సమీక్ష : నన్ను వదిలి నీవు పోలేవులే – కొందరి సినిమా మాత్రమే!

Oopiri review

విడుదల తేదీ : ఏప్రిల్ 1 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : గీతాంజలి శ్రీరాఘవ

నిర్మాత : కోలా భాస్కర్‌, కంచర్ల పార్థసారధి

సంగీతం : అమృత్‌

నటీనటులు : బాలకృష్ణ కోలా, వామికా గబ్బి..

’7/G బృందావనం కాలనీ’ సినిమా ద్వారా సంచలనం సృష్టించిన శ్రీ రాఘవ ఇప్పుడు కేవలం కథ, స్ర్కీన్ ప్లే అందించిన ’నన్ను వదిలి నీవు పోలేవులే’ కి దర్శకత్వం మాత్రం తన భార్య గీతాంజలి శ్రీరాఘవ చేశారు. బాలకృష్ణ కోలా, వామికా గబ్బి హీరో, హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా తమిళనాట కొద్దిరోజుల క్రితమే విడుదల కాగా, తెలుగులో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

ప్రభు (బాలకృష్ణ కోలా) ఓ సాధారణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అమ్మాయి ప్రేమ కోసం పరితపిస్తుండే అతడు అందంగా లేకపోవడంతో అన్నిచోట్ల అపజయం ఎదురవుతుంటుంది. మరోవైపు మనోజ (వామికా గబ్బి) ధనవంతురాలైన అమ్మాయి. తనకి గతంలో జరిగిన చెడు అనుభవాల కారణంగా పెళ్లికి దూరంగా ఉంటుంది. కానీ మనోజ తల్లికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆమె ప్రోద్భలంతో బలవంతంగా ప్రభుని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. తమ అంతరాల మధ్య ఉన్న తేడా కారణంగా వారి మధ్య విభేదాలు మొదలవుతాయి, చివరికి అవి తారాస్థాయికి చేరతాయి. అయితే చివరికి తమ మధ్య ఉన్న విభేదాలను తొలగించుకుని వీరిద్దరూ ఒకటి ఎలా అయ్యారు అన్నది కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో వామికా గబ్బి తన నటనతో అందరినీ కట్టిపడేస్తుంది. ఎమోషన్ సీన్స్ లో కూడా బాగా నటించింది. తను ఆ పాత్ర వెనుక ఉన్న బాధను తను అభినయించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. బాలకృష్ణ తన పాత్రకు తగ్గట్లు ఉన్నాడు. అందరి సానుభూతి పొందేవాడిలా తన పాత్రను తీర్చిదిద్దారు. పాత్రకు తగ్గట్లు బాలక్రిష్ణ కోలా కూడా బాగానే నటించాడు.

కథ పరంగా చూస్తే, ఈ సినిమాలో ప్రధానంగా భార్యాభర్తలు మధ్య వచ్చే గొడవ సన్నివేశాలు బాగా తీశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మంచి ఊపు తెచ్చిపెట్టింది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా చూస్తున్నంత సేపు ’7/G బృందావనం కాలనీ’ సినిమా గుర్తుకు రావడం ఈ సినిమాకి ప్రధానంగా ఉన్న మైనస్. ఒక సాధారణ అబ్బాయి ఒక అందమైన అమ్మాయి ని ప్రేమించడం, అమ్మాయి మొదట్లో తిరస్కరించడం ఇవన్నీ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. కానీ ఇప్పుడు అవే సన్నివేశాలను భార్యాభర్తల మధ్య వచ్చేటట్లు చేశారు.

ఇకపోతే ఈ సినిమాకు ఎంచుకున్న కథాంశం అందరికీ నచ్చే అవకాశం లేదు. దానికి తోడు కథనం నెమ్మదిగా ఉండి ఒక్కొక్కసారి చిరాకు పుట్టిస్తుంది. అంత బాధ అనుభవించిన హీరోయిన్ అంత త్వరగా అన్నీ మరచిపోయి సింపుల్ గా మారిపోవడం ప్రేక్షకులకు ఒక పట్టాన అర్థం కాదు.

సాంకేతిక విభాగం :

చాలా తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా అయినా నిర్మాణ విలువలు బావున్నాయి. మూడ్ కి తగ్గట్లు ఛాయాగ్రహణం ఆకట్టుకునేలా ఉంది. సందర్భానికి తగ్గట్లు మాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం బావుంది. ఎడిటింగ్ ప్రధమార్థం లో బావున్నా ద్వితీయార్థం లో ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బావుండేది.

ఇక దర్శకురాలు గీతాంజలి గురించి చెప్పాలంటే దర్శకురాలిగా తన పాత్ర బాగా నిర్వహించింది అని చెప్పుకోవచ్చు. తను రాసుకున్న సన్నివేశాలను తీయడంలో కూడా మంచి పట్టు చూపించింది. కానీ ప్రి క్లైమాక్స్ లో హడావుడిగా సినిమాను ముగించినట్లు అనిపిస్తుంది.

తీర్పు :

భార్యా భర్తల బంధంలో, ఇద్దరు భిన్న ఆలోచనలున్న వ్యక్తులు కలిసి చేసే ప్రయాణం నేపథ్యంలో వచ్చిన ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ సినిమాలో నటీనటుల నటన, మంచి ఎమోషన్, కట్టిపడేశే కొన్ని సన్నివేశాలను ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. ఇకపోతే ’7/G బృందావనం కాలనీ’ సినిమాను తలపించే కథ కావడం, సాధారణ ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యే కథాంశం కాకపోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ డార్క్ అండ్ రియలిస్టిక్ రొమాన్స్ డ్రామాను కనెక్ట్ చేసుకోగలిగితే బాగానే ఆస్వాధించవచ్చు.

ఇక చివరగా చెప్పాలంటే ’నన్ను వదిలి నీవు పోలేవులే’ ఒక వర్గం ప్రేక్షకులను ఉద్దేశించిన సినిమా అనిపిస్తుంది. సాధారణ ప్రేక్షకులు ఇబ్బంది పడే సన్నివేశాలు ఈ సినిమాలో అక్కడక్కడా ఉన్నందున ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు.

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version