విడుదల తేదీ : సెప్టెంబర్ 16, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : జి. నాగ కోటేశ్వరరావు
నిర్మాత : నాగార్జున – నిమ్మగడ్డ ప్రసాద్
సంగీతం : రోషన్ సాలూరి
నటీనటులు : రోషన్, శ్రేయా శర్మ..
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ కింగ్ అక్కినేని నాగార్జున తెరకెక్కించిన టీనేజ్ లవ్‌స్టోరీయే ‘నిర్మలా కాన్వెంట్’. ట్రైలర్, పాటలతో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ టీనేజ్ ప్రేమకథతో స్టార్ వారసుడు రోషన్ ఎంతమేర మెప్పించగలిగాడు? చూద్దాం..
కథ :
భూపతి నగరం అనే ఊర్లో ఓ రాజ వంశ కుటుంబీకుడైన భూపతి రాజు ఏకైక కూతురు శాంతి (శ్రేయా శర్మ), అదే ఊర్లో ఉండే ఓ పేద రైతు కొడుకు సామ్యూల్ (రోషన్) నిర్మలా కాన్వెంట్ అనే స్కూల్లో 11వ తరగతి చదువుతూంటారు. ఒకే దగ్గర కలిసి చదువుకోవడంతో వీరిద్దరి మధ్య స్నేహం పెరిగి, అది ప్రేమగా మారుతుంది. అయితే వీరి ప్రేమను భూపతి రాజు తిరస్కరించడమే కాక ఇద్దరినీ దూరం చేసేస్తాడు. ఆ తర్వాత సామ్ తన ప్రేమను దక్కించుకోవడానికి ఏం చేశాడు? అన్నదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు అన్నింటికంటే పెద్ద ప్లస్ పాయింట్ అంటే రోషన్, శ్రేయా శర్మల ఇన్నోసెంట్ పర్ఫామెన్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా శ్రీకాంత్ తనయుడు రోషన్ తన పాత్రలో ఒదిగిపోయాడు. ఓ ఇన్నొసెంట్ టీనేజ్ కుర్రాడు ఎలా ప్రవర్తిస్తాడో సరిగ్గా అలాగే ఉంటూ, తెలుగు సినిమా స్టైల్ హీరోయిజంకి కూడా సరిపోయేలా కనిపించి బాగా మెప్పించాడు. ఎక్కడా మొదటి సినిమా అన్నట్లుగా కనిపించకుండా రోషన్ సునాసయంగా నటించేశాడనే చెప్పాలి. ఇక శ్రేయా శర్మ చూడడానికి చాలా క్యూట్‌గా ఉంది. అదేవిధంగా నటనపరంగా కూడా ఆమెకు వంక పెట్టలేం.
కింగ్ నాగార్జున సెకండాఫ్‌లో ఉన్నంతసేపూ తన ఈజ్‌తో సినిమాను నడిపించాడు. రియల్ లైఫ్ క్యారెక్టర్‌నే మొదటి సారి పూర్తి స్థాయిలో చేసిన ఆయన, అందులో తన ఎనర్జీనంతా బయటకు తీసుకొచ్చి మెప్పించాడు. కథలో చిన్న చిన్న సన్నివేశాలను, పాత్రలను పరిచయం చేసి చివర్లో వాటన్నింటినీ వాడుకోవడం బాగా ఆకట్టుకుంది. నాగార్జున రోల్ ప్రవేశించాక సెకండాఫ్ వేగం పెరిగి మంచి సస్పెన్స్ ఎలిమెంట్ తోడైంది. నాగార్జున, రోషన్‌ల మధ్యన వచ్చే సన్నివేశాలన్నీ బాగా ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్ :
కథ ముందే ఊహించగలిగేలా ఉండడం ఈ సినిమాకు మైనస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. సెకండాఫ్‌లో గేమ్ షోతో కొత్తదనం తీసుకొచ్చినా, ఆ గేమ్ షోను కూడా ఊహించగలిగేదిగా డిజైన్ చేయడం కాస్త నిరుత్సాహపరచే అంశం. ఒక టీనేజ్ కుర్రాడు చాలెంజ్ చేయడం, ఆ ఛాలెంజ్ కోసం ఎంతదూరమైనా వెళ్ళడం లాంటి సన్నివేశాల్లో కాస్త లాజిక్ తప్పినట్లనిపించింది. ఫస్టాఫ్‌లో ప్రేమకథ కొన్నిచోట్ల సాగదీసినట్లు అనిపించింది.
సాంకేతిక విభాగం :
ముందుగా దర్శకుడు నాగ కోటేశ్వరావు గురించి చెప్పుకుంటే.. తన మొదటి సినిమాకు ఒక క్యూట్ లవ్‌స్టోరీనే చెప్పాలన్న ప్రయత్నంలో ఆయన విజయం సాధించాడు. ముఖ్యంగా కథలో టీనేజ్ ప్రేమకథల్లోని ఇన్నోసెన్స్‌ను బాగా పట్టుకున్నాడు. ఫస్టాఫ్‌లో అక్కడక్కడా తడబడ్డా చివరకు అనుకున్న పాయింట్‌తో మంచి లవ్‍స్టోరీనే చెప్పగలిగాడు. రోషన్‌ను పూర్తి స్థాయి పాత్రలో పరిచయం చేసే క్రమంలో దర్శకుడి ప్రతిభను గమనించొచ్చు.
రోషన్ సాలూరి అందించిన సంగీతం చాలా బాగుంది. పాటలన్నీ వినడానికి బాగుండడంతో పాటు విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు ఇంకా బాగా ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రాఫర్ విశ్వేశ్వర్ ఈ సినిమాలో పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నాడు. లైటింగ్, ఫ్రేమింగ్, కథ అవసరానికి తగ్గ మూడ్ ఇలా అన్ని అంశాల్లో సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌కి ఎక్కడా వంక పెట్టలేం!
తీర్పు :
టీనేజ్ ప్రేమకథల్లో ఉండే ఇన్నోసెన్స్ ఎప్పటికీ బాగానే ఉంటుంది. ఆ ఇన్నోసెన్స్‌ను అలాగే బంధించి చూపుతూనే ఒక స్టార్ హీరో కుమారుడిని పరిచయం చేస్తూ వచ్చిన సినిమాయే నిర్మలా కాన్వెంట్. ఈ సినిమాకు అన్నివిధాలా అట్రాక్టింగ్ పాయింట్ అంటే హీరో రోషన్ అనే చెప్పాలి. మంచి ఈజ్‌తో రోషన్, శ్రేయా ప్రదర్శించిన నటన, నాగార్జున స్పెషల్ రోల్ లాంటివి ఈ ప్రేమకథకు బాగా కలిసి వచ్చే అంశాలు. ఒక్క ఫస్టాఫ్‌లో సినిమా సాగదీసినట్లు ఉండడాన్ని పక్కనబెడితే నిర్మలా కాన్వెంట్ బాగా ఆకట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ’నిర్మలా కాన్వెంట్’దీ అదే టీనేజ్ ప్రేమకథ.. అయితే కొంచెం కొత్త భాషలో..!!
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team