ఓటీటీ సమీక్ష: “నెట్” – తెలుగు చిత్రం జీ5లో ప్రసారం

ఓటీటీ సమీక్ష: “నెట్” – తెలుగు చిత్రం జీ5లో ప్రసారం

Published on Sep 11, 2021 4:05 PM IST
Net Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 10, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: రాహుల్ రామకృష్ణ, అవికాగోర్, ప్రణీత పట్నాయక్, విశ్వదేవ్

దర్శకుడు: భార్గవ్ మాచర్ల

నిర్మాత‌లు: రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్ర

సంగీత దర్శకుడు: నరేశ్ కుమారన్

సినిమాటోగ్రఫీ: అభిరాజ్ నాయర్

ఎడిటర్: రవితేజ గిరిజాల

ప్రస్తుతం మేము కొనసాగిస్తున్న పలు డైరెక్ట్ స్ట్రీమింగ్ షోస్ మరియు సినిమాలు, సిరీస్‌ల సమీక్షల పరంపరలో భాగంగా తాజాగా ఎంచుకున్న చిత్రం “నెట్”. రాహుల్ రామకృష్ణ, అవికాగోర్, ప్రణీత పట్నాయక్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేడు “జీ5″లో విడుదల అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ:

ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన లక్ష్మణ్ (రాహుల్ రామకృష్ణ) ఓ చిన్న పట్టణంలో మొబైల్ షాప్ నడుపుతూ ఉంటాడు. లక్ష్మణ్ భార్య సుచిత్ర (ప్రణీత పట్నాయక్) పల్లెటూరి అమ్మాయి అని అమెపై లక్ష్మణ్ ఎప్పుడు చికాకు పడుతూ ఉంటాడు. ఇకపోతే హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రియ (అవికా గోర్), రంజిత్ (విశ్వ దేవ్) జంట ఉంటారు. అయితే ఎక్కువగా అశ్లీల చిత్రాలు చూసే లక్ష్మణ్‌కు ఓసారి ప్రియ వాళ్లు ఉండే ఫ్లాట్‌కి సంబంధించిన వీడియో లింక్ ఒకటి కనిపిస్తుంది. ఆ వీడియో లైవ్ చూసేందుకు లక్ష్మణ్ తెగ డబ్బులు ఖర్చు చేస్తూ, చివరకు అప్పులు కూడా చేస్తాడు. అయితే ఎప్పుడు ఆ లైవ్‌లోనే గడిపేస్తున్న లక్ష్మణ్‌కు అనుకోకుండా రంజిత్ గురుంచి ఓ విషయం తెలుస్తుంది. అయితే రంజిత్ గురుంచి ప్రియకు చెప్పేందుకు లక్ష్మణ్‌ తెగ ప్రయత్నిస్తాడు. కానీ ఒకరోజు తన ఇంట్లో కెమెరాలు ఉన్న విషయాన్ని ప్రియ గమనిస్తుంది. దీంతో ఆమె బాగా ఎమోషనల్ అయ్యి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇదంతా లైవ్‌లో చూస్తున్న లక్ష్మణ్‌ ప్రియ ఆత్మహత్య చేసుకోకుండా ఆపేందుకు ప్రయత్నిస్తాడు? మరి లక్ష్మణ్‌ ప్రయత్నం ఫలిస్తుందా? ప్రియ ఆత్మహత్య చేసుకుంటుందా? లేదా? అనేది తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ రాహుల్ రామకృష్ణ నటన అనే చెప్పాలి. కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా తాను చేయగలనని రాహుల్ మరోసారి నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో రాహుల్ భార్యగా నటించిన ప్రణీత పట్నాయక్ చాలా చక్కగా నటించింది. ఓ సాధారణ గృహిణిగా ఆమె చక్కటి ఎమోషన్స్ పండించింది. ఇక అవికా గోర్ కూడా బాగా నటించింది. ఇక విశ్వ దేవ్, రాహుల్ బామ్మర్ది పాత్రలో నటించిన విష్ణు తమ బెస్ట్ అందించారు.

ఇకపోతే రాహుల్ రామకృష్ణ, ప్రణీత పట్నాయక్‌ల మధ్య చోటు చేసుకునే సన్నివేశాలు మంచి ఎమోషన్‌తో కూడుకుని రియాలిస్టిక్‌గా అనిపిస్తాయి. ఇంటర్నెట్ కారణంగా లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు అన్నే ఉన్నాయని చూపించిన ప్రయత్నం బాగుందనే చెప్పాలి.

 

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా కథను దర్శకుడు బాగానే రాసుకున్నాడు కానీ కొన్ని చోట్ల కొన్ని విషయాలను అసంపూర్తిగా వదిలేశాడు. అసలు సంబంధం లేని జంట లైవ్ చూసేందుకు అసలు ఎందుకు రాహుల్ అంతలా అడిక్ట్ అవ్వాలి అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అయితే ఇలాంటి వాటిపై దర్శకుడు కాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

ఇక కథనానికి తగ్గట్టుగా క్లైమాక్స్ కూడా పెద్దగా చూపించలేకపోయాడు. ముఖ్యంగా లక్ష్మణ్ పాత్రకు సరైన ముగింపు ఇచ్చి ఉంటే బాగుండేది. ఓ చిన్న లైన్‌ని పెట్టుకుని దర్శకుడు సినిమా మొత్తాన్ని సాగదీశాడనే చెప్పాలి. ఈ సాగీదత అంశాలు ఒకానొక సమయంలో ప్రేక్షకుడిని బోర్‌గా ఫీలయ్యేలా చేస్తాయి.

 

సాంకేతిక విభాగం:

ప్రస్తుతం ఇంటర్నెట్ కారణంగా ఎన్ని లాభాలు ఉన్నాయో, నష్టాలు కూడా అన్నే ఉన్నాయని, మనకు తెలియని ఎన్నో కళ్లు మనకు తెలియకుండానే మనల్ని గమనిస్తుంటాయన్న అన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు రాసుకున్న కథనం బాగానే ఉంది కానీ దానిని మరింత ఇన్నోవేటివ్‌గా చూపించి ఉంటే బాగుండేది.

ఇక ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన బలమని చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపించింది. స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది.

 

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే డిజిటల్ కథాంశంగా తెరకెక్కించిన “నెట్” సినిమా క్యారెక్టర్స్, ఎమోషన్స్ పరంగా మాత్రం ఒకే అనిపించింది. లాజిక్ లేని కొన్ని అంశాల కారణంగా కథనం ఒకింత దెబ్బతింది. ఇక క్లైమాక్స్ కూడా పెద్దగా చూపించలేకపోవడం నిరాశపరిచింది. ఏది ఏమైనప్పటికీ డిజిటల్ కాన్సెప్ట్ తరాహ సినిమాలను కోరుకునే వారికి ఈ సినిమా ఓ ఛాయిస్‌గా నిలుస్తుంది కానీ మిగతా వర్గాల వారిని మాత్రం ఆకట్టుకోదనే చెప్పాలి.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు