సమీక్ష : పెళ్లి పుస్తకం – బోరింగ్ గా సాగే రొటీన్ కాన్సెప్ట్..

Pelli Pusthakam (9) విడుదల తేదీ : 12 జూలై 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : రామకృష్ణ మచ్చకంటి
నిర్మాత : నాగిరెడ్డి – గోపాల్ – సుమన్
సంగీతం : శేఖర్ చంద్ర
నటీనటులు : రాహుల్ రవీంద్రన్, నీతి టేలర్ ..


‘అందాల రాక్షసి’ ఫేం రాహుల్ రవీంద్రన్ హీరోగా, ‘మేం వయసుకు వచ్చాం’ ఫేం నీతి టేలర్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ‘పెళ్లి పుస్తకం’. చాలా రోజుల క్రితమే సినిమా పూర్తయినప్పటికీ రిలీజ్ కి సరైన సమయం లేదని చాలా రోజులుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైంది. రామకృష్ణ మచ్చకంటి డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి శేఖర్ చంద్ర సంగీతం అందించాడు. మొదటి సినిమాతో హిట్ అందుకోలేకపోయిన రాహుల్ రవీంద్రన్ కి ఈ సినిమాతో అన్నా హిట్ అందుకున్నాడో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

రాహుల్(రాహుల్ రవీంద్రన్) విదేశాల్లో తన చదువు పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు. రాహుల్ ది ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబానికి సత్యం(నాగినీడు) పెద్ద దిక్కు మరియు రాహుల్ కి తాత. నీతి(నీతి టేలర్) రాహుల్ కి మరదలు అవుతుంది. సత్యం ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులు చాలా కాలం నుండి తమ కుటుంబంలోకి వేరే ఇంటి నుండి సంబంధం కలుపుకోవడం లేదా ఆత్మ ఇంటి ఆడబిడ్డని వేరే వారి ఇంటికి పెళ్లి చేసి పంపడం లాంటివి జరగవు. ఏది ఏమైనా తన ఉమ్మడి కుటుంబంలోని బంధు మిత్రులలోని వారికే ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. అదే విధంగా రాహుల్ – నీతిలకు పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఓ డ్రామా ఆడి వారిద్దరికీ పెళ్లి చేస్తారు.

పెళ్ళైన తర్వాత రాహుల్ నీతిని ప్రేమించడం మొదలు పెడతాడు. కట్ చేస్తే నీతి తన క్లాస్ మేట్ చెర్రితో ప్రేమలో ఉంటుంది. అది తెలుసుకున్న రాహుల్ తన ప్రేమని ఎలా చూపించి నీతిని పొందాడు అనేదే ఈ చిత్ర కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

రాహుల్ రవీంద్రన్ నటన విషయంలో మొదటి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాలో కాస్త పరిపక్వత కనిపించింది. కొన్ని సెంటిమెంట్ సీన్స్ బాగా చేసాడు. కామెడీ చెయ్యడానికి ట్రై చేసాడు, కొన్ని చోట్ల పరవాలేధనిపించినా కొన్ని సీన్స్ లో మాత్రం ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. రాహుల్ లుక్ చాలా సింపుల్ గా పాత్రకి తగ్గట్టు ఉంది. నీతి టేలర్ తనకిచ్చిన పాత్రలో ఓకే అనిపించింది. సినిమాలో చాలా చోట్ల, మరియు ఒక రెండు పాటల్లో పొట్టి పొట్టి బట్టలు వేసుకొని గ్లామర్ ని బాగానే ఒలకబోసింది. నాగినీడు పాత్రకి పర్ఫెక్ట్ గా సరిపోయాడు. కాశీ విశ్వనాధ్, అనిల్, యశస్విని, దేశానంది లు జస్ట్ ఓకే.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొట్ట మొదటి మైనస్ పాయింట్ అంటే ఈ సినిమా టైటిల్. గతంలో బాపు – రమణలు కలిసి ‘పెళ్లి పుస్తకం’ అని ఓ అద్భుతమైన దృశ్యకావ్యాన్ని తీసారు. ఆ పేరు పెట్టి ఓరిజినల్ సినిమా పేరుని చాలావరకూ చెడగోట్టారనే చెప్పాలి. అంతటితో ఆగకుండా ఆ సినిమాలోని ఆణిముత్యం లాంటి ‘శ్రీరస్తు శుభమస్తు’ పాటని మళ్ళీ తీసి డైరెక్టర్ ఆ పాటకి ఉన్న విలువని గంగలో కలిపాడు. ఇకనుంచి అయినా గొప్ప గొప్ప సినిమాల టైటిల్స్ ని, పాటల్ని పెట్టుకోవాలన్న ఆలోచనల్ని కొత్త దర్శకులు మానుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.

ఇక సినిమా విషయానికొస్తే దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ని మొదటి 15 నిమిషాల్లోనే చెప్పేయడం వల్ల ఆ తర్వాత ఏమీ చెప్పలేక సినిమాని రెండున్నర గంటలపాటు సాగదీశాడు. ఆ రెండున్నర గంటల పాటు థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్ ఇలా ఏ ఒక్క విషయంలోనూ ఆనందపరచలేకపోయాడు. సినిమానే చాలా నిదానంగా సాగుతుంటే అవసరం లేని చోటల్లా పాటల్ని పెట్టి చిరాకు తెప్పించాడు. పాటలన్నీ సినిమాలో పాటలు ఉండాలి కాబట్టి ఉన్నాయి అన్నట్లు ఉంటాయి.

సినిమా సెకండాఫ్ లో వచ్చే రాహుల్ – లేడీ లెక్షరర్ మధ్య వచ్చే సీన్స్ అన్నీ డబుల్ మీనింగ్ తో ఉంటాయి. అసలు సినిమాకి ఆ ఎపిసోడ్ అవసరమే లేదు. ఇలా సినిమాకి వసరం లేదు అనిపించే సీన్స్ చాలానే అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే అస్సలు బాగోలేదు, చాలా అంటే చాలా ఊహాజనితంగా ఉంటుంది. సినిమాలో మనస్పూర్తిగా మీ పెదవి పై చిరునవ్వు తెప్పించే సీన్ ఒకటి కూడాలేదు. డైరెక్టర్ ఏమి చెప్పాలనుకున్నాడో దానికి జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయాడు.

సాంకేతిక విభాగం :

జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. మార్తాండ్ కె వెంకటేష్ గారి ఎడిటింగ్ అస్సలు బాగోలేదు, ఆయన సినిమాలో సగానికి సగం లేపేసినా బాగుండేది ఎందుకంటే సినిమాకి అవసరం లేని పార్ట్ అంత ఉంది. మరుధూరి రాజ డైలాగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏదో పరవాలేదనిపించేలా లాగించేసాడు.

కథ :

చాలా రొటీన్ కాన్సెప్ట్. స్క్రీన్ ప్లే – చిన్నపిలాడికి చూపించినా తరువాత ఏం జరుగుతుందా అని చెప్పే విధంగా ఉంది. దర్శకత్వం – చాలా చెత్తగా ఉంది. ఈ మధ్య షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు తీసేది 5 నిమిషాలే అయినప్పటికీ పర్ఫెక్షన్ తో తీసున్నారు. కానీ డైరెక్టర్ ఈ సినిమాలో సుమారు 75% సీన్స్ లో ఏవీ పర్ఫెక్ట్ గా ఉండవు, అలాగే నటీనటుల నుంచి పాత్రకి, సీన్ కి కావాల్సిన పర్ఫెక్ట్ నటనని రాబట్టుకోలేకపోయాడు. కావున ఈ మూడు విభాగాలను డీల్ చేసిన రామకృష్ణ పూర్తిగా విఫలమయ్యాడని చెప్పుకోవాలి. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే.

తీర్పు :

‘పెళ్లి పుస్తకం’ – రొటీన్ బోరింగ్ సినిమా. పెళ్లి పుస్తకం అని టైటిల్ పెట్టారు కదా బాపు – రమణ గారి ‘పెళ్లి పుస్తకం’ అంత బాగా ఉంటుందేమో అనుకోని మాత్రం ఈ సినిమాకి వెళ్లొద్దు. అలా వెళితే మీకు నిరాశ, నీరసం మిగులుతుందే తప్ప ఇంకేమీ ఉపయోగం ఉండదు. రాహుల్ రవీంద్రన్ – నాగినీడుల నటన, కాస్తో కూస్తో నీతి టేలర్ గ్లామర్ చెప్పుకోదగ్గ పాయింట్స్ అయితే రొటీన్ స్టొరీ, వీక్ స్క్రీన్ ప్లే, చేతకాని డైరెక్షన్, ఎంటర్టైన్మెంట్ అస్సలు లేకపోవడం చెప్పదగిన మేజర్ మైనస్ పాయింట్స్. ఇక ఈ సినిమా చూడాలా వద్దా అనేది మీ నిర్ణయానికే వదిలేస్తున్నా..

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
రాఘవ

Exit mobile version