విడుదల తేదీ : 08 జూలై, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : పాండిరాజ్
నిర్మాత : జూలకంటి మధుసూదన్ రెడ్డి
సంగీతం : అర్రోల్ కారెల్లి
నటీనటులు : సూర్య, అమలా పాల్
తమిళంలో హీరో సూర్య నిర్మించి, నటించిన పసంగ – 2 అనే చిత్రం ఎట్టకేలకు తెలుగులో ‘మేము’ పేరుతో డబ్ అయి ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడు పాండి రాజ్ దర్శకత్వంలో సూర్య, అమలా పాల్ జంటగా నటించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
కథ :
నవీన్, నైనా అనే ఇద్దరు అతి చురుకైన అల్లరి పిల్లలు వాళ్ళ చేష్టలతోటి వాళ్ళ అమ్మానాన్నలకు పెద్ద సమస్యగా మారుతారు. దీంతో వాళ్ళని దారిలో పెట్టాలన్న ఉద్దేశ్యంతో తల్లి దండ్రులు ఆ పిల్లలిద్దరినీ బోర్డింగ్ స్కూల్ లో జాయిన్ చేస్తారు. అక్కడ కూడా వాళ్ళు అలాగే అల్లరి చేస్తూ ఒకరోజు అక్కడి నుండి పారిపోతారు.
దీంతో ఇక చేసేది లేక పిల్లల తల్లిదండ్రులు వాళ్ళను చిన్న పిల్లల సైకియార్టిస్ట్ సూర్యకు చూపిస్తారు. సూర్య కూడా ఆ పిల్లలో మార్పు తేవాలని నిర్ణయించుకుంటాడు. అలా సూర్య, అతని భార్య అమలా పాల్ ఆ పిల్లల్ని ఎలా మార్చారు? వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పును తెచ్చారు? అన్నదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది దర్శకుడు ఎంచుకున్న ‘ఈరోజుల్లో సమాజంలో పిల్లలు ఎదుర్కుంటున్న సమస్యలు’ అన్న కాన్సెప్ట్. అలాగే ఆ సమస్యలకు ఆయన చూపిన పరిష్కారం కూడా చాలా బాగుంది. విభిన్నమైన సైకియార్టిస్ట్ పాత్రను ఒప్పుకుని దాన్ని పోషించిన సూర్య ఈ సినిమాకి మరో పెద్ద అసెట్. ఆ పాత్రలో ఆయన నటన, పిల్లల సమస్యలను హ్యాండిల్ చేసిన తీరు చాలా అద్భుతంగా ఉంది.
అలాగే ముఖ్యమైన అల్లరి పిల్లల పాత్రలు పోషించిన ఇద్దరు పిల్ల నటన కూడా ఆకర్షణీయంగా ఉంది. ఇకపోతే పిల్ల వల్ల తల్లిదండ్రులు ఎదుర్కుంటున్న సమస్యలను కూడా చాలా బాగా చూపించారు. పిల్లల వల్ల గందరగోళానికి గురయ్యే తల్లి పాత్రలో బిందు మాధవి నటన బాగుంది.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు ఎంచుకున్న పాయింట్, చూపిన పరిష్కారం బాగానే ఉన్నా కథను నడిపిన విధానం మాత్రం చాలా నెమ్మదిగా ఉంది. సినిమా మొదటి భాగం మొత్తం రోజువారీ జీవితంలో తల్లిదండ్రులకు పిల్లలు తెచ్చిపెట్టే సమస్యలనే చూపించడం బోరింగ్ గా ఉంది. సమస్యలను చూపడానికి ఎక్కువ టైమ్ తీసుకుని చివరి 15 నిముషాల్లో హడావుడిగా పరిష్కారం చూపడం అంతగా మెప్పించలేదు. సినిమా ఆద్యంతం నెమ్మదిగా సాగుతూ రెండవ భాగం అయితే మరీ బోర్ కొట్టిస్తుంది.
అలాగే కథనం నెమ్మదించి కీలక సన్నివేశాల్లో కొత్తదనం లోపించింది. సినిమా చాలా వరకూ బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించిన తారే జమీన్ పర్ ను పోలి ఉంది. పాటలూ అవీ లేకుండా చాలా తక్కువ సమయంలో అందంగా చెప్పాల్సిన కథను దర్శకుడు సాగదీసి ఎక్కువ సమయంలో చెప్పాడు.
సాంకేతిక విభాగం :
సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ప్రసుత విద్యా విధానం, వాటిలోని సమస్యలను చెప్పడం బాగుంది. సంగీతం అంతగా మెప్పించలేదు. కనీసం రెండు పాటలనైనా కత్తిరించి రన్ టైమ్ తగ్గించవలసింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు రిపీట్ అవుతున్నట్టు అనిపించడంతో కథనం బోరింగ్ గా అనిపిస్తుంది.
ఈరోజుల్లో పిల్లలు, తల్లి దండ్రులు ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారు అనే కీలక అంశాన్ని తీసుకుని దర్శకుడు పాండిరాజ్ చేసిన ప్రయత్నం బాగుంది. కథను ఇంకాస్త క్రిస్పీగా చెప్పి ఉంటే ఆ ప్రయత్నం మరింతగా ఫలించేది.
తీర్పు :
ఈరోజుల్లో తల్లిదండ్రులకు పిల్లల వల్ల ఎదురయ్యే సమస్యలను ఆధారంగా చేసుకుని వచ్చిన సినిమానే ‘మేము’. ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. నెమ్మదించిన, ఊహాజనితమైన కథనాలను పక్కనబెడితే వాస్తవ జీవితంలో అలాంటి సమస్యలను ఎదుర్కునే ప్రతి తల్లిదండ్రులకు ఈ కథ ఎమోషనల్ గా కనెక్టవుతుంది. అలాకాక ఎంటర్టైన్మెంట్ కోరుకునే రెగ్యులర్ ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించదు.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team