సమీక్ష 2 : నాయక్ – అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్

Nayak-latest విడుదల తేదీ : 09 జనవరి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకుడు : వి.వి. వినాయక్
నిర్మాత : డి. వి. వి. దానయ్య
సంగీతం : తమన్
నటీనటులు : రామ్ చరణ్, కాజల్, అమలా పాల్…


సంక్రాంతి పండుగ రేసులో మొదటగా వస్తున్న నాయక్ పోటీలో దిగింది. రచ్చ హిట్ కొట్టి ఊపు మీదున్న రామ్ చరణ్ మొదటిసారి ద్విపాత్రాభినయంలో నటించిన సినిమా ‘నాయక్’. వివి వినాయక్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలా పాల్ కథా నాయికలుగా నటించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ రోజే విడుదలైంది. నాయక్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :
చెర్రీ (చరణ్) హైదరాబాదులో ఉంటూ తన మామయ్య జిలేబి (బ్రహ్మానందం) కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు. జిలేబి వల్ల చెర్రీ లోకల్ డాన్ అయిన బాబ్జి (రాహుల్ దేవ్) ని కలవడం, అతని చెల్లెలు మధు (కాజల్) ని ప్రేమిస్తాడు. బాబ్జికి మస్కా కొట్టి అతని చెల్లెలు మధుతో తిరుగుతుంటాడు చెర్రీ.. మరో వైపు కలకత్తాలో వరుస హత్యలు చేస్తున్న వ్యక్తి (?) కోసం వెతుకుతున్న సీబీఐ బృందం హైదరాబాద్ వస్తారు. హైదరాబాదులో డీజీపి హత్యా జరగడం ఆ హత్యకి చెర్రీకి లింక్ ఉందని భావించిన సీబీఐ అతన్ని అరెస్ట్ చేస్తుంది. అదే సమయంలో ఆ హత్యలు చేస్తుంది చెర్రీ కాదు సిద్ధార్థ్ నాయక్ (చరణ్) అని తెలుస్తుంది. అసలు ఈ సిద్ధార్థ్ నాయక్ ఎవరు? ఈ వరుస హత్యలు ఎందుకు చేస్తున్నాడు అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

చరణ్ మొదటిసారి ద్విపాత్రాభినయంలో నటించాడు. సిద్ధార్థ్ నాయక్ పాత్రని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో బాగా పండించాడు. చెర్రీ పాత్రలో కామెడీ కూడా బాగానే పండించాడు. కామెడీ టైమింగ్ బాగానే ఇంప్రూవ్ చేసుకున్నాడు. లైలా ఓ లైలా, శుభలేఖ రాసుకున్నా రీమిక్స్ పాటల్లో చరణ్ డాన్సులు అదరగొట్టాడు. ఫాన్స్ చేత విజిల్స్ వేయించే డైలాగులు కూడా పడ్డాయి. బ్రహ్మానందం జిలేబి కామెడీ బావుంది. పార్టీ ఇస్తానంటూ ఫుడ్ పెట్టించే సీన్ కడుపుబ్బా నవ్వించింది. జయప్రకాష్ రెడ్డి కామెడీ కృష్ణ సినిమాలో పాత్రని కంటిన్యూ చేస్తూ కామెడీ కూడా అదరగొట్టాడు. పంచ్ డైలాగులు వేస్తూ సినిమాని చాలా వరకు హైలెట్ చేసాడు. బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి మధ్య వచ్చే సీన్స్ అన్ని బాగా నవ్వించాయి. పోసాని కృష్ణ మురళి చాక్లెట్ కామెడీ కూడా బాగా పండింది. దాదాపు 10 నిముషాలు ఉన్న ఈ ఎపిసోడ్ అంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. ప్రదీప్ రావత్ తన పాత్ర వరకు బాగానే చేసాడు. ఫస్ట్ హాఫ్ కామెడీ తో పర్వలేదనిపించినా సెకండ్ హాఫ్ శుభలేఖ రాసుకున్నా రీమిక్స్ సాంగ్స్ తరువాత నుండి స్క్రీన్ ప్లేలో వేగం పెరిగింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా ఆసక్తికరంగానే నడిపించాడు. శుభలేఖ రాసుకున్న పాట చిత్రీకరణ చాలా బావుంది.

మైనస్ పాయింట్స్ :

ఆకుల శివ గత పది సంవత్సరాలుగా వచ్చిన సినిమాల నుండి హైలెట్ పాయింట్స్ తీసుకుని నాయక్ కథని అల్లుకున్నాడు. అదుర్స్, సింహాద్రి, శివాజీ, మిరపకాయ్ లాంటి చాలా సినిమాల నుండి సన్నివేశాలు ఇన్స్పైర్ అయి రాసుకున్నాడు. సింహాద్రి సినిమాలో ఉండే పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని స్వల్ప మార్పులతో అలాగే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గా వాడుకున్నారు. కృష్ణ సినిమాలోని కామెడీ సన్నివేశాల్ని కంటిన్యూ చేసారు. సినిమాలో ప్రతి సన్నివేశం ఇంతకు ముందు ఏదో సినిమాలో చూసామే అనిపిస్తుంది. సబ్ ప్లాట్ లాగా కొన్ని వాడుకున్న చిల్లర విలన్ ఎపిసోడ్ కూడా పండలేదు. హీరోయిన్స్ ఇద్దరికీ పాటలు మినహా పాత్రలకి అస్సలు ఇంపార్టెన్స్ ఏమీ లేదు. అమలా పాల్ అయితే రెండు సన్నివేశాలు మినహా ఆమె పాత్ర వల్ల ఉపయోగం ఏమి లేదు. హే నాయక్ పాటలో చూపించిన గ్రాఫిక్స్ బాలేవు. ఎంతో ఊరించిన ఎవ్వారమంటే పాట స్క్రీన్ మీద అంతగా పండలేదు.

సాంకేతిక విభాగం :

చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ మొదట్లో కొంత ఇబ్బంది పెట్టినా తరువాత బావుంది. కత్తి లాంటి పిల్లా, ఒక చూపుకే పడిపోయా, శుభలేఖ రాసుకున్నా పాటల్లో సినిమాటోగ్రఫీ బావుంది. ఆకుల శివ అయితే త్రివిక్రమ్ పంచ్ డైలాగ్ స్టైల్ ఫాలో అయ్యాడు. ఫస్ట్ హాఫ్ లో దాదాపు లెక్కకు మించినన్ని పంచ్ డైలాగులు రాసుకున్నాడు. అయితే సమయం సందర్భం లేకుండా పంచ్ డైలాగులు వదలడం వల్ల చాలా వరకు పేలకుండానే కొట్టుకుపోయాయి. ఎడిటింగ్లో కొన్ని జెర్క్స్ ఉన్నాయి కానీ సెకండ్ హాఫ్ లో బావుంది. ఫైట్స్ లో వైర్ వర్క్ ఎక్కువవడం వల్ల ఫ్లాష్ బ్యాక్ ఫైట్ మినహా మిగతావి అంత ఆసక్తి కలిగించలేకపోయాయి. తమన్ నేపధ్య సంగీతం పెద్దగా లేకపోయినా పాటలు మాత్రం బావున్నాయి.

తీర్పు :

నాయక్ అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్. చాలా సినిమాల నుండి కలగాపులగం చేస్తూ రాసుకున్న కథ నిరాశ పరిచినా కథనంలో వేగం, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి కామెడీ సినిమాని నిలబెట్టాయి. మాస్ ప్రేక్షకులకి కావాల్సిన అంశాలు నాయక్ సినిమాలో చాలా ఉండటంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు కూడా బాగా వస్తాయి. నాయక్ మాస్ ప్రేక్షకులకి సంక్రాంతి కానుక.
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

అశోక్ రెడ్డి .ఎమ్

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version