ఆడియో సమీక్ష : మనం – మనసుకు హత్తుకునే మధురమైన పాటలు..

Manam
అక్కినేని వీరాభిమానులతో పాటు, అటు సినీ ప్రేమికులు, తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘మనం’. కళామ్మతల్లి ముద్దుబిడ్డ డా. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా ఇది. ఆయనతో పాటు నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఈ సినిమాలో సమంత, శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటించారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నాడు. గతంలో మనకు ‘ఇష్క్’ లాంటి కలర్ఫుల్, స్వీట్ లవ్ స్టొరీని మనకు అందించిన విక్రమ్ కుమార్ ఈ ‘మనం’ అనే కుటుంబ కథా దృశ్య కావ్యానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. ఎలాంటి ఆర్భాటం లేకుండా మే 9న డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదలైన ఈ సినిమా ఆడియోలో మొత్తం 5 పాటలు ఒక థీమ్ సాంగ్ ఉంది. అందులో అనూప్ 4 మెలోడీ సాంగ్స్, 1 ఫాస్ట్ బీట్ రీమిక్స్ సాంగ్ ఉంది. ప్రస్తుతం బయట అందరినీ ఆకట్టుకుంటున్న ఈ ఆల్బంలోని సాంగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1. పాట : కనులను తాకే


గాయకుడు : అరిజిత్ సింగ్

సాహిత్యం : వనమాలి

టీ..టీటిటిటిటిటీటి అంటూ ఒక చిన్న పాప వాయిస్ తో పాటు వినసొంపైన కీ బోర్డ్ సౌండ్ తో ‘కనులను తాకే’ పాట మొదలవుతుంది. ఆల్బంలోని మొదటి మెలోడియస్ సాంగ్ ఇది. హీరో హీరోయిన్ కోసం తనలోని విరహాన్ని వ్యక్త పరిచే భావాలను వనమాలి చాలా బాగా రాశారు. అలాంటి పాటకి అరిజిత్ సింగ్ తన వాయిస్ తో ప్రాణం పోశాడు. పాట పల్లవి చివరిలో వచ్చే ‘నీలో ఉన్నా నీలోనే ఉన్నా’ అనే లైన్స్ వచ్చేటప్పుడు మేల్ సింగర్ తో పాటు వచ్చే లేడీ కోరస్ చాలా బాగుంది. అనూబ్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ లో స్లో డ్రమ్ బీట్స్ ఇస్తూనే వయోలిన్, గిటార్, కీ బోర్డ్ తో ఇచ్చిన సంగీతం చాలా వినసొంపుగా ఉంది. ఈ ఆల్బంలో మొదటి సారి వినగానే ఈ పాట మీకు నచ్చేస్తుంది.


2. పాట : చిన్ని చిన్ని ఆశలు


గాయనీ గాయకులు : శ్రేయా ఘోషల్, అశ్విన్, హరి

సాహిత్యం : చంద్రబోస్

ఆల్బంలో వచ్చే ఈ రెండో మెలోడీ సాంగ్ చిలకాకోయిల రావాలతో మొదలవుతోంది. హీరో తన తొలిప్రేమ గురించి హీరోయిన్ కి వివరించే ఈ పాటకి అశ్విన్, హరిల వాయిస్ చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఈ పాటకి వీళ్ళిద్దరి వాయిస్ ఒక ఎత్తైతే చివరి చరణంలో వచ్చే శ్రేయా ఘోషల్ వాయిస్ మరో ఎత్తు. తను పాడింది ఒక చరణమే అయినా తన వాయిస్ పాటకి ప్రాణంగా మారింది. వీళ్ళు ముగ్గురు ఈ పాటని ఇంత బాగా పాడటానికి ప్రధాన కారణం చంద్రబోస్ సాహిత్యం అని చెప్పాలి. తొలిచూపు ప్రేమ నుంచి జీవితాంతం ఎలా కలిసిమెలిసి ఉంటాం అనే కాన్సెప్ట్ ని ఈ పాటలో చాలా బాగా చెప్పాడు. అనూప్ గిటార్, కీ బోర్డ్ లాంటి వాయిద్యాలతో పాటు మధ్య మధ్యలో గజల్ సౌండ్స్, చిన్న చిన్న బీట్స్ తో పాటని అందరికీ కనెక్ట్ చేసాడు. ఇది ఆల్బంలో ఈ సాంగ్ బెస్ట్ అని చెప్పాలి.


3. పాట : కనిపెంచిన మా అమ్మకే


గాయకుడు : మాస్టర్ భరత్ అండ్ కోరస్

సాహిత్యం : చంద్రబోస్

చాలా స్లోగా వచ్చే కీ బోర్డ్ సౌండ్స్ తో మొదలయ్యే ‘కనిపెంచిన మా అమ్మకే’ పాటను మాస్టర్ భరత్ చాలా బాగా పాడాడు. తన గాత్రానికి తోడైన కోరస్ కూడా చాలా బాగుంది. ఒక చిన్న పిల్లవాడు తన అమ్మ, నాన్న, తన కుటుంబం తనపై చూపించిన ప్రేమ గురించి వివరించే ఈ పాటకి చంద్రబోస్ అందించిన సాహిత్యం ప్రతి ఒక్కరి మనసును కదిలించే రేంజ్ లో ఉంది. కీ బోర్డ్, గజల్స్, వయొలిన్, గిటార్ తో అనూప్ రూబెన్స్ మనసుకు హత్తుకునేలా ఈ పాటని కంపోజ్ చేసాడు. పిల్లలను, పెద్దలను ఈ పాట బాగా ఆకట్టుకుంటుంది


4. పాట : పియో పియో రే

గాయకులు : జస్ప్రీత్ జాస్జ్, అనూప్ రూబెన్స్

సాహిత్యం : అనూప్ రూబెన్స్

‘మనం’ ఆల్బంలో ఉన్న ఏకైక ఫాస్ట్ బీట్ సాంగ్ ‘పియో పియో రే’. బాగా ఎనర్జిటిక్ గా ఫుల్ జోష్ తో సాగే ఈ పబ్ సాంగ్ ని జస్ప్రీత్ సింగ్, అనూప్ రూబెన్స్ కలిసి చాలా ఎనర్జీతో పాడారు. ఈ పాట మధ్య మధ్యలో వచ్చే ఎఎన్ఆర్ ‘నేను పుట్టాను’ సాంగ్ రీమిక్స్ మరియు ‘టాటాట్టట్టట్టటట్టాటట్టట్టట్ట’ అనే లైన్స్ ఈ పాటకే హైలైట్ అని చెప్పాలి. ఒక క్లబ్ లో సాగే ఈ పాటకి అనూప్ సరైన బీట్స్ తో సాంగ్ ని బాగా కంపోజ్ చేయడమే కాకుండా సాహిత్యాన్ని కూడా పాటకి తగ్గట్టు రాసాడు. ఈ పాట మొదటి సారి విన్నప్పుడు పెద్దగా అనిపించకపోయినా ఒక నాలుగైదు సార్లు విన్నాక మాత్రం ఈ పాటకి అడిక్ట్ అయిపోతారు.


5. పాట : ఇది ప్రేమ

గాయకుడు : హరి చరణ్

సాహిత్యం : చంద్రబోస్

పైన వచ్చిన ‘కనిపించిన మా అమ్మకే’ పాటకే ఇది సెకండ్ వెర్షన్. అక్కడ చిన్న పిల్లాడు పాడే ఈ పాటని ఇందులో ఒక కుర్రాడు పాడతాడు. ఈ వెర్షన్ కి హరి చరణ్ చక్కని గాత్రాన్ని అందించి యువతను మెప్పించేలా పాడాడు.

 

6. పాట : మనం థీమ్

స్పానిష్ స్టైల్లో వచ్చే మ్యూజిక్ తో మొదలయ్యే ఈ థీమ్ మొదట్లో మన తెలుగు నేటివిటీకి సరిపోయేలా ఓ లేడీ వాయిస్ రావడం బాగుంది. ఆ తర్వాత బీట్స్, గిటార్, వయొలిన్ సౌండ్స్ తో వచ్చే మరియా అనే స్పానిష్ వాయిస్ కూడా బాగా కుదిరింది. సినిమాలో సరైన ప్లేస్ లో పడితే సూపర్బ్ గా ఉంటుంది.

 

తీర్పు :

అక్కినేని ఫ్యామిలీ మూడుతరాల హీరోలు కలిసి నటించిన ‘మనం’ సినిమాకి అనూప్ రూబెన్స్ చాలా ఫ్రెష్ గా, వినసొంపైన, మధురమైన మెలోడియస్ సాంగ్స్ ని అందించాడు. అనూప్ కంపోజ్ చేసిన మెలోడియస్ ని ఎక్కడా పోనివ్వకుండా చంద్రబోస్, వనమాలి రాసిన సాహిత్యం అత్యంత మధురం అని చెప్పాలి. ఈ మూవీ ఆల్బం అనూప్ లాంగ్ కెరీర్లో టాప్ 3 లో నిలిచిపోతుందని చెప్పవచ్చు. నా పరంగా ఈ ఆల్బంలోని పాటలకి ఆర్డర్ చెప్పాలంటే ‘చిన్ని చిన్ని ఆశలు’, ‘కనులను తాకే’, ‘పియో పియో రే’ మరియు ‘కనిపెంచిన మా అమ్మకే’. ఎఎన్ఆర్ చివరిగా నటించిన ఈ సినిమా ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో ఎలా నిలిచిపోతుందో, అదేలా ఈ పాటల్లోని సాహిత్యం, మాధుర్యం కూడా నిలిచిపోతుంది.

రాఘవ

మనం పాటల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version