విడుదల తేదీ : జూలై 30,2021
123telugu.com Rating : 2.75/5
నటీనటులు : మమ్ముట్టి, మురళీగోపి, మాథ్యూ థామస్, జోజు జార్జ్ తదితరులు
దర్శకుడు : సంతోష్ విశ్వనాథ్
నిర్మాతలు : శ్రీలక్ష్మి ఆర్
సంగీత దర్శకుడు :గోపీ సుందర్
ఎడిటర్ : నిషద్ యూసఫ్
సినిమాటోగ్రఫీ : వైది సోమసుందరమ్
ప్రస్తుతం మేము కొనసాగిస్తున్న పలు వెబ్ సిరీస్‌లు మరియు డైరెక్ట్ డిజిటల్ సినిమాల రిలీజ్ రివ్యూల పరంపరలో తాజాగా మేము ఎంచుకున్న చిత్రం “వన్”. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన పొలిటికల్ డ్రామా తెలుగులోకి అనువదించగా ప్రస్తుతం ఇది ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.
కథ:
సంజయ్(మాథ్యూ థామస్), సీనా (గాయత్రి అరుణ్) ఇద్దరు అక్కా తమ్ముళ్లు. తమ తండ్రికి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్చుతారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్లూరి రామచంద్రం(మమ్ముట్టి) వైద్య పరీక్షల నిమిత్తం అదే ఆసుపత్రికి రావడంతో సంజయ్, అతని అక్క సీనాను పోలీసులు అడ్డుకుంటారు. ఇదేమిటని ప్రశ్నిస్తే సంజయ్‌పై పోలీసులు దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకుంటారు. దీంతో ఆవేశంతో ఉన్న సంజయ్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతాడు. అది కాస్త వైరల్ కావడంతో ఒక్కసారిగా రాజకీయాల్లో గందరగోళం ఏర్పడుతుంది. ఈ క్రమంలో పరిస్థితిని చక్కదిద్దడానికి ముఖ్యమంత్రి ఏమి చేస్తారు? సోషల్ మీడియాలో ఒక సాధారణ పోస్ట్ రాజకీయ గందరగోళానికి ఎలా దారితీస్తుంది? అనే సమాధానాలు తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
మమ్ముట్టి భారతీయ చలనచిత్రంలో అత్యుత్తమ నటులలో ఒకరని తెలిసిందే. అతను ప్రతి ఫ్రేమ్‌లో మంచి క్లాసీ నటనతో ఆకట్టుకున్నాడు మరియు అతను కంపోజ్ చేసిన పనితీరు మొత్తం కథనాన్ని నడిపిస్తుంది.
కథాంశం మొదట్లో విడ్డూరంగా అనిపించవచ్చు కానీ అది సమర్థించబడిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం నాటకీయమైన రీతిలో ఉన్నప్పటికీ, ఆధునిక రాజకీయాలపై ముడిపడి ఉంది.
మైనస్ పాయింట్స్:
ముఖ్యమంత్రి పార్టీలోని అంతర్గత సంఘర్షణకు సంబంధించిన దృశ్యాలు చాలా విలక్షణగా అనిపిస్తాయి. ఈ సీక్వెన్స్‌లు కనీసం 30 నిమిషాల పాటు కొనసాగడం కాస్త డ్రా బ్యాక్ అయ్యిందని చెప్పాలి. అయితే ఇందులోని కొన్ని విషయాలను మరింత ఆసక్తికరంగా మరియు ఆకర్షణీయంగా చేయడానికి ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి ఉంటే బాగుండేది.
ఇక క్లైమాక్స్ కూడా సులభంగా ఊహించదగినదిగా ఉంది. సినిమా చివరి 20 నిమిషాల్లో ఏమి జరుగుతుందో వీక్షకుడు సులభంగా ఓ అంచనాకు వచ్చేస్తాడు. సినిమాకు మంచి ఎండింగ్‌ని ఇచ్చినప్పటికీ ఇంకాస్త బెటర్‌గా ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే సరిపోయేదనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
సంతోష్ విశ్వనాథ్ ఒక నవలను సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాడు. అతడు ఎంచుకున్న కథనం చాలా సందర్భాలలో ఊహించదగినదిగా ఉన్నప్పటికీ చాలా వరకు వీక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఇక గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యిందని చెప్పాలి. అతడు కథానాయకుడికి ఇచ్చిన బీజీఎం అత్యున్నత స్థాయిలో ఉంది. ఇక వైది సోమసుందరమ్ సినిమాటోగ్రఫీ కూడా అద్భుతగా ఉంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే “వన్” ఒక మోస్తరుగా అనిపించే పొలిటికల్ థ్రిల్లర్, ప్రత్యేకమైన కథాంశంతో ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే మరియు కథనం కొన్నిసార్లు ఊహించదగినదిగా ఉండడంతో ఒకింత నిరుత్సాహపరిచింది. ఇకపోతే మమ్ముట్టి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకోవడం ఈ సినిమాకు మంచి ప్లస్ అయ్యింది. ఏదేమైనప్పటికీ పొలిటికల్ కథాంశాలను కోరుకునే వారికి ఈ సినిమా ఓ ఛాయిస్‌గా నిలుస్తుంది.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team