సమీక్ష : నేను మీకు బాగా కావాల్సిన వాడిని – ఇంట్రెస్ట్ గా సాగని ఫ్యామిలీ అండ్ లవ్ డ్రామా !

సమీక్ష : నేను మీకు బాగా కావాల్సిన వాడిని – ఇంట్రెస్ట్ గా సాగని ఫ్యామిలీ అండ్ లవ్ డ్రామా !

Published on Sep 17, 2022 3:02 AM IST
NMBK Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 16, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ మరియు సోనూ ఠాకూర్, ఎస్ వి కృష్ణా రెడ్డి, బాబా భాస్కర్

దర్శకత్వం : శ్రీధర్ గాధే

నిర్మాత: కోడి దివ్య దీప్తి

సంగీత దర్శకుడు: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి

ఎడిటర్: ప్రవీణ్ పూడి

కిరణ్ అబ్బవరం హీరోగా సంజన ఆనంద్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీధర్ గాదె కాంబోలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “నేను మీకు బాగా కావాల్సిన వాడిని”. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

వివేక్ (కిరణ్ అబ్బవరం) క్యాబ్ డ్రైవర్ గా తేజు (సంజన ఆనంద్)కి పరిచయం అవుతాడు. అప్పటికే, తేజు లవ్ ఫెయిల్యూర్ తో పూర్తిగా మద్యం మత్తులో మునిగిపోయి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. అసలు ఆమె ఎందుకు అలా ఉంది ?, ఆమె జీవితంలో జరిగిన బాధాకరమైన కథ ఏమిటీ ?, ఆమె గతం తెలుసుకుని వివేక్ ఏం చేశాడు ?, అసలు వివేక్ ఎవరు ?, లాయర్ దుర్గ అంటూ అతను చెప్పిన లవ్ స్టోరీ లో నిజం ఎంత ?, చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? వివేక్ – తేజు ఫైనల్ గా ఒక్కటి అయ్యారా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన కిరణ్ అబ్బవరం చాలా బాగా నటించాడు. తన పాత్రకు తగ్గట్లు.. కామెడీ సన్నివేశాల్లో బాగా ఆకట్టుకున్నాడు. తన క్యారెక్టరైజేషన్ తో, తన టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంజన ఆనంద్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ మెప్పించింది.

మరో హీరోయిన్ గా నటించిన సోనూ ఠాకూర్ కూడా బాగానే నటించింది. హీరోయిన్ ఫాదర్ గా ఎస్ వి కృష్ణా రెడ్డి, హీరో ఫ్రెండ్ గా బాబా భాస్కర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక కిరణ్ అబ్బవరం – సంజన ఆనంద్ మధ్య నడిచే లవ్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా.. పెద్దగా కథ లేకపోవడం కథనం కూడా రెగ్యూలర్ గా సాగడం ఈ సినిమాకి బాగా మైనస్ అయ్యింది. అదేవిదంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే చాలా స్లోగా సింపుల్ గా సాగింది. పైగా ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ బాగా బోర్ కొడతాయి.

కిరణ్ అబ్బవరం బిల్డప్ ఎలివేషన్స్ పై ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తాడో అర్థం కాదు. ఓవర్ యాక్షన్ పక్కన పెట్టి, కంటెంట్ పై ఫోకస్ పెడితే బెటర్. దర్శకుడు శ్రీధర్ గాధే ఆసక్తికరమైన డ్రామాను జనరేట్ చేయడంలో విఫలమయ్యాడు. సెకండ్ హాఫ్‌లో చాలా సన్నివేశాలు మరీ సిల్లీగా నడిచాయి.

అయినా అబద్ధపు ప్రేమ కథకు అంత పెద్ద ప్లాష్ బ్యాక్ ఏమిటో డైరెక్టర్ కే తెలియాలి. పైగా మెయిన్ క్యారెక్టరైజేషన్స్ క్లైమాక్స్ లో ఇంట్రెస్ట్ గా అనిపించినప్పటికీ.. సినిమా మొత్తం వచ్చే సరికి ఆ క్యారెక్టరైజేషన్స్ కి క్లారిటీ మిస్ అయి ఆకట్టుకోవు. అలాగే సినిమాలో కొన్ని చోట్ల నాటకీయత ఎక్కువవడంతో కథలో పూర్తిగా సహజత్వం లోపించింది.

 

సాంకేతిక విభాగం :

 

ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ గాధే తన దర్శకత్వ పనితనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిల్ అయ్యాడు. స్క్రిప్ట్ పై ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు, కానీ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకు ప్లస్ అయ్యేది. నిర్మాత కోడి దివ్య దీప్తి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆమె నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 

తీర్పు:

 

‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అంటూ వచ్చిన ఈ కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో కొన్ని కామెడీ ఎలిమెంట్స్ అండ్ ఫ్యూ లవ్ సీన్స్ బాగానే ఉన్నాయి. కానీ, సింపుల్ స్టోరీ, స్లో నేరేషన్ అండ్ బోరింగ్ ట్రీట్మెంట్ అలాగే ఆసక్తికరంగా సాగని స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకు మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు