గత ఏడాది వరుసగా మూడు సక్సెస్లను అందుకుని యంగ్ హీరోల్లో మోస్ట్ వాంటెడ్ గా పేరు తెచ్చుకున్న నటుడు నాని ఈ 2017లో తొలిసారి ‘నేను లోకల్’ చిత్రంతో మన ముందుకొస్తున్నాడు. త్రినాథ్ రావ్ నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కాసేపటి క్రితమే ఈ సినిమా పూర్తి పాటలు విడుదలయ్యాయి. మరి అవి ఎలా ఉన్నాయో ఒక్కసారి చూసేద్దాం..
గాయనీ గాయకులూ : సాగర్
రచన : చంద్రబోస్
బిఏ పాసైనా.. ఎంఏ పాసైనా.. అంటూ మొదలయ్యే ఈ పాట ఇంట్లో తల్లిదండ్రులు, బయట స్నేహితులు, తెలిసినవాళ్ళు అందరూ కలిసి జీవితంలో నెక్స్ట్ ఏం చేస్తావ్ అని వేసే ప్రశ్నలకి విసిగిపోయిన కుర్రాడు ఫ్రస్ట్రేషన్లో పాడే పాట. జీవితంలో ఒకటి తరువాత ఇంకోటి చేస్తూనే ఉండాలని, కానీ ఏం చెయ్యాలో ఎవరికీ ఐడియా ఉండదని, అదో పెద్ద గందరగోళమని, ఎన్నో ప్రశ్నలకు సమాధానాలున్నా ఆ ప్రశ్నకు మాత్రం పక్కా సమాధానం చెప్పడం ఎవరి తరం కాదని అలాంటి పెద్ద పెద్ద ప్రశ్న వేసి కుర్రాళ్ళని భాధపెట్టొద్దని హీరో పాట రూపంలో చెబుతుంటాడు. ఇలాంటి మంచి సిట్యుయేషన్ కి దేవి శ్రీ బాణీలు, చంద్రబోస్ క్యాచీ లిరిక్స్, సాగర్ గానం భలేగా కుదిరి పాట ఇట్టే ఆకట్టుకుంటోంది. ఆల్బమ్ లో బెస్ట్ పాటగా ఇదే నిలబడుతుంది.
2. పాట : అరెరే ఎక్కడ
గాయనీ గాయకులూ : నరేష్ అయ్యర్, మనీష ఈరబత్తిని
రచన : శ్రీమణి
ఇక రెండవ పాట అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం.. అంటూ మొదలయ్యే ఈ పాట ఇద్దరు ప్రేమికులు ఒకరికొకరు తమ ప్రేమను తెలియపరుచుకుంటూ తమ ముందు జీవితాన్ని ఊహించుకునే సందర్భంలో నడిచేలా కనిపిస్తోంది. ఈ పాటలోని లిరిక్స్ ప్రేమికుల్లోని ప్రేమ మోతాదు ఏ స్థాయిలో ఉందో ఇట్టే చెబుతోంది. ఈ పాటకు దేవి శ్రీ ఇచ్చిన సంగీతం చాలా బాగుంది. శ్రీ మణి సాహిత్యం, నరేష్ అయ్యర్, మనీష ఈరబత్తినిల గాత్రం కూడా బాగా కుదిరాయి.
3. పాట : డిస్టర్బ్ చేస్తా నిన్ను
గాయనీ గాయకులూ : పృథ్వి చంద్ర
రచన : శ్రీమణి
ఈ పాట మొత్తం హీరో తన ప్రేమను హీరోయిన్ కు కాస్త రఫ్ యాంగిల్ లో చెప్పే ప్రయత్నం చేసే సందర్భంలో వచ్చేదిలా అనిపిస్తోంది. తన ప్రేమను ఒప్పుకునే వరకు వదలనని, రోజులో ప్రతి టైమ్ లో ఏదో ఒకరకంగా డిస్టర్బ్ చేస్తూనే ఉంటానని తన గొప్పతనాన్ని చెప్తూ బలవంతంగానైనా పేమించేలా చేసుకుంటాయని చెప్తూ హీరో పాడుతుంటాడు. శ్రీమణి సింపుల్ లిరిక్స్, దేవి శ్రీ మ్యూజిక్ ఈ పాటను యూత్ కి బాగా కనెక్టయ్యే విధంగా మలిచాయి.
4. పాట : చంపేశావే నన్ను
గాయనీ గాయకులూ : కపిల్, సమీరా భరద్వాజ్
రచన : శ్రీమణి
ఎబిసిడి లెటర్స్.. అంటూ మొదలయ్యే ఈ పాట కాస్త భిన్నంగా ఉంది. శ్రీమణి లిరిక్స్ చాలా కొత్తగా ఉన్నాయి. సరికొత్త పదప్రయోగం చేశాడు శ్రీమణి. ఇందులో హీరో హీరోయిన్లిద్దరూ ప్రేమలోని తియ్యనైన బాధ ఎలా ఉంటుంది, వాళ్ళ అనుభవాలేమిటి, ఒకర్నొకరు ప్రేమలో ఎలా పడేశారు, వాళ్ళ ఊహలు ఎలా ఉన్నాయి అనే విషయాలు ప్రస్తావించుకుంటూ ఉంటారు. కొంచెం కొత్తగా ఉన్న ఈ పాటలో కపిల్, సమీరా భరద్వాజ్ ల గానం మరో హైలెట్. ఇక దీవి శ్రీ ఎప్పటి లాగే ఈ పాటకి తనదైన శైలిలో సంగీతం ఇచ్చి మెప్పించాడు.
5. పాట : సైడ్ ప్లీజ్
గాయనీ గాయకులూ : జావెద్ అలీ
రచన : శ్రీమణి
కుర్రోళంటే లవ్ చెయ్యాలి.. అంటూ మొదలయ్యే ఈ పాట కుర్రాళ్లలోని విపరీత ధోరణిని, తమ మీద తమకున్న నమ్మకాన్ని, వాళ్ళు పెట్టుకున్న రూల్స్ వంటి అంశాలకి అద్దం పడుతుంది. లోకల్ గా ఉండే కుర్రాళ్లోని కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో చెప్తోంది. అలాగే ప్రేమలో ఉన్న వాళ్లకు ఎలాంటి బేధాభిప్రాయాలు ఉండవని, చాలా తెగింపుగా ఉంటారనే మంచి విషయాలని సైతం ఈ పాటలో హీరో పాత్ర ద్వారా ప్రస్తావించారు. దీనికి శ్రీమణి ఇచ్చిన సాహిత్యం సింపుల్ గా అంటే లోకల్ కుర్రాళ్ళు మాట్లాడుకున్నట్టు చాలా బాగుంది. ఇక జావెద్ అలీ గానం, దేవి శ్రీ సంగీతం పాటను మరింత కనెక్టయ్యేలా చేశాయి.
తీర్పు:
హిట్ మీద హిట్ కొడుతున్న నాని చేసిన సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే పాటలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా 1, 5 పాటలు చాలా బాగుండగా 3, 4 పాటలు వాటి తర్వాత స్థానంలో నిలిచాయి. ఇక మిగిలిన 2వ పాట మాత్రం అన్ని పాటలతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉన్నా పర్వాలేదనిపించేలానే ఉంది. ఈ అన్ని పాటలు కూడా విజువల్ గా నాని పెర్ఫార్మెన్స్, కీర్తి సురేష్ గ్లామర్ వంటి అంశాలు కలిస్తే ఇంకా అద్భుతంగా తయారవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యూత్ ని ఆకట్టుకునేలా ఉన్న ఈ ఆల్బమ్ సినిమా విజయంలో తప్పక సహాయపడుతుంది.
Click here for English Music Review