సమీక్ష : “పక్కా కమర్షియల్” – రొటీన్ గా సాగే కోర్ట్ రూమ్ డ్రామా

Pakka Commercial Movie Review

విడుదల తేదీ : జులై 01, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: గోపీచంద్, రాశి ఖన్నా, సత్యరాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, అనసూయ భరద్వాజ్

దర్శకత్వం : మారుతి

నిర్మాతలు: బన్నీ వాస్, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి

సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్

సినిమాటోగ్రఫీ: కర్మ్ చావ్లా

ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్


టాలీవుడ్ లో ఎన్నో రోజుల నుండి ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో పక్కా కమర్షియల్ ఒకటి. ఈ చిత్రం ప్రమోషన్ల తో పాటుగా, కంటెంట్ తో మంచి హైప్ ను సొంతం చేసుకుంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:

సత్యనారాయణ మూర్తి (సత్యరాజ్) ఎంతో నిజాయితీ గల ఒక జడ్జి. ఒక తప్పుడు తీర్పు ఇచ్చిన కారణం గా అతను తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ప్రస్తుత కాలంలో సత్యనారాయణ మూర్తి కొడుకు వివేక్ (గోపీచంద్) డబ్బుకోసం పని చేసే అత్యాశ గల ఒక లాయర్. డబ్బుకోసం ఒక క్రిమినల్ రాజకీయ నాయకుడు (రావు రమేష్) కి సహాయం చేసే సమయం లో, సత్యనారాయణ మూర్తి మళ్ళీ తన న్యాయవాద వృత్తిను చేపడతారు. తన కొడుకు ను ఎదుర్కొనడానికి వచ్చిన సత్యనారాయణ మూర్తి గెలుస్తాడా? లేదా? ఆ తండ్రీకొడుకుల పోరు లో ఎవరు గెలిచారు అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

డైరెక్టర్ మారుతి ప్రస్తుత కాలంలో ఉన్న ట్రెండింగ్ సబ్జెక్ట్ లను తీసుకొని, తన సినిమాల బ్యాక్ డ్రాప్ లుగా తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో వ్యక్తులు కమర్షియల్ గా మరియు సొంత ప్రయోజనం కోసం పనులు చేయడాన్ని చక్కగా చూపించారు. అయితే హీరో గోపీచంద్ కోసం సెట్ చేసిన ఈ యాంగిల్ చాలా బాగుంటుంది.

గోపీచంద్ ఈ చిత్రం లో చాలా స్టైలిష్ గా, హ్యాండ్సం గా కనిపించారు. తన పాత్రకి గోపీచంద్ కరెక్ట్ గా సరిపోయాడు. అంతేకాక గోపీచంద్ కామెడీ టైమింగ్ ను మారుతి చాలా చక్కగా ఉపయోగించాడు అని చెప్పాలి.

రాశి ఖన్నా ఈ చిత్రం లో హైలైట్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో చాలా ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా, తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అని చెప్పాలి. తన పాత్రతో ఫన్ జెనరేట్ చేయడం మాత్రమే కాకుండా, హీరో గోపీచంద్ తో కెమిస్ట్రీ బాగా చేసింది అని చెప్పాలి. ఈ చిత్రం లో మరో కీలక పాత్రలో అజయ్ ఘోష్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

ఈ చిత్రం లో మెయిన్ విలన్ గా రావు రమేష్ బాగా నటించారు. అజయ్ ఘోష్ తో కలిసి పలు సన్నివేశాల్లో నవ్వించాడు. అతని బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీ లు సినిమాకు చాలా ప్లస్ పాయింట్స్. సత్యరాజ్ ఈ చిత్రం లో కీ రోల్ లో నటించి ఆకట్టుకున్నారు. వైవా హర్ష, సప్తగిరి, సియా గౌతమ్ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రానికి మేజర్ డ్రా బ్యాక్ అంటే రొటీన్ స్టోరీ అని చెప్పాలి. కథలో కొత్తగా చూపించడానికి ఏమీ లేదు. అసలు కథ స్టార్ట్ అవ్వడానికి బ్రేక్ పాయింట్ వచ్చే వరకు వేచి చూడాలి.

మంచి కామెడీ ఉన్నప్పటికీ, రాశి ఖన్నా పాత్ర సెకండ్ హాఫ్ లో చాలా సిల్లీ గా అనిపిస్తుంది. అంతేకాక సినిమా లో గోపీచంద్ మరియు సత్యరాజ్ ల మధ్యన సరైన భావజాలం ను సెట్ చేయలేదు. దాంతో పలు సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు.

ఈ చిత్రం లో డ్రామా కి మంచి స్కోప్ ఉంది. అయితే పలు తేలికైన సన్నివేశాల కారణం గా సెకండాఫ్ లో కథ చాలా సిల్లీగా అనిపిస్తుంది. కోర్ట్ సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. వీటితో పాటుగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ముందుగా ఊహించేందుకు అవకాశం ఉంటుంది.

సాంకేతిక విభాగం:

సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. జేక్స్ బెజాయి సంగీతం బాగుంది, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అని చెప్పాలి. మారుతి ఈ చిత్రం లోని డైలాగ్స్ చాలా బాగున్నాయి. హీరో గోపీచంద్ కోసం డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ బావున్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ ఇంకాస్త బావుండేది.

అదే విధంగా మారుతి డైరెక్షన్ పర్వాలేదు అని చెప్పాలి. అయితే గత చిత్రాలతో పోల్చినప్పుడు కామెడీ ఫ్లేవర్ తగ్గింది అని చెప్పాలి. పక్కా కమర్షియల్ చిత్రం లో కోర్ట్ రూమ్ డ్రామా తో కామెడీ ను మిక్స్ చేశాడు. కీలక సన్నివేశాల సమయం లో సీరియస్ నెస్ తీసుకు రావడం లో విఫలం అయ్యాడు అని చెప్పాలి.

అంతేకాక ఈ చిత్రం లో తండ్రి కొడుకుల మధ్యన ఉండే యాంగిల్ ను మరింత సీరియస్ గా ఎలివేట్ చేసి ఉండాల్సింది. మరింత నాటకీయత ను జోడించి ఉంటే, ఇంకా బాగుండేది. పక్కా కమర్షియల్ చిత్రం మారుతి ప్రమాణాలకు అనుగుణంగా లేదు అని స్పష్టం గా చెప్పవచ్చు.

తీర్పు:

గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ చిత్రం సరదాగా కామెడీ సన్నివేశాలతో సాగే కోర్ట్ రూమ్ డ్రామా. ఫస్ట్ హాఫ్ చాలా స్లో గా సాగుతుంది, అయితే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ లో ఫ్లాట్ గా ఉండే స్క్రీన్ ప్లే మరియు ముందుగానే ఊహించే సన్నివేశాలతో పర్వాలేదు అనిపిస్తుంది. లాజిక్ మరియు స్క్రీన్ ప్లే ను పట్టించుకోకుండా కామెడీ ను ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని ఒకసారి చూడవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version