|
విడుదల తేదీ : 19 డిసెంబర్ 2014 | |
123తెలుగు. కామ్ రేటింగ్ : 1.5/5 | ||
దర్శకత్వం : రాధాస్వామి ఆవుల |
||
నిర్మాత : బాలాభాయ్ చోపటియ |
||
సంగీతం : విజయ్ కురాకుల |
||
నటీనటులు : జగపతి బాబు, కళ్యాణి, సుమన్ శెట్టి, కొండవలస.. |
ఇటీవల భారి బడ్జెట్ సినిమాలలో ప్రాముఖ్యత గల పాత్రలకు పరిమితమైన జగపతి బాబు హీరోగా నటించిన ‘ఓ మనిషి కథ’ సినిమా నేడు విడుదలైంది. కళ్యాణి ఈ సినిమాలో హీరోయిన్. హిట్ పెయిర్ గా పేరు సొంతం చేసుకున్న వీరిద్దరూ ఆ మేజిక్ రిపీట్ చేశారా..? రాధాస్వామి ఆవుల దర్శకత్వంలో బాలాభాయ్ చోపటియ నిర్మించిన ఈ కథ ప్రేక్షకులను మెప్పించిందా..? లేదా..? ఈ సమీక్ష చదివి తెలుసుకోండి.
కథ :
రాము (జగపతి బాబు), ఓ పల్లెటూరులో చిన్న హోటల్ నడుపుకుంటూ జీవితం సాగిస్తున్న వ్యక్తి. పేరుకు తగ్గట్టు గుణంలో శ్రీరాముడు వంటి వాడు. తన హోటల్ కు పాలు అమ్ముతున్న వ్యక్తి కూతురు సీతా మహాలక్ష్మి (కల్యాణి)తో ప్రేమలో పడతాడు. సీత కూడా రామును ఇష్టపడుతుంది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి ఓ రోజు రావణుడి లాంటి వ్యక్తి ప్రవేశిస్తాడు. దాంతో సీత ఆత్మహత్య చేసుకుంటుంది.
సీత ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి..? సీత ఆత్మహత్యకు కారణమైన రావణుడిని రాము ఏం చేశాడు..? అనేది మిగతా సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
జగపతి బాబు, కళ్యాణిల జంట ఈ సినిమాకు ప్లస్ పాయింట్. గతంలో వీరిద్దరూ అనేక హిట్ సినిమాలలో నటించడం వలన ఆ ఇమేజ్ ఈ సినిమాకు క్యారీ అయ్యింది. హోటల్ ఓనర్ పాత్రలో జగపతి బాబు చక్కని నటన కనబరిచారు. ఎమోషనల్ సన్నివేశాలలో జగపతి బాబు నటన కొన్నిసార్లు కంటతడి పెట్టిస్తుంది. చీరకట్టులో కల్యాణి అందంగా కనిపించింది. జగపతి బాబు, కళ్యాణిలు కలసి నటించిన సన్నివేశాలు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు ఎంచుకున్న పాయింట్ లో మంచి స్టఫ్ ఉంది. లవ్, రొమాన్స్, రివెంజ్ డ్రామా, సెంటిమెంట్ ఎమోషన్స్ ను ఆవిష్కరించడానికి సినిమాలో స్ట్రాంగ్ స్కోప్ ఉంది. వాటిని బేస్ చేసుకుని సన్నివేశాలు కూడా రాసుకున్నారు. కాని, కథను అనుకున్న విధంగా తెరకెక్కించడంలో దర్శకుడు ఘోరంగా విఫలమయ్యారు. ప్రేక్షకులను సినిమాలో లీనం చేయడంలో ఒక్క శాతం కూడా సక్సెస్ కాలేకపోయారు. రెండు గంటల పాటు సాగిన సినిమా సీరియల్ ను తలపించింది.
తాగుబోతు పాత్రలో కొండవలస లక్ష్మణరావు చేసిన కామెడీ చూసే సమయంలో చక్కిలిగింతలు పెట్టుకున్నా నవ్వు రాదు. అంతలా ఆ కామెడీ ట్రాక్ విసిగించింది. సినిమాకు కీలకమైన పాత్రలలో సీరియల్ ఆర్టిస్టులు నటించారు. అసలే కథనం నత్త నడకన సాగుతుందని ప్రేక్షకులు ఫీలవుతుంటే సీరియల్ స్టైల్ లో సాగిపోయే వారి నటన మరింత విసుగు తెప్పించింది. ఫస్ట్ హాఫ్ లో కళ్యాణి పాత్రను ముగించేయడంతో సెకండ్ హాఫ్ లో వీరి అతి థియేటర్లో ప్రేక్షకులకు శృతి మించినట్లు అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ ను నిందించి ప్రయోజనం లేదు. దర్శకుడు అతని చేతిలో పెట్టిన సన్నివేశాలు అంత గొప్పగా ఉన్నాయి. విజయ్ కురాకుల సంగీతం, నేపధ్య సంగీతం ఆకట్టుకునేలా లేవు. సుద్దాల అశోక్ తేజ్ ఈ సినిమాలో పాటలు రాశారంటే నమ్మడం కష్టమే. సాహిత్యం ఆయన స్థాయిలో లేదు. ఆది గణేష్ మాటల్లో సన్నివేశంలో భావం వ్యక్తమవ్వలేదు.
దర్శకుడు ఇదే సినిమాను ఒక 20 సంవత్సరాల ముందు తీసుంటే హిట్ అయ్యే అవకాశాలు ఉండేవి. దర్శకత్వంలో ఆ పాత వాసనలు కనపడ్డాయి. ప్రతి విషయంలో స్పీడ్ మంత్రం జపించే నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సన్నివేశాలు తెరకెక్కించడంలోనూ, దర్శకత్వం వహించడంలోనూ రాధాస్వామి ఆవుల విఫలమయ్యారు. దర్శకత్వలోపం సినిమాలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
తీర్పు :
యధావిధిగా కుటుంబ కథా సన్నివేశాలలో జగపతి బాబు మంచి నటన కనబరిచారు. దర్శకత్వలోపం వలన జగపతి బాబు నటన బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. సన్నివేశాలు, కథనం ఆకట్టుకునేలా లేకపోవడంతో సినిమా సీరియల్ ను తలపించింది. అందువల్ల రెండు గంటల సినిమా అయినా థియేటర్లో ప్రేక్షకుడు భారంగా బయటకు రావలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది ‘ఓ మనిషి కథ’ కాదు.. అంతులేని వ్యధ. భరించలేం ఈ భాధ.