విడుదల తేదీ : అక్టోబర్ 13, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : ఓంకార్
నిర్మాత : ప్రసాద్ వి.పొట్లూరి, నిరంజన్ రెడ్డి, ఓక్ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం : ఎస్. తమన్
నటీనటులు : నాగార్జున, సమంత, శీరత్ కపూర్
‘రాజుగారి గది’ తో సంచలన విజయం అందుకున్న దర్శకుడు ఓంకార్ ఈసారి ‘రాజుగారి గది-2’ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నాగార్జున, సమంత లాంటి స్టార్లు నటించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొంది. ఇన్ని అంచనాల నడుమ ఈ రోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
కథ :
అశ్విన్, ప్రవీణ్, కిశోర్ లు సొంతంగా ఒక రిసార్ట్ కొని బిజినెస్ స్టార్ట్ చేసి జీవితంలో పైకెదగాలని అనుకుంటుంటారు. కానీ అంతలోనే ఆ రిసార్ట్స్ లో అమృత (సమంత) అనే ఆత్మ ఉందనే నిజం వాళ్ళ ముగ్గురికీ అనుభవంలోకి వస్తుంది. అలా దెయ్యం వలన ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆ కష్టం నుండి బయటపడటానికి రుద్ర(నాగార్జున) అనే మెంటలిస్టును ఆశ్రయిస్తారు.
కేవలం కళ్ళు చూసి మనసులో ఏముందో చెప్పగల రుద్ర వాళ్ళ కష్టం తీర్చడానికి రిసార్ట్స్ కు వచ్చి తన పరిశోధన ప్రారంభిస్తాడు. ఆ పరిశోధనలో రుద్ర తెలుసుకున్న నిజాలేంటి, అసలు అమృత ఎవరు, ఆత్మగా మారిన ఆమె ఆ రిసార్ట్స్ లోనే ఎందుకుంది, చివరికి రుద్ర ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు అనేదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
అక్కినేని నాగార్జున, సమంతలు కథలో ఉన్న రెండు కీలక పాత్రల్ని చేయడమే సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. మెంటలిస్ట్ పాత్రలో నాగార్జున నటన, లుక్, యాటిట్యూడ్ ఆకట్టుకున్నాయి. ఆయన కనిపిస్తున్నంతసేపు కాస్త ఉత్సాహంగానే అనిపిస్తుంటుంది. అలాగే ఆత్మగా సమంత పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. తనని బాధపెట్టిన వాళ్ళపై పగ తీర్చుకోవాలనుకునే ఆత్మగా ఆమె నటన అదుర్స్ అనేలా ఉంది. ఇక నాగ్, సమంతలు కలిసి కనబడే క్లైమాక్స్ సన్నివేశంలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయింది.
కారణం లేకుండా కష్టపెడితే మనుషులు ఎంతలా బాధపడతారు, మంచి వాళ్ళైనా సరే క్రోదంగా ఎలా మారుతారు అనే అంశాన్ని చాలా బాగా చూపించారు. కథకు కీలకమైన సమంత నైపథ్యం కూడా సెంటిమెంటల్ గా కొంతవరకు బాగానే ఉంది. అలాగే ఫస్టాఫ్, సెకండాఫ్ లలో వెన్నెల కిశోర్, షకలక శంకర్ కామెడీ అక్కడక్కడా నవ్వించగా నాగార్జున సమంత కేసును డీల్ చేసిన విధానం, నిజాల్ని కనుగొన్న తీరు కొంతమేర ఆసక్తికరంగానే సాగాయి. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే కీలక సన్నివేశాల్లో భలేగా అనిపించింది.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో సరైన కథ, కథనాలు లేకపోవడమే పెద్ద మైనస్. ఫస్టాఫ్ ఆరంభమైన 45 నిముషాలకు కూడా అసలు కథను ఓపెన్ చేయకుండా, నాగార్జున పాత్రను ప్రవేశపెట్టకుండా వెన్నెల కిశోర్, ప్రవీణ్ లపై చాలాసేపు ఒకే తరహా కామెడీని నడిపి టైమ్ పాస్ చేయడంతో బోర్ కొట్టింది. అలాగే అసలు పాత్ర సమంతను కూడా ఇంటర్వెల్ వరకు రివీల్ చేయకుండా ప్రాముఖ్యతలేని శీరత్ కపూర్ కి పాత్రకి మాటి మాటికీ ఎలివేషన్ ఇవ్వడంతో సినిమాను రన్ టైమ్ కోసమే లాగుతున్నారని స్పష్టంగా అర్థమైపోయింది.
మంచి టైమింగ్ తో, హావభావాలతో హెల్తీ కామెడీని పండించగల వెన్నెల కిశోర్, షకలక శంకర్ వంటి నటుల్ని కొద్దిగా మాత్ర్రమే వాడుకుని చాలా వరకు బలవంతపు కామెడీకి పరిమితం చేయడం కూడా మరొక డ్రాబ్యాక్. సరే మొదటి నుండి చెబుతున్నట్టు సినిమాలో చెప్పుకోదగిన హర్రర్ సన్నివేశాలేమైనా ఉన్నాయా అంటే అవీ లేవు. ఉన్నవి కూడా పెద్దగా కదిలించలేకపోయాయి. అలాగే సినిమా రివెంజ్ డ్రామా అని ఆరంభంలోనే తెలిసిపోతుంది కాబట్టి కథాన్ని సులభంగానే ఊహించేయవచ్చు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు ఓంకార్ ఒక హర్రర్, థ్రిల్లర్ కు కావాల్సిన కథ, కథనాలను సంతృప్తికర స్థాయిలో అల్లుకోలేదనే అనాలి. ఎమోషనల్ గా బాగున్న కథకు కదిలించే హర్రర్ సన్నివేశాలని జోడించి, కొద్దిగా ఎగ్జైట్మెంట్ ఉన్న కథనాన్ని జోడించి ఉంటే ప్రేక్షకుడికి ఇంకాస్త బెటర్ గా ఎంజాయ్ చేయడానికి అవకాశం దొరికేది. కానీ ముఖ్యమైన నాగార్జున, సమంతల పాత్రల్ని మాత్రం బాగానే డిజైన్ చేసి ఎలివేట్ చేశారాయన. రచయిత అబ్బూరి రవి మాటలు బాగున్నాయి.
సంగీత దర్శకుడు థమన్ చేసిన బ్యాక్ గ్రౌండ్ సినిమాకు బాగా సహాయపడింది. దివాకరన్ సినిమాటోగ్రఫీ ఆహ్లాదకరంగా అనిపించింది. ఇక విజువల్ ఎఫెక్ట్స్ అయితే అంత గొప్ప స్థాయిలో లేవు. ఎడిటింగ్ ద్వారా ఫస్టాఫ్లోని కొన్ని అనవసరమైన కామెడీ సీన్లను తొలగించి ఉండాల్సింది. నిర్మాణ సంస్థలు పివిపి, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి పాటించిన నిర్మాణ విలువలు గొప్ప స్థాయిలో ఉన్నాయి.
తీర్పు :
దర్శకుడు ఓంకార్ ‘రాజుగారి గది-2’ ని మొదటి భాగం ‘రాజుగారి గది’ ని తీసిన స్థాయిలో తీయకపోయినా ఎమోషనల్ గా కదిలించే విధంగా అయితే తీశారు. దానికి తోడు అయన ఇంకొద్దిగా బలంగా ఉన్న కథనాన్ని, హర్రర్ కంటెంట్ ను అందించి ఉంటే బాగుండేది. భావోద్వేగపూరితమైన సినిమా ఆఖరు 20 నిముషాలు, సమంత, నాగ్ ల పాత్రలు, వారి నటన ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా పేలవమైన టేకింగ్, పెద్దగా ఆకట్టుకోని ఫస్టాఫ్, కొన్ని బలవంతపు కామెడీ సన్నివేశాలు మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ చిత్రం ప్రేక్షకుల్ని పెద్దగా మెప్పించక, నిరుత్సాహపరచక యావరేజ్ అనిపిస్తుంది.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team