సమీక్ష : మిస్ మ్యాచ్ – స్లోగా సాగే ఎమోషనల్ లవ్ డ్రామా

Mismatch review

విడుదల తేదీ : డిసెంబర్  06, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : ఉద‌య్ శంక‌ర్‌, ఐశ్వ‌ర్యా రాజేష్

దర్శకత్వం : ఎన్.వి.నిర్మల్ కుమార్

నిర్మాత‌లు :  జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్

సంగీతం :  గిఫ్టన్ ఇలియాస్


ఉద‌య్ శంక‌ర్‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరో హీరోయిన్లుగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బ్యాన‌ర్‌ పై ఎన్ వి. నిర్మల్ ద‌ర్శ‌క‌త్వంలో జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మిస్తోన్న చిత్రం `మిస్ మ్యాచ్‌`. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

సిద్ధూ (ఉద‌య్ శంక‌ర్‌) చిన్నప్పటి నుండే జీనియస్.. తన అద్భుతమైన మెమోరీ పవర్ తో గిన్నీస్ బుక్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకుంటాడు. అలాగే కనకమహాలక్ష్మి (ఐశ్వ‌ర్యా రాజేష్) చిన్న తనంలోనే చదువు మానేసి కుస్తీనే జీవితంగా మార్చుకుంటుంది. ఒలింపిక్ లో గోల్డ్ మోడల్ కొట్టాలనే లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తోంది. ఇలా తమ వృత్తులతో పాటు ఇష్టాలలో మరియు ఆలోచనలలో చివరికీ వారి జీవన శైలిలో కూడా పూర్తి విరుద్ధమైన లక్షణాలు ఉన్న ఈ ఇద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు ? ఆ ప్రేమ కోసం ఇద్దరూ ఏమి చేశారు? ఇంతకీ కనకమహాలక్ష్మి ఒలింపిక్ లో గోల్డ్ మోడల్ సాధించడానికి ఎన్ని సమస్యలను ఎదుర్కొంది ? కనకమహాలక్ష్మి ఆ సమస్యల నుండి బయటపడి గెలవటానికి సిద్దు ఎలాంటి సహాయ సహకారాలు అందించాడు ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండి తెర పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఏ అంశంలోనూ మ్యాచ్ కానీ ఒక అమ్మాయి అబ్బాయి ఇష్ట పడి ఒక్కర్ని ఒక్కరూ కావాలనుకోవడం.. కానీ వారి జంట వారి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అందరికీ పూర్తి ‘మిస్ మ్యాచ్‌’గా అనించడం.. ఇక ఆ ప్రేమికులిద్దరూ అందర్నీ ఎలా ఒప్పించారు ఈ క్రమంలో వాళ్ళు అనుకున్నది సాధించి ఎలా ఒక్కటయ్యారు అనే కాన్సెప్ట్‌ తో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచి మెసేజ్ అలాగే ఎమోషనల్ గా సాగే లవ్ స్టోరీ ఉంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన ఉదయ్ శంకర్ తన పాత్రకు తగ్గట్లు చాల బాగా నటించాడు. ముఖ్యంగా హీరోయిన్ తో ప్రేమలో పడే సీన్ లో మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు.

అలాగే కుస్తీ వీరురాలి పాత్ర‌లో నటించిన ఐశ్వ‌ర్యా రాజేష్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించింది. మెయిన్ గా ఆమె పాత్ర ద్వారా స్పోర్ట్స్ కి సంబంధించి ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్ బాగుంది. ఇక ఐశ్వ‌ర్యా రాజేష్ బలహీనమైన ఎమోషనల్ సీన్స్ లో కూడా తన నటనతో ఆ సీన్స్ ను పండించింది. హీరో హీరోయిన్ల కలయికలో వచ్చే కొన్ని లవ్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ హీరోకి ప్రపోజ్ చేసే సన్నివేశం. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు నిర్మల్ కుమార్ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేని రాసుకోలేకపోయారు. సినిమాలో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. పైగా అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. దీనికి తోడు ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగుతాయి. ఇక హీరో హీరోయిన్ ల క్యారెక్టర్స్ ను చిన్నప్పటి నుండి ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ వారి మధ్య వ్యత్యాసాన్ని బలంగా ఎలివేట్ చేయలేకపోయారు. వారిద్దరూ లవ్ లో పడితే ఎలా.. వీరిద్దరూ మిస్ మ్యాచ్ కదా అనే ఫీలింగ్ ఆడియన్స్ కు కనీసం లవ్ ట్రాక్ స్టార్టింగ్ లోనైనా అనిపించాలి కదా. కానీ మొదటినుంచీ ఆ ఫీలింగ్ ఎక్కడా కలగదు. మొత్తానికి ఇంటర్వెల్ కి గాని కథ ముందుకు కదలదు.

అయితే సెకెండ్ హాఫ్ లో సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల ఒక ఊరు మొత్తం తీవ్రంగా ఇబ్బంది పడుతుందనే అంశాన్ని తీసుకొచ్చి కథలో సీరియస్ నెస్ తో పాటు అదే ట్రాక్ ను లవ్ స్టోరీకి బాగానే కనెక్ట్ చేసినప్పటికీ.. కొన్ని లవ్ సీన్స్ జస్ట్ పర్వాలేదనిపిస్తే.. కుస్తీ గేమ్ కి సంబంధించిన సన్నివేశాలు ఎక్కడా బలంగా అనిపించవు. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా సాగతీసినట్లు చాల స్లోగా సాగుతుంది.

 

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. గిఫ్టన్ ఇలియాస్ అందించిన సంగీతం పర్వాలేదు. గణేష్ చంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు ఎన్.వి.నిర్మల్ కుమార్ మంచి స్టోరీ లైన్ తో మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నా, సరైన కథనాన్ని మాత్రం రాసుకోలేకపోయారు.

 

తీర్పు :

ఏ అంశంలోనూ మ్యాచ్ కానీ ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్యూర్ ప్రేమ పుడితే.. అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ తో పాటు ఎమోషనల్ సాగే లవ్ ట్రాక్ అలాగే క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాలో ఆకట్టుకుంటాయి. కాకపోతే రెగ్యులర్ ట్రీట్మెంట్, బోరింగ్ ప్లే అండ్ ఇంట్రస్టింగ్ గా సాగని వెరీ స్లో నేరేషన్ సినిమా ఫలిత్తాన్ని దెబ్బ తీసింది. ఓవరాల్ గా ఈ ‘మిస్ మ్యాచ్’ ఆడియన్స్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

 

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version