విడుదల తేదీ : జూలై 14, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : వాసు పరిమి
నిర్మాత : రజిని కొర్రపాటి
సంగీతం : డి.జే. వసంత్
నటీనటులు : జగపతి బాబు, పద్మప్రియ, తన్య హోప్
జగపతి బాబు హీరోగా కెరియర్ స్టార్ చేసి ఫ్యామిలీ సినిమాలతో మహిళా ప్రేక్షకులకి భాగా చేరువై, తరువాత విలన్ గా టర్న్ తీసుకొని వరుస అవకాశాలతో బిజీ అయిన నటుడు. మరల చాలా గ్యాప్ తర్వాత హీరో గా ఆయన చేసిన సినిమా ‘పటేల్ సర్’. మరి హీరోగా ఈ సారి జగపతి బాబు ఏ మేరకు మెప్పించారో ఓ సారి తెలుసుకుందాం.
కథ :
సుబాష్ పటేల్ (జగపతి బాబు) రిటైర్డ్ ఆర్మీ మేజర్. అతను ఓ పాపతో కలిసి ఓ ఇంట్లో ఉంటాడు. మరో వైపు దేవరాజ్ (కబీర్ సింగ్) గ్యాంగ్ లో ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తాడు. మరో వైపు పాప చూపు కోసం హాస్పిటల్స్ తిప్పుతూ ఉంటాడు. పాప కళ్ళు తెరిచే టైంకి తన టార్గెట్ పూర్తి చేయాలనే లక్ష్యంతో పటేల్ ఉంటాడు. మరో వైపు ఆ మర్డర్స్ కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్యాథరిన(తన్య హోప్) అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతకి పటేల్ దేవరాజ్ గ్యాంగ్ ని ఎందుకు టార్గెట్ చేసాడు? పటేల్ కి ఆ గ్యాంగ్ కి ఉన్న సంబంధం ఏమిటి? క్యాథరిన పటేల్ ఈ హత్యలన్ని చేస్తున్నట్లు ఎలా గుర్తించింది? అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకి ప్లస్ పాయింట్స్ అంటే అది ఖచ్చితంగా జగపతి బాబు అనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత మరోసారి ఆయన పూర్తి స్థాయిలో హీరోగా చేసిన సినిమా కావడంతో అందరి అంచనాలు అందుకునే విధంగా తన నటనతో ఆకట్టుకున్నాడు. వయస్సుకి తగ్గ పాత్ర ఎంచుకోవడం ద్వారా అతని పాత్ర సినిమాకి ప్లస్ అయ్యింది. ఈ సినిమాలో జగపతి బాబు నటనలో వేరియేషన్స్ చూపించి భాగానే మెప్పించాడు.
ఇక స్క్రీన్ ప్లే ద్వారా దర్శకుడు కొద్దిగా కొత్తగా కథని నడిపించే ప్రయత్నం చేసాడు. అది కొంత వరకు భాగానే మెప్పిస్తుంది. అలాగే జగపతి బాబుతో సినిమా మొత్తం కనిపించే పాప మంచి సెటిల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. దర్శకుడు చెప్పినట్లు సినిమాకి ఇంటర్వెల్ లో సస్పెన్స్ రీవీల్ చేసే విధానం కూడా ఊహించని విధంగా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. ఇక హీరోయిన్ గా పద్మప్రియ తన పాత్ర పరిధి మేరకు భాగానే ఆకట్టుకుంది. అలాగే సెకండ్ అఫ్ లో వచ్చే ఎమోషన్స్ సినిమా ప్రేక్షకుడిని కాస్తా హత్తుకుంటాయి. ఇక సినిమాలో క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ కూడా ఓకే అనిపించుకుంటుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమా లో మైనస్ అంటే అదే ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల్లో మాదిరి నడిచే రొటీన్ రివెంజ్ స్టొరీ. పాత్రలు, వాటి స్వభావాలు మారాయి తప్ప అదే రొటీన్ రివెంజ్ ఫార్ములా కథ ని దర్శకుడు ఎంచుకోవడం కాస్తా నిరుత్సాహపరుస్తుంది. ఇంటర్వెల్ లో అసలు ట్విస్ట్ రీవీల్ చేసిన తర్వాత మొత్తం కథ ఏంటనేది సగటు ప్రేక్షకుడుకి ఇట్టే అర్ధమైపోతుంది. వినోదం కోసం పోసాని పాత్రని ఉపయోగించుకున్న పెద్దగా కనెక్ట్ కాలేదనే చెప్పాలి.
ఇక హీరోయిన్ తన్య హోప్ ని ఈ సినిమాలో కాస్తా నెగిటివ్ టచ్ ఉన్న పోలీస్ పాత్రలో ఎస్టాబ్లిష్ చేసిన అది అంతగా వర్క్ అవుట్ కాలేదనే చెప్పాలి. ఆ పాత్రలో మామూలు ఆర్టిస్ట్ ని తీసుకున్నా సరిపోతుంది. అలాగే సినిమాని కథ నడిపించే విధానంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా వరకు లాజిక్స్ కి దూరంగా ఉంటుంది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు వాసు పరిమి రాసుకున్న కథ పాతదే అయినా దానికోసం ఆయన తయారుచేసుకున్న స్క్రీన్ ప్లే కాస్త కొత్తగా ఉంది. దర్శకుడుగా ఈ విషయంలో అయన కొంత వరకు సక్సెస్ అయినట్లే. అయితే అనుభవలేమితో కొన్ని లాజిక్స్ ను మిస్వడం జరిగింది. సాయి కొర్రపాటి నిర్మాణ విలువలు భాగానే ఉన్నాయి. సినిమాపై పెట్టిన పెట్టుబడి ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.
సంగీత దర్శకుడు డిజే వసంత్ మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా వరకు మెప్పించే ప్రయత్నం చేశాడు. కథలో ఎమోషన్స్ ని నడిపించే సమయంలో ఆకట్టుకునే సంగీతం అందించాడు. పాటలు కూడా చాలా వరకు ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీలో శ్యాం.కె. నాయుడు అనుభవం భాగా పనిచేసింది. విజువల్ గా ప్రతి సీన్ చూడటానికి బాగుంది. ఇక ఎడిటర్ గౌతమ్ రాజు కూడా ఓకే అనిపించుకున్నాడు.
తీర్పు :
చాలా రోజుల తర్వాత హీరోగా చేసిన జగపతి బాబు సినిమాను చాలా వరకు తన భుజాల మీదే నడిపించాడు. సెకండాఫ్ ఎమోషనల్ డ్రామా, జగపతిబాబు నటన, మేకోవర్, ఇంటర్వెల్ ట్విస్ట్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా రొటీన్ రివెంజ్ స్టోరీ కావడం, ఫ్లాష్ బ్యాక్ లాజిక్స్ మిస్సవడం వంటివి నిరుత్సాహపరిచే అంశాలుగా ఉన్నాయి. మొత్తం మీద రేఇవేంజ్ డ్రామాలను, థ్రిల్లర్లను ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే సినిమా తప్పకుండా మెప్పిస్తుంది.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team