విడుదల తేదీ : డిసెంబర్ 09, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: విశ్వక్ సేన్, వికాస్ వశిష్ఠ, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్, చైతన్య రావు, రవిశంకర్
దర్శకుడు : గంగాధర్
నిర్మాతలు: ప్రదీప్ యాదవ్, మోహన్ యెల్లా
సంగీత దర్శకులు: కాల భైరవ
సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ బెజుగం
ఎడిటర్: పవన్ కళ్యాణ్ కోదాటి
సంబంధిత లింక్స్: ట్రైలర్
ముఖచిత్రం పేరుతో మరో చిన్న చిత్రం నేడు థియేటర్ల లోకి వచ్చింది. యంగ్ హీరో విశ్వక్ సేన్ అతిధి పాత్రలో నటించిన ఈ చిత్రానికి గంగాధర్ దర్శకత్వం వహించారు. మంచి బజ్ తో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.
కథ:
రాజ్ కుమార్ (వికాస్ వశిష్ట) ఒక ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్, మహతి (ప్రియా వడ్లమాని) అనే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. కానీ మాయా ఫెర్నాండెజ్ (అయేషా ఖాన్) అనే మరో అమ్మాయి అతన్ని చిన్నప్పటి నుండి ప్రేమిస్తూనే ఉంటుంది. రాజ్ వివాహం మాయా కు నిరాశను కలిగిస్తుంది. అంతా చక్కగా జరుగుతుంది అని అనుకున్నప్పుడు, రాజ్ జీవితాన్ని తలకిందులు చేసే సంఘటనలు ఎదురవుతాయి. ఆ సంఘటనలు ఏమిటి? అవి రాజ్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? డాక్టర్ సత్య (చైతన్య రావు) రాజ్ జీవితంలో ఎలా భాగమయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెండితెర పై సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ను, రిలేటివ్ కాన్సెప్ట్‌ని ఎంచుకొని ఎలాంటి సంకోచం లేకుండా సినిమా తీసినందుకు మేకర్స్‌ని అభినందించాలి. సామాజిక సందేశం అందించిన చిత్రం ప్రేక్షకులను బాగా ఆలోచింపజేస్తుంది. కీలకమైన క్లైమాక్స్ ఎపిసోడ్‌లో విశ్వక్ సేన్ ఉండటం చిత్రానికి బలాన్ని చేకూర్చింది. విశ్వక్ సేన్ అతిధి పాత్రలో చాలా చక్కగా నటించాడు.
సినిమా సెకండ్ హాఫ్ చాలా డీసెంట్‌గా ఉంది, చాలా ఇంటెన్స్ గా, ఆసక్తికరం గా అనిపిస్తుంది. మళ్ళీ, ఇక్కడ ఉన్నటువంటి ట్విస్టు లు చాలా బాగున్నాయి, సినిమా పై మంచి ప్రభావాన్ని సృష్టిస్తాయి. కొన్ని సన్నివేశాలు ఇందులో బాగా జస్టిఫై చేయబడ్డాయి. చివరి గంటలో సినిమా చాలా బాగా ఆకట్టుకుంది.
ఈ చిత్రం లో లీడ్ రోల్ లో నటించిన ప్రియా వడ్లమాని సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆమె కీలక సన్నివేశాలలో అద్భుతంగా నటించింది. సాంప్రదాయ అమ్మాయిగా ప్రియా నటన చాలా ఎఫెక్టివ్‌గా ఉంది. వికాస్ వశిష్ఠ తన పాత్రలో బాగానే నటించాడు. చైతన్య, అయేషా ఖాన్‌లు తమ బెస్ట్ ను అందించారు.
మైనస్ పాయింట్స్:
ఒక మంచి కాన్సెప్ట్‌తో ముందుకు రావడంలో మేకర్స్ విజయం సాధించినప్పటికీ, కథనం అంత ఆకర్షణీయంగా లేదు, మొత్తంగా సినిమా ప్రభావం తగ్గింది. తక్కువ నిడివితో ఉన్న సినిమా స్క్రీన్‌ప్లే అద్భుతాలు చేసి ఉండేది. కొన్ని చోట్ల కామెడీ పని చేయలేదు.
మెయిన్ స్టోరీ లోకి వెళ్ళడానికి డైరెక్టర్ చాలా సమయం తీసుకున్నాడు.ఇందుకు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించినట్లు ఉంటుంది. మొదటి గంట మొత్తం ప్లాట్‌కు సంబంధించి పెద్దగా ఏమీ ఉండదు. మెయిన్ లీడ్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అంత ఎఫెక్టివ్ గా లేదు. ఇంటర్వెల్ నుండి మాత్రమే కొంచెం ఆసక్తికరం గా మారుతాయి.
మళ్లీ చివరి గంటలో మొదటి కొన్ని నిమిషాలు వృథా అయ్యాయి. కొన్ని చోట్ల, సినిమా కాస్త ఓవర్‌బోర్డ్‌గా, మెలో డ్రామాటిక్‌గా సాగింది. సన్నివేశాలు సింపుల్ గా చూపించి ఉంటే, మెసేజ్ మరింత ప్రభావం చూపేది. ఇంకా చెప్పాలంటే, సినిమాలో కొన్ని లాజిక్‌లు మిస్ అయ్యాయి, వాటిని స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంది.
సాంకేతిక విభాగం:
కాల భైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక సన్నివేశాల్లో చాలా పవర్ ఫుల్ గా ఉంది. అయితే పాటలు అంత గొప్పగా లేవు. శ్రీనివాస్ బెజుగం సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే ఎడిటింగ్ టీమ్ కొన్ని అనవసరమైన సన్నివేశాలను తొలగించి సినిమాను కాస్త ట్రిమ్ చేసి ఉండాల్సింది.
దర్శకుడు గంగాధర్ విషయానికి వస్తే, అతను సినిమాతో పర్వాలేదు అని అనిపించాడు. సందీప్ రాజ్ రాసిన కథ ఆకట్టుకునేలా ఉండగా, ఎగ్జిక్యూషన్ అందుకు తగినట్లు గా లేదు. మొదటి గంటకు సంబంధించి మరింత జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. సినిమాలో మెయిన్ ప్లాట్ ను ముందుగా సెట్ చేసి ఉండాల్సింది. ఈ చిత్రం కి ఆర్టిస్టులు తమ బెస్ట్ ను అందించారు.
తీర్పు:
మొత్తం మీద, ముఖచిత్రం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కొన్ని మంచి సన్నివేశాలతో అక్కడక్కడ ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాలో మంచి ట్విస్ట్ లతో పాటుగా నటీనటుల పెర్ఫార్మెన్స్ లు బాగున్నాయి. అయితే ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ను భరించగలిగితే సినిమాను థియేటర్ల లో ఒకసారి చూడవచ్చు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team