విడుదల తేదీ : ఆగస్టు 13, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
తారాగణం: సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్, లిజోమోల్ జోస్, కశ్మీర్ పరదేశి తదితరులు
దర్శకత్వం: శశి
రచన: శశి
సంగీతం : సిద్ధూ కుమార్
ఎడిటర్ : సన్ లోకేష్
సినిమాటోగ్రాఫర్ : ప్రసన్న యస్ కుమార్
నిర్మాత : ఏఎన్ బాలాజీ, రమేష్ పి. పిల్లై.
హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో ‘బిచ్చగాడు’ సినిమా దర్శకుడు శశి తెరెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఒరేయ్ బామ్మర్ది’. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ కుమార్ కీలక పాత్రలో నటించాడు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ నిర్మాణంలో ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ:
రాజశేఖర్ ( సిద్ధార్థ్ ) ఒక సిన్సియర్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్. అయితే, లోకల్ గల్లీ రేసర్ మదన్ (జీవీ ప్రకాశ్) సిటీలో వేరే గ్యాంగ్ తో బైక్ రేసింగిలో పోటీ పడుతూ ఉంటాడు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న మదన్ ను పట్టుకుని, అతనికి చున్నీ తొడిగి అవమానించి పోలీసులకు అప్పగిస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం మదన్ అక్క రాజ్యలక్ష్మికి (లిజోమోల్ జోస్) రాజశేఖర్ కి పెళ్ళి కుదురుతుంది. ఆ పెళ్లి ఇష్టం లేని మదన్ వాళ్ళను విడగొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? అసలు మదన్ కి రాజ్యలక్ష్మికి మధ్య ఉన్న అనుబంధం ఏమిటి ? చివరకు రాజశేఖర్ – రాజ్యలక్ష్మి పెళ్లి అవుతుందా ? అలాగే మదన్ – రాజశేఖర్ ఒక్కటవుతారా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
బావ బామ్మర్దిల మధ్య ఎమోషన్స్ మీద ఈ సినిమా సాగింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. అలాగే బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ గా తన లుక్స్ లో అండ్ తన యాక్షన్ లో ఫ్రెష్ నెస్ చూపించాడు. లోకల్ బైక్ రేసర్ గా జీవీ ప్రకాష్ కుమార్ నటన కూడా బాగుంది.
జీవీ ప్రకాష్ కుమార్ – సిద్ధార్థ్ మధ్య నడిచే గొడవ, అలాగే సిద్ధార్థ్ – లిజోమోల్ జోస్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఇక దర్శకుడు రాసుకున్న ట్రీట్మెంట్, సినిమాలో రివీల్ చేసిన ఎమోషనల్ ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. మధుసూదన్ రావుతో కలిపి మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. మరో హీరోయిన్ కశ్మీర్ పరదేశి కూడా క్యూట్ గా కనిపించి అలరించింది.
మైనస్ పాయింట్స్:
ఇంటర్వెల్ ముందు కథ కొంచెం వేగంగా సాగుతూ సెకండాఫ్ మీద కొంత ఇంట్రెస్ట్ పెంచినా.. సెకండ్ హాఫ్ బాగా స్లోగా సాగుతూ.. సిల్లీ ఎమోషన్స్ మీద నడిచే సీరియస్ డ్రామాగా ఈ సినిమా తేలిపోయింది. దీనికి తోడు సినిమాలో పెద్దగా కథ ఏమి లేదు. కథనం కూడా రెగ్యూలర్ సన్నివేశాలతోనే వెరీ రొటీన్ గా సాగుతుంది.
పైగా రొటీన్ వ్యవహారాలతో పాటు సెకండాఫ్‌లో ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ విసుగు తెప్పిస్తాయి. అలాగే జీవీ ప్రకాష్ కుమార్ – సిద్ధార్థ్ మధ్య సంఘర్షణ మరీ సినిమాటిక్ గా అనిపిస్తుంది. సినిమాలో ప్రధానమైన లిజోమోల్ జోస్ పాత్రను దర్శకుడు పూర్తి పాసివ్ గా నడిపాడు. సినిమా కథనంలో ప్లో కారణంగా కొన్ని చోట్ల బోర్ కొడుతుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు శశి ఫ్యామిలీ రిలేషన్స్ తో పాటు సామాజిక అంశాలను కూడా కలిపి ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అయినప్పటికీ చివరకి రెగ్యులర్ కమర్షియల్ సినిమాను చూసిన ఫీలింగే వస్తుంది. ఇక పాటలు ఫర్వాలేదనిపిస్తే, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫర్ ప్రసన్న యస్ కుమార్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా బాగా తీశారు. సినిమాలోని నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు:
‘ఒరేయ్ బామ్మర్ది’ అంటూ వచ్చిన ఈ సిల్లీ ఓవర్ ఎమోషనల్ డ్రామాలో కొన్ని కామెడీ సీన్స్ అలాగే కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి. కాకపోతే సినిమా రొటీన్ గానే సాగడం, అదేవిధంగా సినిమాలో మెయిన్ ఎమోషన్స్ పూర్తి సినిమాటిక్ గా ఉండటం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. అయితే, సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ ల నటన, లవ్ ట్రాక్ లో కొన్ని సీన్స్ పర్వాలేదనిపించినా.. ఇక ఈ చిత్రంలో అవి తప్ప ఇక చెపుకోవటానికి ఏమిలేదు. మొత్తమ్మీద ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోదు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team