఉన్న అతడి జీవితంలో మీడియా చేసిన ఒక తప్పుడు ప్రచారం వల్ల మొత్తం కథంతా అడ్డం తిరుగుతుంది. ఆ ప్రచారంతో సమాజంలో కృష్ణమూర్తి తలెత్తుకోని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దీనిపై ఆ ఒక్కడే ఎలా పోరాటం చేశాడు? తన నిజాయితీని ప్రపంచానికి ఎలా చాటి చెప్పుకున్నాడూ? అన్నదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
చాలా సహజంగా ఉండే కథ, ఎమోషన్స్‌నే ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా చెప్పుకోవాలి. ఒక ప్రొఫెసర్ అనుకోకుండానే ఒక తప్పుడు ప్రచారంలో చిక్కుకోవడం, అతడి జీవితమంతా ఈ ఒక్క సంఘటన వల్లే అస్థవ్యస్తం అవ్వడం, దీనిపై ఆయనే పోరాటానికి దిగడం అన్న కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎక్కడా అతి చేయకుండా చాలా రియలిస్టిక్‌గానే కథను నడిపి దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకు మంచి న్యాయం చేకూర్చాడు. నటుడిగానూ ఆయన తన శక్తిమేర సినిమాను నడిపించగలిగాడు.
చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అనిత తన పాత్రలో చాలా బాగా ఒదిగిపోయి నటించింది. ఆర్పీ పట్నాయక్‌తో కలిసి ఎమోషనల్ సన్నివేశాల్లోనూ ఆమె బాగా ఆకట్టుకుంది. సాయి కుమార్ తన పాత్రలో అలవోకగా నటించేశాడు. శ్రీముఖి కూడా తన పరిధిమేర బాగానే నటించింది. ఫస్టాఫ్‌ను సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవాలి.
మైనస్ పాయింట్స్ :
ఎంతో ఆసక్తికరంగా నడిచే ఫస్టాఫ్ తర్వాత సినిమా ఆ స్థాయిలో లేకపోవడమే ఇబ్బంది పెట్టే అంశం. ఫస్టాఫ్ మొత్తాన్నీ రియలిస్టిక్‌గా, తెలివిగా నెరేట్ చేసి సెకండాఫ్ విషయంలో మాత్రం ఫెయిలయ్యారు. అదేవిధంగా సన్నివేశాలన్నీ చాలా నెమ్మదిగా నడుస్తూ థ్రిల్లర్ కాగల సినిమాను పూర్తిగా ఆ ఫీల్ పోగొట్టేలా చేశాయి. రన్‌టైమ్ కూడా కాస్త ఎక్కువగా ఉండడం మైనస్ అనే చెప్పాలి.
క్లైమాక్స్ కూడా బాగానే ఉన్నా హడావుడిగా ఆ పోర్షన్‌ను ముగించినట్లు అనిపించింది. ఇక అనవసరంగా వచ్చే రెండు పాటలు కూడా బాగా ఇబ్బంది పెట్టాయి.
సాంకేతిక విభాగం :
ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆర్పీ పట్నాయక్ అందించిన పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు. ఎడిటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. డైలాగ్స్ మాత్రం రియలిస్టిక్‌గా ఉంటూ బాగా ఆకట్టుకున్నాయి.
దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ సినిమాను తన భుజాలపై నడిపించాడనే చెప్పొచ్చు. ఒక రియలిస్టిక్ కథను ఎంచుకొని దానికి తగ్గ బలమైన స్క్రీన్‌ప్లే రాసుకోవడం దగ్గరే ఆయన మంచి విజయం సాధించారు. సెకండాఫ్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే కథ వేరేలా ఉండేది.
తీర్పు :
ఒక సాధారణ వ్యక్తి తనకి జరిగిన అన్యాయంపై మీడియాపై చేసే పోరాటమే ఈ ‘మనలో ఒకడు’. ఆర్పీ పట్నాయక్ చెప్పాలనుకున్న బలమైన కథ, అందుకు తగ్గట్టుగానే అల్లిన స్క్రీన్‌ప్లే లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో సెకండాఫ్ అక్కడక్కడా నెమ్మదించడం, కాస్త లెంగ్త్ ఎక్కువవ్వడం లాంటివి మైనస్‌గా చెప్పుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఓ సోషల్ మెసేజ్‌తో వచ్చిన ఈ సినిమా చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం బాగానే చెప్పింది.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team