విడుదల తేదీ : మార్చి 23, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : శ్రీవిష్ణు, దేవి శ్రీ ప్రసాద్, సాట్నా టిటస్
దర్శకత్వం : వేణు ఊడుగుల
నిర్మాత : ప్రశాంతి, కృష్ణ విజయ్
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫర్ : రాజు తోట
ఎడిటర్ : బొంతల నాగేశ్వర్ రెడ్డి
స్క్రీన్ ప్లే : వేణు ఊడుగుల
యంగ్ హీరో శ్రీవిష్ణు, సాట్నా టిటస్ లు జంటగా నటించిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. నూతన దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి బజ్ తో ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో అలరించిందో ఇప్పుడు చూద్దాం..
కథ :
ఒక లెక్చరర్ కొడుకైన సాగర్ (శ్రీవిష్ణు) కు చిన్నప్పటి నుండి చదువు సరిగా ఎక్కదు. బ్రతకడమంటే నచ్చిన పని చేసుకుని సంతోషంగా ఉండటమే అనుకునే సాగర్ తాను అమితంగా ప్రేమించే తండ్రిని మెప్పించాలని డిగ్రీ పాసవడానికి సప్లిమెంటరీ పరీక్షలు రాస్తూ ఇబ్బందిపడుతూ ఉంటాడు.
ఒకానొక దశలో తనకు నచ్చింది చేయడానికి వీలుకాక, తండ్రికి నచ్చినట్టు మారలేక తీవ్ర ఒత్తిడికి, వేదనకు గురై ఇంట్లోంచి కూడ బయటికొచ్చేస్తాడు. అలా బయటికొచ్చిన సాగర్ ఏమయ్యాడు, చివరికి అతని భాధ అతని తండ్రికి అర్థమయ్యిందా లేదా అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
దర్శకుడు వేణు ఊడుగుల చాలా మంది యువకుల జీవితాల్లో ఉండే ఒక కీలకమైన దశనే తన సినిమా కథగా ఎంచుకున్నారు. దానికి తగ్గట్టే సజీవమైన పాత్రల్ని, వాతావరణాన్ని కథలో ఇనుమడింపజేసి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. ఈరోజుల్లో తల్లి దండ్రులు తమ పరువు కోసం పిల్లలపై ఎలాంటి ఒత్తిడి క్రియేట్ చేస్తున్నారు, అది పిల్లల్ని ఎలా ఇబ్బందిపెడుతోంది, తమ ఆశల కోసం పిల్లల ఇష్టాల్ని, కోరికల్ని తల్లిదండ్రులు, టీచర్లు ఎలా చిదిమేస్తున్నారు అనే అంశాలని బలంగా చూపాడు.
సినిమా ఆరంభం నుండి ఆఖరి వరకు నడిచే తండ్రీ కొడుకుల ట్రాక్ చూస్తే ప్రతి ఒక్కరికి తమ ఇళ్లలోని జరిగిన, జరుగుతున్న సంఘటనలు, వ్యవహారాలే గుర్తుకొస్తాయి. మరీ ముఖ్యంగా నచ్చినట్టే బ్రతకాలని ఇంట్లో వాళ్లతో వాదించే కుర్రాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్టయి ఆహా.. మన కథే తెర మీద నడుస్తోంది అనిపిస్తుంది. అదే విధంగా పిల్లలు ఎలాగైనా బాగుపడాలని కోరుకునే తండ్రుల తపన కూడ ఈ సినిమా చూస్తే అవగతమవుతుంది. ఈ ఫస్టాఫ్, సెకండాఫ్ లలో వచ్చే కొన్ని కీలకమైన ఎమోషనల్ సన్నివేశాలు మనసును కదిలిస్తాయి.
సమాజంలోని, ఇంట్లోని ఒత్తిడి తట్టుకోలేక మానసికంగా ఇబ్బందిపడే సగటు కుర్రాడిగా హీరో శ్రీవిష్ణు చాలా బాగా నటించాడు. నాన్న నాలో విషయం ఇంతే.. నేను పెద్ద పెద్ద చదువులు చదలేను, వచ్చిన పని చేసుకుని సంతోషంగా ఉంటాను అంటూ అతను చెప్పిన డైలాగ్స్ నిజంగా కదిలించాయి. కొడుకు బాగా సెటిలైతేనే తన పరువు నిలబడుతుందని భావించే తండ్రిగా దేవి శ్రీ ప్రసాద్ గారి నటన చాలా బాగుంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే ప్రతి సీన్ బలంగా ఉంది ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్లో హీరో రాయలసీమ యాసలో మాట్లాడటం బాగానే ఉన్నా డబ్బింగ్ కొంత భాగం వరకు సరిగా కుదరక కొన్ని మాటలు అసహజంగా అనిపిస్తాయి. రెగ్యులర్ కమర్షియల్ ఆడియన్స్ కోరుకునే కామెడీ, ఫైట్స్, రొమాన్స్, పాటలు లాంటి విషయాలేవీ ఈ సినిమాలో దొరకవు.
ఆసక్తికరంగా నడిచే కుర్రాడి కథలోకి హీరోయిన్ రూపంలో ప్రవేశించిన ప్రేమ, పాటలు కూడ సినిమా వేగాన్ని కొంత నెమ్మదించేలా చేశాయి. ఇక సినిమా ప్రీ క్లైమాక్స్ లో హీరో తనకు నచ్చినట్టే బ్రతకాలని నిర్ణయించుకుని బయటికొచ్చాక అతనెలా బ్రతికాడు అనే అంశాన్ని కొంత వివరంగా చూపించి ఉంటే హీరో పాత్రకు కనెక్టయ్యే యువ ప్రేక్షకులకు ఇంకాస్త సంతృప్తి దొరికే ఛాన్స్ ఉండేది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు వేణు ఊడుగులు సహజమైన నైపథ్యంలో కథను రాసుకుని, అందులో ప్రేక్షకులను ఒడిసి పట్టుకోగల పాత్రల్ని ప్రవేశపెట్టి మంచి సన్నివేశాలతో, అందరికీ అవసరమైన సందేశాన్ని ఇస్తూ మంచి సినిమా తీశారు. చిన్న చిన్న పొరపాట్లు మినహా మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారాయన.
సహజమైన లొకేషన్లలో చేసిన రాజు తోట సినిమాటోగ్రఫీ బాగుంది. సురేష్ బొబ్బిలి అందించిన నైపథ్య సంగీతం బాగుంది. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు ప్రశాంతి, కృష్ణ విజయ్ లు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
నిజ జీవితాల్లోంచి పుట్టే కథలు, వాటి ద్వారా రూపుదిద్దుకునే సినిమాలు ప్రేక్షకుల్ని ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఈ ‘నీది నాది ఒకే కథ’ సినిమా కూడ అలాంటిదే. సినిమా చూస్తున్నంతసేపు చాలా మందికి అరె.. ఇది మన కథలనే ఉందే.. ఇలాంటి సంఘటనే మన ఇంట్లో కూడ జరిగింది కదా అనిపిస్తుంది. దర్శకుడుకి రచనా ప్రతిభ, ఆకట్టుకునే పాత్ర్రలు, బలమైన సన్నివేశాలు, శ్రీవిష్ణు, దేవి శ్రీ ప్రసాద్ ల నటన అమితంగా ఆకట్టుకునే అంశాలు కాగా ఇరికించినట్టు అనిపించే లవ్ ట్రాక్, రెగ్యులర్ ఆడియన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలు లేకపోవడం నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద మనందరి కథలా అనిపించే ఈ ‘నీది నాది ఒకే కథ’ చిత్రం కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చెప్పలేం కానీ ఒక మంచి చిత్రంగా, అందరూ చూడదగిన సినిమాగా మాత్రం నిలుస్తుంది.
123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team