సమీక్ష : నూతిలో కప్పలు – ప్రేక్షకుడికి తప్పని తిప్పలు

Noothilo Kappalu

విడుదల తేదీ : 10 ఏప్రిల్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : చంటి జ్ఞానమని

నిర్మాత : వి. శివాజీ రాజు, వినయ్ పి

సంగీతం : సాయికార్తిక్, శంకర్, కశ్యప్, ఘంటసాల విశ్వనాద్, సుభాష్ ఆనంద్

నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, జయప్రకాష్ రెడ్డి, భరత్ భూషణ్, మనోజ్ నందన్, తాగుబోతు రమేష్, మానస్ తదితరులు


పుంఖానుపుంఖాలుగా లో బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్న ఈ రోజుల్లో తమ సినిమాకంటూ ఒక యునీక్ పాయింట్ ని సృష్టించుకునే పాత్రలో దర్శకనిర్మాతలు నిమఘ్నమై వున్నారు. అలా డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో కనిపించడమే కాకుండా ఆయన స్వయంగా ఈ సినిమాలో ఒక పాట కూడా పాడారని, సినిమాకోసం 5 సంగీత దర్శకులు పనిచేసారని, జయప్రకాష్ రెడ్డి గబ్బర్ సింగ్ గెట్ అప్ లో స్పూఫ్ చేసారని ఇలా లెక్కలేనన్ని ఆశలు పెట్టిన ఈ ‘నూతిలో కప్పలు’ చిత్రం గత ఏడాది అక్టోబర్ లో విడుదలకావాల్సి వున్నా వాయిదాల కారణంగా ఈ నెల 11న మనముందుకు వచ్చింది. మరి దాని ఫలితమేమిటో చూద్దామా..

కథ :

అనగనగా ఒక ముగ్గురు స్నేహితులు. ఎంజాయ్ మెంట్, ఎంటర్టైన్మెంట్ అన్న కాన్సెప్ట్ తప్ప వాళ్లకు జీవితంలో వేరే వాటితో పనిలేదు. తమ తమ తండ్రులు పెట్టే పనికిమాలిన రూల్స్ వలనే ఇలా తయారయ్యామంటూ అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళని తిట్టుకుని, నలుగురినీ మోసం చేస్తూ, దాని వల్ల వచ్చిన సంతోషంతో బ్రతికేస్తూ వుంటారు. బ్రతకడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా ‘స్నేహం కోసం’ వాటన్నిటినీ బూటు కాలితో తంతారు.

అటువంటి వారి జీవితంలోకి నందూ(మనోజ్ నందన్) అనే కాలేజ్ స్టూడెంట్, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ బ్రతికే యాడ్ డిజైనర్(రాజేంద్ర ప్రసాద్)లు ప్రవేశించడంతో వారి తలరాతే మారిపోతుంది. ఇంతకీ ఆ మార్పు ఏమిటి? అది వారికి మంచి చేసిందా లేక చెడు చేసిందా? చివరికి వీరు జీవితాన్ని నెగ్గగలిగారా లేక అలానే ఆవారాలుగా మిగిలిపోయారా అన్నది మిగిలిన కధాంశం.

ప్లస్ పాయింట్స్:

ఈ విభాగం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమా అంతా డల్ గా సాగుతున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ స్క్రీన్ ప్రజన్స్ మూడ్ ని లిఫ్ట్ చెయ్యడానికి ఉపయోగపడింది. తనకు ఇటువంటి పాత్రలు కొత్తేం కాకపోయినా నటకిరీటి నటించడంతో ఆ పాత్రకి కాస్త వెయిట్ పెరిగింది. ఇక స్వయంగా తానే పాడి నర్తించి అలరించిన మందు సాంగ్ హై లైట్ గా నిలిచింది.

కామెడీ కోసం ఎక్కడికక్కడ సెపరేట్ ట్రాక్ లు క్రియేట్ చేసుకున్న దర్శకుడు క్లైమాక్స్ లో వచ్చే జయప్రకాష్ నారాయణ్ ‘గబ్బర్ సింగ్’ అంత్యాక్షరీ ఎపిసోడ్ మాస్ ప్రేక్షకులని అలరిస్తుంది. దాదాపుగా ప్రజలు మర్చిపోయిన ‘గగ్నం డ్యాన్స్’ని మరోసారి తెరపైకి తీసుకురావడం విశేషం.

బాంబే గర్ల్ సోనం సింగ్ చేసిన ఐటెం సాంగ్ నెల బెంచీ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టిస్తుంది. కొత్తకుర్రాళ్ళలో మానస్, మనోజ్ ల నటన పర్వాలేదనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:

స్క్రిప్ట్ లో రాసుకున్న దానిని స్క్రీన్ పై చూపించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. నవ్వురాని జోకులు, ఆవులింతలు తెప్పించే ఎపిసోడ్ లతో మొదటి భాగాన్ని సాగదీసాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అని దర్శకుడు ఫీల్ అయ్యాడే తప్ప ఏ ఒక్కరికీ ఆ ఎపిసోడ్ కనెక్ట్ అవ్వదు. జస్ట్ ఆవారాగా కలిసి తిరగడం కోసం చేతికొచ్చిన వీసా చించేయడం, బాయ్ ఫ్రెండ్ తన బర్త్ డే కి రాలేదని హీరోయిన్ తన ప్రేమకు బ్రేక్ అప్ అనడం లాంటి లాజిక్ లెస్ సీన్లు లెక్కలేనన్ని కనిపిస్తాయి.

ద్వితీయార్ధంలో కధ కాస్త ముందుకి సాగినా ఫ్లాట్ ఎండింగ్ వలన ప్రేక్షకుడికి క్లైమాక్స్ ముందే తెలిసిపోతుంది. కామెడీ సన్నివేశాలకు నవ్వు రాదు. ఎమోషనల్ సీన్ లకు ఏడుపురాక ప్రేక్షకుడు రెండున్నర గంటలు సతమతమవుతూ వుంటారు. తెరపై రాజేంద్ర ప్రసాద్ తప్ప తక్కిన పాత్రలంతా కొత్తవారు కావడంతో, వారికి సైతం నటన కొత్త కావడంతో సినిమా లో-ఎండ్ లో సాగుతుంది. హీరోయిన్ అప్పుడప్పుడూ అన్నా ఎక్స్ప్రెషన్ ని పెట్టడానికి ప్రయత్నించి వుంటే బాగుండేది. హైప్ ఇచ్చిన అల్లరి రవిబాబు వాయస్ ఓవర్ వలన ఒపయోగం లేదు.

సాంకేతిక విభాగం:

ముందుగా చెప్పిన్నట్టే కధ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం అని రాసుకున్న చంటి కేవలం మొదటి విభాగంలోనే పాసయ్యాడు. స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా వుండడం, ట్విస్ట్ లు కరువయ్యి అనవసరమైన జిమ్మిక్కులు చెయ్యడంతో దర్శకత్వంలో తన మార్కుని చూపించలేకపోయాడు. యువత జులాయిగా తిరగకూడదు, చేసే ఏ పనైనా ఎంజాయ్ చేస్తూ చెయ్యాలన్న కాన్సెప్ట్ మంచిదే అయినా దాన్ని సినిమా రూపంలో పెట్టడానికి నానా కష్టాలూ పడ్డాడు.

ఐదుగురు సంగీత దర్శకులు ఈ చిత్రానికి పనిచేసినా ఏ ఒక్క పాటా మనకు చేరువవ్వదు. రాజేంద్ర ప్రసాద్ గాత్రం వలన, రాసిన సాహిత్యం వలన మందు పాట వినగావినగా కాస్త నచ్చే అవకాశాలు వున్నాయి. సినిమాటోగ్రఫీ షార్ట్ ఫిలిమ్స్ స్టాండర్డ్ లో వుంది. ఎడిటింగ్ విభాగానికి సున్నా మార్కులు పడతాయి. కోరియోగ్రఫీలో మొదటిపాటని కాస్త కొత్తగా ట్రై చేసారు.

తీర్పు :

‘నూతిలో కప్పలు’ అంటూ దర్శకుడు నిజంగానే ‘నూతిలో కప్ప’లా ఈ సినిమాని తెరకెక్కించాడు. నేటి సినిమా స్టాండర్డ్స్ ని అందుకోలేక వెనుకబడిపోయాడు. కధలో కాస్త విషయం వున్నా తీయడంలో క్లారిటీ లోపించడంతో సినిమా నిరాశపరుస్తుంది. రాజేంద్ర ప్రసాద్ కి మీరు హార్డ్ కోర్ ఫ్యాన్ అయితేనో, బాగా ఖాళీగా వుండి మరే ఇతర సినిమాల టిక్కెట్టు దొరక్కపోతేనో ఈ సినిమాపై ఓ లుక్కేయండి. లేదంటే దీన్ని మీ దృష్టిలోనుండి తీసేయ్యండి.

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.25/5

123తెలుగు టీం

Exit mobile version