ఓటిటి సమీక్ష : అసలు – ఈటీవీ విన్ లో తెలుగు సినిమా

Asalu Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 13, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: రవిబాబు, పూర్ణ, సూర్య, సత్య కృష్ణన్, ప్రణవి మనుకొండ

దర్శకులు : ఉదయ్, సురేష్

నిర్మాతలు: రవి బాబు

సంగీత దర్శకులు: ఎస్ ఎస్ రాజేష్

సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని

ఎడిటర్: సత్యనారాయణ బల్లా

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

అల్లరి మూవీతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న రవిబాబు ఆ తరువాత పలు సక్సెస్ లు అందుకున్నారు. ఇక ప్రస్తుతం స్వయంగా ఆయన నటిస్తూ కథ అందించడంతో పాటు నిర్మాతగా అలానే దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించిన తాజా సినిమా అసలు. క్రైమ్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ మూవీ నేడు ప్రముఖ ఓటిటి మాధ్యమం ఈటివి విన్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

 

కథ:

 

వెంకటేష్ చక్రవర్తి (సూర్య) ఒక సుప్రసిద్ధ పాథాలజీ ప్రొఫెసర్, కాగా వందన (పూర్ణ) ఆయన దగ్గర అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తుంటుంది. అయితే ఒకరోజు ఆన్‌లైన్ క్లాస్ తీసుకుంటుండగా వెంకటేష్ చక్రవర్తి హత్యకు గురవుతాడు. అది చూసి స్టూడెంట్స్ మరియు వందన ఒక్కసారిగా షాక్ అవుతారు. అనంతరం ఈ కేసు చేధించే బాధ్యతను సీఐడీ అధికారి రంజిత్ రావు (రవిబాబు) కి అప్పగిస్తుంది ప్రభుత్వం. అయితే హత్య జరిగిన రోజు నలుగురు వ్యక్తులు మరియు ఒక గుర్తుతెలియని ముసుగు వ్యక్తి ప్రొఫెసర్ నివాసానికి వస్తారు. మరి వీరిలో ప్రొఫెసర్‌ను ఎవరు చంపారు? అసలు హంతకుడి ఉద్దేశ్యం ఏమిటి? ఆయనకు వందన ఎలా సహకరించింది? కేసుని ఫైనల్ గా రంజిత్ రావు ఛేదించాడా లేదా అనే ప్రశ్నలకు సమాధానాలు కావలి అంటే సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

సినిమా ప్రారంభంలోనే మెయిన్ పాయింట్ కి వెళ్తుంది. అక్కడి నుండి మర్డర్, ఆపై సన్నివేశాలు మెల్లగా ఆకట్టుకుంటాయి. అనంతరం సిఐడి అధికారిగా రవిబాబు ఎంట్రీ తో సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. మెల్లగా ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి సన్నివేశాలు ఆడియన్స్ ని అలరిస్తాయి. కాగా ప్రొఫెసర్ హత్య కేసులో ప్రధమ అనుమానుతుడికి సంబందించిన సన్నివేశాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ముఖ్యంగా సిఐడి అధికారిగా రవిబాబు పెర్ఫార్మన్స్ ఎంతో బాగుంది. పూర్ణ కీలక పాత్ర పోషించారు, ఆమె పాత్ర ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సూర్య తో పాటు ఇతర పాత్రధారులు అందరూ కూడా తమ పెర్ఫార్మన్స్ లతో అలరించారు. కాగా మొత్తం 100 నిమిషాలు మాత్రమే నిడివి కలిగి ఉండడం ఈ సినిమాకి మరొక ప్లస్ పాయింట్.

 

మైనస్ పాయింట్స్ :

 

అయితే హంతకుడు ఎవరో తెలుసుకునేందుకు చిత్రీకరించిన సన్నివేశాలు, కథనం ఎంతో ఆకట్టుకోగా, ఒక్కసారిగా అతడెవరు అనేది తెలిసిన దగ్గరి నుండి కొంత నిరాసక్తికరంగా సాగుతుంది. చాలావరకు ఇతర సినిమాల మాదిరిగానే అసలు లో కూడా కథనం అదే విధంగా చప్పగా నడుస్తుంది. ఇక హంతకుడి ఫ్లాష్ బ్యాక్ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఉండదు, ఫక్తు గతంలో అనేక సినిమాల్లో చూపించిన విధంగానే ఉంటుంది. ఎమోషనల్ కనెక్ట్ కూడా మిస్ అవడంతో పాటు పోలీసులు, హంతకుడి మధ్య సాగె సన్నివేశాలు ఆకట్టుకోకపోగా క్లైమాక్స్ కూడా ఒకింత సిల్లీ గా అనిపిస్తుంది. అలాగే, ఈ కథకి రవిబాబు కుటుంబ కోణం అనేది అవసరం లేదు. హంతకుడు సులభంగా తన పని తాను చేసుకుంటూ దొరకకుండా పోతుండే సీన్స్ ని ఈజీ గా రాసుకున్నారు అని ఆశ్చర్యం వేస్తుంది. నిజానికి ఒక్క సందర్భంలో కూడా హంతకుడు పట్టుబడతాడనే ఫీలింగ్ మనకు కలగదు, ఆ విధంగా పోలీసులను పేలవంగా చూపించారు.

 

సాంకేతిక వర్గం:

 

ఎస్ ఎస్ రాజేష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. చరణ్ మాధవనేని ఫోటోగ్రఫి, విజువల్స్ ఎంతో బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండడంతో పాటు ఎడిటింగ్ కూడా బాగుంది. అయితే రవిబాబు మార్క్ థ్రిల్లింగ్ సీన్స్ మరింతగా పెట్టి ఉంటె బాగుండేది. ఫస్ట్ హాఫ్ బాగున్నా, సెకండ్ హాఫ్ తో పాటు క్లైమాక్స్ వంటివి ఏమాత్రం అలరించవు. దర్శకులైన ఉదయ్, సురేష్ కేవలం పర్వాలేదనిపించారు. హంతకుడి రివీల్ తరువాత సన్నివేశాలు కనుక ఆసక్తికరంగా రాసుకుంటే ఫలితం మరోలా ఉండేది.

 

తీర్పు:

 

మొత్తంగా చూసుకుంటే క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన అసలు మూవీ కేవలం పర్వాలేదనిపించే సినిమాగా నిలుస్తుంది. సెకండ్ హాఫ్ తెరకెక్కించిన విధానం ఆకట్టుకోదు, అయితే రవిబాబు, పూర్ణ ల యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇంట్రెస్టింగ్ సీన్స్ దీనికి ప్రధాన బలం. మొత్తంగా క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారు అయితే ఈ వారం అసలు మూవీ చూసేయొచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version