సమీక్ష : నేనేం చిన్నపిల్లనా..? – రొటీన్ ఫ్యామిలీ డ్రామా

విడుదల తేదీ : 08 నవంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకుడు : పి. సునీల్ కుమార్ రెడ్డి
నిర్మాత : డా. డి. రామానాయుడు
సంగీతం : ఎంఎం శ్రీలేఖ
నటీనటులు :రాహుల్ రవీంద్రన్, తన్వి వ్యాస్..

దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత డా.డి. రామానాయుడు చాలా రోజుల తర్వాత నిర్మాతగా తీసిన పూర్తి కుటుంబ కథా చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా..?’. ఇప్పటి వరకు ‘గంగ పుత్రులు’, ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ లాంటి సినిమాలను తీసిన పి. సునీల్ కుమార్ రెడ్డి మొదటి సారిగా రూటు మార్చి ఈ కుటుంబ కథా చిత్రానికి దర్శకత్వం వహించాడు. అందాల రాక్షసి ఫేం రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా మాజీ మిస్ ఇండియా తన్వి వ్యాస్ హీరోయిన్ గా పరిచయమైంది. వీరి అందరి కాంబినేషన్ లో వచ్చిన నేనేం చిన్నపిల్లనా సినిమా చిన్న పిల్లే అనిపించుకునేలా ఉందా? లేక పెద్ద పిల్లే అనిపించుకుందా? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

స్వప్నది(తన్వి వ్యాస్) అమ్మ, నాన్న, నానమ్మ, బాబాయ్, మావయ్యలతో కూడిన ఓ ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం అవడం వల్ల స్వప్న ఏది చెయ్యాలన్నా పెద్ద వాళ్ళు అడ్డు చెబుతూ ఉంటారు. దాంతో ఎలాగైనా కొద్ది రోజులు వారికి దూరంగా వెళ్లి స్వేచ్చగా తనకి నచ్చినట్టు బతకాలని అనుకుంటుంది. దాని కోసం వాళ్ళ నాన్నని ఒప్పించి పై చదువుల కోసం స్వీడన్ వెళుతుంది.

ఒంటరి అయిన క్రిష్(రాహుల్ రవీంద్రన్) స్వీడన్ లో నివసిస్తూ ఉంటాడు. అతను ఎలాంటి బాధ్యతలు లేకుండా ఆ రోజు తను గడపడానికి కావాల్సిన యూరోలు మాత్రం సంపాదించుకుంటూ హ్యాపీగా తన లైఫ్ ని గడుపుతుంటాడు. స్వీడన్ కి వెళ్ళాక స్వప్నకి క్రిష్ తో పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్తా స్నేహం గా మారి, స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది.

స్వప్న వాళ్ళ ఇంట్లో ఓ ఫంక్షన్ కోసమని క్రిష్ ఇండియాకి వస్తాడు. కొన్ని కారణాల వల్ల క్రిష్ కి స్వప్న ఫ్యామిలీకి గొడవ అవుతుంది. ఆ తర్వాత క్రిష్ కి ఒక నిజం తెలుస్తుంది. అది తెలుసుకున్న క్రిష్ తన జాయ్ ఫుల్ లైఫ్ ని వదిలేసి చాలా కష్టపడుతుంటాడు. అసలు క్రిష్ తన జాయ్ ఫుల్ లైఫ్ ని ఎందుకు వదిలేసాడు? ఎవరి కోసం తను కష్టపడుతుంటాడు? తనకు తెలిసిన నిజం ఏమిటి? అసలు స్వప్నని పెళ్లి చేసుకోవాలనుకున్న క్రిష్ వారి ఫ్యామిలీతో ఎందుకు గొడవ పెట్టుకున్నాడు? అనే విషయాలు తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్ రాహుల్ రవీంద్రన్. ఫస్ట్ హాఫ్ లో ఆకతాయి కుర్రాడిలా చాలా స్టైలిష్ గా కనిపించడమే కాకుండా ప్రేక్షకులని నవ్వించిన రాహుల్ సెకండాఫ్ లో భాద్యత కలిగిన కుర్రాడిగా బాగా నటించాడు. రాహుల్ చేసిన గత సినిమాలతో పోల్చుకుంటే తన నటన ఎంతో మెరుగు పడింది. ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ మరియు సెంటిమెంట్ సీన్స్ బాగా చేసాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ బాగా చేసాడు. తన్వీ వ్యాస్ కొన్ని సీన్స్ లో మాత్రం లుక్స్ పరంగా ఓకే అనిపించింది. సినిమాలో సంజనది కేవలం అతిధి పాత్ర మాత్రమే కావడంతో సినిమాలో తను పెద్దగా చేయడానికి ఏమీ లేదు.

సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది. ఎల్బీ శ్రీరాం బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ పేల్చిన కొన్ని పంచ్ లు బాగా పేలాయి. చేతివాటం రాముడు పాత్రలో తాగుబోతు రమేష్ కాసేపు నవ్వించాడు. సుమన్, రఘుబాబు, కాశీ విశ్వనాధ్ లు పరవాలేధనిపించారు. సెకండాఫ్ లో శరత్ బాబు, ఆమని నటన బాగుంది. ఇంటర్వల్ ట్విస్ట్, క్లైమాక్స్ సీన్ బాగుంది. సత్యానంద్ రాసిన డైలాగ్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ సెకండాఫ్, ఫ్యామిలీ డ్రామా సినిమా అన్నప్పుడు కథలో అక్కడక్కడా సెంటిమెంట్ సీన్స్ ఉండాలి లేదా క్లైమాక్స్ లో కానీ ఓ బలమైన సెంటిమెంట్ సీన్ ఉంటే ఆడియన్స్ కనెక్ట్ అయ్యే చాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ సినిమా సెకండాఫ్ మొదటి నుంచి చివరి దాకా ఒకటే ఎజెండా అదే సెంటిమెంట్. సుమారు ఒక గంటకి పైగా ఏడుపులు, బాధలను తిప్పి తిప్పి చూపించడం ప్రేక్షకులకి కాస్త చిరాకు పుట్టిస్తాయి. సెకండాఫ్ లో సెంటిమెంట్ డోస్ బాగా ఎక్కువైంది,

సినిమా మొదట్లో హీరోయిన్ పాత్ర గురించి చెప్పగానే సినిమా ఎలా ఉండబోతుంది, ఏమేమి ట్విస్ట్ లు ఉంటాయి అనేది మనకు అర్థం అయిపోతుంది. కావున సినిమాలో వచ్చే కొన్ని ట్విస్ట్ లకి ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. సెకండాఫ్ స్క్రీన్ ప్లే మీద ఎక్కవ శ్రద్ధ తీసుకోవాల్సింది. ఇలాంటి సెంటిమెంట్ సినిమాలను 1980-90 ల్లో ఎక్కువగానే చూసి ఉంటారు. హీరోయిన్ కి తెలుగు రాకపోవడం వల్ల డైలాగ్స్ కి పెద్దగా ఆమె లిప్ సింక్ అవ్వలేదు. కొన్ని సీన్స్ లో హీరోయిన్ హీరోకి పిన్ని/అత్తలా కనిపించింది.

కామెడీ సీన్స్ లో ఎల్బీ శ్రీరాం చేత బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడిస్తే పంచ్ లు పేలాయి, కానీ ఎమోషనల్ సీన్స్ లో కూడా బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల ఆ సీన్స్ లో ఉండాల్సిన ఎమోషన్ మిస్ అయ్యింది. సెకండాఫ్ లో ఇరికించి పెట్టిన అలీ, వేణు మాధవ్ కామెడీ చాలా చెత్తగా ఉంది. ఆ సీన్స్ ని కట్ చేసి ఉంటే సెకండాఫ్ నిడివి కాస్తన్నా తగ్గి ఉండేది. రెండు పాటలు సంద్రభానికి అవసరం లేకపోయినా పెట్టడం వల్ల సినిమా ఫ్లో దెబ్బతింటుంది.

సాంకేతిక విభాగం :

మొదటగా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి ఈ సినిమా చేసిన డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ ఆయన సినిమాల స్టైల్లోనే ఉండడం వల్ల పరవాలేదనిపించాడు. కానీ సెంటిమెంట్ అతనికి బొత్తిగా లేని డిపార్ట్ మెంట్ కావడం వల్ల డీల్ చెయ్యలేక పోయాడు. ఓవరాల్ గా జస్ట్ పస మార్కులు సంపాదించుకున్నాడు. బలభద్రపాత్రుని రమణి పాత కథకి స్వీడన్ మెరుగులు దిద్ది మన ముందుకు తీసుకొచ్చాడు. సత్యానంద్ డైలాగ్స్ బాగున్నాయి. ఎమోషనల్ సీన్స్ కి డైలాగ్స్ బాగా రాశాడు.

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి లొకేషన్ ని చాలా బాగా చూపించాడు. ఎంఎం శ్రీలేఖ అందించిన పాటలు పరవాలేధనిపించేలా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఎడిటర్ సెకండాఫ్ లో చాలా ట్రిమ్ చేయాల్సింది. ఆయన అలా వదిలేయడం వల్ల సెకండాఫ్ మరీ పెద్దదిగా, థియేటర్ కి వచ్చే ఆడియన్స్ సహనాన్ని పరీక్షించేలా తయారయ్యింది. రామానాయుడు గారి నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా కదా అని చెప్పి గంటల కొద్దీ సెంటిమెంట్ ని ప్రేక్షకులపై రుద్దాలనుకుంటే వాళ్ళు సింపుల్ గా థియేటర్ నుంచి వాకౌట్ చేస్తారు. ఈ సినిమా విషయంలోనూ అలానే జరిగింది. ఫస్ట్ హాఫ్ ని ఆసక్తిగా తీయడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయితే, ఫ్యామిలీ డ్రామా సినిమా కావడం వల్ల సెకండాఫ్ లో మితి మీరిన సెంటిమెంట్ పెట్టడం, సెకండాఫ్ లో కాస్త కూడా ఎంటర్టైన్మెంట్ లేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. అమితంగా ఫ్యామిలీ డ్రామా సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఓవరాల్ గా నేనేం చిన్నపిల్లనా..? సినిమా ఫ్రీడం కోరుకునే ఓ అమ్మాయి చుట్టూ తిరిగే రొటీన్ ఫ్యామిలీ డ్రామా..

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version