ఓటిటి సమీక్ష : “మా నీళ్ల ట్యాంక్” తెలుగు సిరీస్ జీ5 లో

ఓటిటి సమీక్ష : “మా నీళ్ల ట్యాంక్” తెలుగు సిరీస్ జీ5 లో

Published on Jul 16, 2022 3:01 AM IST
Maa Neella Tank Movie Review

విడుదల తేదీ : జులై 15, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సుశాంత్, ప్రియా ఆనంద్, సుదర్శన్, ప్రేమ్ సాగర్, నిరోషా, రామరాజ్, దివి, అన్నపూర్ణమ్మ, అప్పాజీ అంబరీష

దర్శకత్వం : లక్ష్మీ సౌజన్య

నిర్మాత: ప్రవీణ్ కొల్లా

సంగీత దర్శకుడు: నరేన్ ఆర్కే సిద్ధార్థ

సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథ్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్ రావు


టాలీవుడ్ ప్రముఖ హీరో సుశాంత్ తన ఫస్ట్ ఓటిటి డెబ్యూట్ ఇచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ “మా నీళ్ల ట్యాంక్”. ప్రముఖ ఓటిటి యాప్ జీ 5 లో లేటెస్ట్ గా రిలీజ్ అయ్యిన ఈ సిరీస్ ని లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించారు. మరి ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ :

ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. గోపాల్(సుదర్శన్) అనే వ్యక్తి తమ ఊర్లో సురేఖ(ప్రియా ఆనంద్) ని ఆమె ఫ్రెండ్ కోరిక మేరకు పెళ్లి చేసుకోడానికి ఒప్పుకుంటాడు. కానీ ఊహించని విధంగా సురేఖ ఈ పెళ్లి ఇష్టం లేక ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోతుంది. మరి దీనితో గోపాల్ ఆ ఊరి నీళ్ల ట్యాంక్ లో దిగి సురేఖ గాని రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తన తండ్రి కోదండం(ప్రేమ్ సాగర్) ని బెదిరించి ఆమె వెళ్ళిపోడానికి కారణం నువ్వే అని నిందిస్తాడు. దీనితో ఊరి ముందు ప్రమాణం చేసి కోదండం మళ్ళీ సురేఖ ని వెనక్కి తీసుకొచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు. మరి ఈమెని వెతికి పెట్టే భాద్యత పోలీస్ వంశీ(సుశాంత్) కి అప్పగిస్తాడు. మరి ఈ కేసులోకి తాను ఎలా వస్తాడు? తాను ఈ కేస్ ని ఛేజ్ చేస్తాడా లేదా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సిరీస్ లో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి. చాలా వరకు నరేషన్ మంచి కామెడీతో ఆకట్టుకుంటుంది. అలాగే ఈ సిరీస్ లో కనిపించిన సుశాంత్ మంచి నటనను కనబరిచాడు. పోలీస్ గా తన మార్క్ నటనను కనబరచడమే కాకుండా మంచి ఎమోషన్స్ ని కూడా పండించాడు.

అలాగే నటి ప్రియా ఆనంద్ చాలా కాలం తర్వాత తెలుగులో కనిపించింది. మరి ఈ కం బ్యాక్ కి తగ్గట్టుగా మంచి స్ట్రాంగ్ రోల్ నే ఆమె ఎంచుకుంది అని చెప్పాలి. తన పాత్ర వరకు స్కోప్ ఉన్న ప్రతి అంశంలో ఆమె తన బెస్ట్ ని కనబరిచింది. ఇంకా నటుడు సుదర్శన్ తన రోల్ లో అద్భుతంగా రాణించాడు. ఇంకా అన్నపూర్ణమ్మ, ప్రేమ్ సాగర్, దివి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సిరీస్ లో చాలా వరకు లోపాలు కనిపిస్తాయని చెప్పాలి. అక్కడక్కడా ఎంటర్టైన్మెంట్ నరేషన్ పక్కన పెడితే సీరియస్ సన్నివేశాలకు వచ్చినట్టు అయితే ఎక్కడా పొంతన కనిపించదు. చాలా కన్ఫ్యూజ్ చేసే సన్నివేశాలు స్క్రీన్ ప్లే తో చూసే వీక్షకులకి చికాకు పుట్టిస్తుంది. అలాగే పలు సన్నివేశాల్లో లాజిక్స్ కూడా కరెక్ట్ గా ఉండవు.

ఇంకా పలువురు నటీనటులకు మంచి స్కోప్ ఉన్నా కూడా దర్శకులు దీనిని సరిగ్గా వినియోగించుకోలేదు. అంతే కాకుండా సిరీస్ లో మెయిన్ థీమ్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు, లవ్ ట్రాక్ లో కూడా లోపాలు కనిపిస్తాయి. వీటితో పాటుగా ఈ సిరీస్ కి ఇన్ని ఎపిసోడ్స్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది. చాలా వరకు సాగదీతగా ఉన్న కొన్ని సీన్స్ ని తగ్గించి కొన్ని ఎపిసోడ్స్ కి మాత్రమే సెట్ చేసి ఉంటే బాగుండు.

సాంకేతిక వర్గం :

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు డీసెంట్ గా అనిపిస్తాయి. నాచురల్ విజువల్స్, సెటప్ తో నిర్మాతలు మంచి అవుట్ పుట్ ని అందించారు. అలాగే అరవింద్ విశ్వనాధ్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ మంచి విజువల్స్ తో కనిపిస్తుంది. ఇంకా టెక్నీకల్ విభాగంలో మ్యూజిక్ ఇచ్చిన నరేన్ ఆర్ కె సిద్ధార్థ మంచి వర్క్ అందించాడు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. అయితే ఎడిటింగ్ మాత్రం బెటర్ గా చెయ్యాల్సి ఉంది.

ఇక దర్శకురాలు లక్ష్మి సౌజన్య విషయానికి వస్తే తాను మంచి లైన్ మరియు కథ తీసుకున్నారు, అలాగే ఎంటర్టైనింగ్ గా నడిపారు కానీ మిగతా విషయాల్లో మాత్రం తాను వెనుకబడ్డారు. చాలా సన్నివేశాల్లో డీటెయిల్స్ మిస్ అవుతాయి, కన్ఫ్యూజ్ చేసే కథనాలు అంతగా ఆకట్టుకోవు. మరి ఇలాంటి వాటిపై తాను దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ “మా నీళ్ల ట్యాంక్” లో నటీనటుల సిన్సియర్ పెర్ఫామెన్స్ లు ఆకట్టుకుంటాయి. అలాగే అక్కడక్కడా కొన్ని నవ్వించే నరేషన్ కూడా కనిపిస్తుంది. కానీ సిరీస్ నేపథ్యంలో దాన్ని తీర్చి దిద్దిన విధానంలో చాలా లోపాలు కనిపిస్తాయి. కన్ఫ్యూజ్ చేసే కథనం, బోర్ గా సాగే డ్రామా వంటివి వీక్షకులని నిరాశ పరుస్తాయి. వీటితో అయితే ఈ సిరీస్ ఒక బిలో యావరేజ్ ఫ్లిక్ గా నిలిచిపోతుంది అని చెప్పాలి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు