విడుదల తేదీ : ఏప్రిల్ 13, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : ప్రభుదేవ, సనత్ రెడ్డి, దీపక్ పరమేష్, ఇందుజా, శశాంక్ పురుషోత్తం
దర్శకత్వం : కార్తిక్ సుబ్బరాజ్
నిర్మాత : కార్తికేయన్ సంతానం, జయంతిలాల్ గడ
సంగీతం : సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫర్ : ఎస్.తిరునవుక్కరసు
ఎడిటర్ : వివేక్ హర్షన్
స్క్రీన్ ప్లే : కార్తిక్ సుబ్బరాజ్
తమిళ యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన సైలెంట్ థ్రిల్లర్ ‘మెర్క్యూరీ’. అసలు సంభాషణలే లేకుండా తీసిన ఈ సినిమా మొదటి నుండి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని రేకెత్తించింది. మరి ఇంత ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
కథ :
స్నేహితులైన ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి కలిసి ఊరికి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్లో ఒక రాత్రి పెద్ద పార్టీని చేసుకుంటారు. పార్టీ తర్వాత కారులో బయటికెళ్లిన ఆ నలుగురు ప్రమాదవశాత్తు ఒక వ్యక్తిని(ప్రభుదేవ) కారుతో గుద్దేసి దాన్నుండి తప్పించుకోవడానికి అతన్ని తీసుకెళ్లి ఒక ఫ్యాక్టరీలో పడేస్తారు.
అలా వారి వలన బాధకు గురైన ఆ వ్యక్తి ప్రమాదం తర్వాత ఏమయ్యాడు, వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకున్నాడు, ప్రభుదేవ కథేమిటి, ఈ నలుగురు స్నేహితులు ఎవరు, సినిమాను సంభాషణలే లేకుండా దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ ఎలా చిత్రీకరించారు అనేదే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో అన్నిటికంటే ఎక్కువగా ఆసక్తిని కలిగించే అంశం పాత్రలు. కార్తిక్ సుబ్బరాజ్ ఈ సైలెంట్ థ్రిల్లర్ ను ఎలా రూపొందించారు అనే ప్రశ్నకు ఆ పాత్రల వద్దే సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానం కూడ పేక్షకులు పూర్తిగా కన్విన్స్ అయి పాత్రల మధ్యన మాటలు లేవే అనే అసంతృప్తికి గురికాకుండా చేస్తుంది. ప్రతి పాత్రను పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్న ఆయన సినిమా చివర్లో కార్పొరేట్ విధానం భూమిని, వాతావరణాన్ని ఎలా కలుషితం చేస్తుంది, దాని వలన మనుషుల జీవితాలు ఎలా నాశనమవుతున్నాయి అనే సందేశాన్నివ్వడం బాగుంది.
కథలో ప్రధాన పాత్రధారి ప్రభుదేవ గతం కొంత ఆసక్తికరంగానే ఉంటుంది. అలాగే ఆయన నటన, ఇతర కీలక పాత్రధారుల నటన ఆకట్టుకున్నాయి. సినిమా మొత్తాన్ని రాత్రి సమయంలో, ఒక ఫ్యాక్టరీలో బ్యాక్ డ్రాప్లో సెట్ చేసిన విధానం, లొకేషన్లు మెప్పించాయి. ముఖ్యంగా కెమెరా వర్క్ ఇంప్రెస్ చేసింది. అలాగే ఫస్టాఫ్, సెకండాఫ్లలోని రెండు మూడు సీన్స్ థ్రిల్ ఫీలయ్యేలా చేశాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమాను సైలెంట్ గా తీయడమనే కాన్సెప్ట్ బాగున్నా అందులో బలమైన కథ, కథనాలు లేకపోవడమే నిరుత్సాహానికి గురిచేసింది. కార్తిక్ సుబ్బరాజ్ చేసిన ఈ భిన్నమైన ప్రయత్నానికి తోడు మంచి థ్రిల్ ఇచ్చే స్టోరీ, స్క్రీన్ ప్లే ఉండి ఉంటే బాగుండేది. సినిమా అసలు కథ రివీల్ అయ్యాక ఈ కథలో కొత్తదనం ఏముంది అనే ఫిలింగ్ కలుగుతుంది.
పైగా సినిమా మొత్తం మీద పైన చెప్పినట్టు రెండు మూడు సన్నివేశాలు తప్ప మిగతా ఏ సన్నివేశం కూడ థ్రిల్ చేయలేకపోయింది. ప్రభుదేవ మనుషుల్ని చంపే విధానం, అతన్నుండి భాదితులు తప్పించుకునే ప్రయత్నాలు ఏవీ కూడ థ్రిల్ చేయలేకపోయాయి. మాటలు లేవు కదా అయితే సౌండ్ ఎఫెక్ట్స్ అద్దిరిపోతాయి అనుకునే వారికి నిరుత్సాహం తప్పదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని తీవ్రతను, ఎమోషన్ ను పెద్దగా క్యారీ చేయలేకపోయింది.
ఇక క్లైమాక్స్ అయినా గొప్పగా ఉందా అంటే అదీ లేదు. ప్రీ క్లైమాక్స్ బాగున్నా ముగింపులో కథ ఉన్నట్టుండి వేరే ట్రాక్ తీసుకొని కొన్ని ప్రశ్నలను, కొంత అసంతృప్తిని మిగిల్చింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ చేసిన సినిమాను మాటలు లేకుండా రూపొందించడమనే ప్రయత్నం నిజంగా అభినందనీయం. అలాగే పాత్రలు మాట్లాడుకోకపోవడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న కారణం చాలా ఖచ్చితంగా ఉంది. కానీ ఆయన బలమైన కథ, థ్రిల్ చేసే కథనం, సన్నివేశాలను రాసుకోకపోవడమే కొంత నిరుత్సాహానికి గురిచేస్తుంది.
ఎస్.తిరునవుక్కరసు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా చాలా వరకు నైట్ ఎఫెక్ట్స్ లో తీసినా ఎక్కడా ఇబ్బంది కలగలేదు. సతీశ్ కుమార్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంది. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ చేసిన అటెంప్ట్ మంచిదే అయినా పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. సినిమాను సైలెంట్ మోడ్లో తీయడం, సినిమాటోగ్రఫీ, థ్రిల్ చేసే రెండు మూడు చిన్న సన్నివేశాలు, నటీనటుల నటన, సోషల్ మెసేజ్ వంటి అంశాలు కొంతవరకు మెప్పించినా కథ, కథనాల్లో కొత్తదనం, తీవ్రత, చెప్పుకోదగిన థ్రిల్స్ లేకపోవడం వంటి బలహీనతలు కొత్తదనాన్ని ఆశించేవారికి నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. మొత్తం మీద ఈ ‘మెర్క్యూరీ’ కొంతమంది చేత మంచి ప్రయత్నం అనిపించుకుంటుంది తప్ప మెజారిటీ ప్రేక్షకుల్ని మెప్పించదు.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team