సమీక్ష : “ప్లాన్ బి” – కన్‌ఫ్యూజ్‌డ్‌ క్రైమ్ థ్రిల్లర్

సమీక్ష : “ప్లాన్ బి” – కన్‌ఫ్యూజ్‌డ్‌ క్రైమ్ థ్రిల్లర్

Published on Sep 18, 2021 3:00 AM IST
Plan B Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 17, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్, మురళీశర్మ, రవిప్రకాశ్ తదితరులు
దర్శకుడు: కెవి రాజమహి
నిర్మాత‌: ఏవీఆర్
సంగీత దర్శకుడు: స్వర
సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగాధరి
ఎడిటర్: ఆవుల వెంకటేశ్


శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా కెవి రాజమహి దర్శకత్వంలో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలను మేళవించి ఇన్వెస్టిగేటివ్ వండర్‌గా తెరకెక్కించిన చిత్రం “ప్లాన్ బి”. నేడు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ:

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామం. ఆ గ్రామంలో ఎవరికి సంతానం కలగరు. అనుకోకుండా ఆ గ్రామానికి డాక్టర్‌గా వచ్చిన శ్రీనివాస్ రెడ్డి అందరికి సంతానం కలిగేలా ట్రీట్‌మెంట్ ఇస్తాడు. అయితే అందరికీ సంతానం కలిగినా ఒక జంటకు మాత్రం సంతానం కలగదు. దీంతో ఆ జంటకు శ్రీనివాస్ రెడ్డి తన వీర్యాన్ని అందించి ‘ఐవీఎఫ్’పద్ధతిలో సంతానం కలిగేలా చేస్తాడు. అంతేకాదు డాక్టర్‌గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి దంపతులు కూడా ‘ఐవీఎఫ్’ పద్ధతిలోనే సంతానం పొందుతారు. అయితే ఆ ఒక్క జంటకు, డాక్టర్‌గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి దంపతుల జంటకు కలిగిన సంతానం ఒకేలా ఉండడంతో కథ ఊహకందని మలుపులు తిరుగుతుంది. ఈ నేపధ్యంలో వరుస హత్యలు జరుగుతాయి. అయితే అసలు ఆ హత్యలు జరగడానికి కారణం ఏమిటి? పోలీసులు ఆ హత్యలను ఎలా చేధించారు? ఈ కథకి డాక్టర్‌కి ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ఈ సినిమాను స్క్రీన్‌పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

కమెడీయన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా “ప్లాన్ బి” చిత్రంలో హీరోగా నటించిన శ్రీనివాస్ రెడ్డి తనదైన నటనతో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. ఇందులో శ్రీనివాస్ రెడ్డి మూడు షేడ్స్‌లో కనిపించాడు. ఇక ప్రేమికుడిగా గౌతమ్‌ పాత్రలో సూర్య వశిష్ట కూడా తన పాత్ర మేరకు బాగానే నటించాడు. మురళి శర్మ, రవిప్రకాష్ పోలీస్ పాత్రల్లో మెప్పించారు.

దర్శకుడు కెవి రాజమహి తాను రాసుకున్న కథను స్క్రీన్‌పై బాగానే చూపించాడు. ప్లాన్‌ బి కథ చాలా క్యారెక్టర్ల చుట్టూ తిరిగింది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అన్నింటిని జోడించి మంచి ఇన్వెస్టిగేటివ్ వండర్‌గా ఈ సినిమాను తెరక్కించాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రధాన బలమనే చెప్పాలి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకు ప్రధానమైన డ్రా బ్యాక్ ఏదైనా ఉందా అంటే కథలో చాలా వరకు ఫేమస్‌ కానీ నటులు ఉండడమనే చెప్పాలి. కాస్త కన్‌ఫ్యూజ్‌డ్‌గా అనిపిస్తుంది. వరుస హత్యలు జరుగుతుండడం, చివరలో ఒక్కొదానిని రివీల్ చేసినా కూడా చూసే ప్రేక్షకుడిలో ఏదో అర్ధం కాలేదన్న ఫీలింగ్ కలుగుతుంది.

కొన్ని చోట్ల లాజిక్స్ కూడా మిస్ అయినట్టు తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ పూర్తిగా బోరింగ్‌గా సాగింది. ఇక పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏం జరిగిందో ముందే ఊహించడం అనే అంశాలు కాస్త సిల్లీగా అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం:

దర్శకుడు రాసుకున్న కథలో ఎక్కువ సంఖ్యలో హత్యలని చూపించి వాటిని రివీల్ చేయడంలో ఒకింత ఆసక్తి అయితే కలిగించాడు కానీ అన్నింటిని రివీల్ చేస్తూ వస్తున్న సమయంలో ప్రేక్షుకుడు ఒకింత కన్‌ఫ్యూజ్‌కి ఏమైనా గురవుతున్నాడా అనే విషయంపై కూడా కాస్త దృష్టిసారించి ఉంటే బాగుండేది. ఇక క్లైమాక్స్‌లో ఫైనల్ ట్విస్ట్‌ అయితే ప్రేక్షకుడి ఊహకు అందనంతగా ఉంటుంది.

ఈ సినిమాకు కెమెరా పనితీరు బాగుంది. శక్తికాంత్ కార్తీక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. కొన్ని చోట్ల అనవసరమైన సన్నివేశాలను ఇంకాస్త కట్ చేసి ఉంటే ఎడిటింగ్ కూడా ఒకే అనిపించేది. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేసిన ఈ “ప్లాన్ బి” జస్ట్ లిమిటెడ్ అంశాల్లో ఓకే అనిపిస్తుంది తప్పితే మిగతా సినిమా అంతా చాలా కన్ఫ్యూజ్ చేసే నరేషన్‌తో ఆడియెన్స్ కి గందరగోళంగా అనిపిస్తుంది. దర్శకుడు ఈ విషయంలో క్లారిటీగా ఉండి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా అయితే మంచి థ్రిల్లర్ తరహా ఎంగేజింగ్ సినిమాలను కోరుకునే వారికి ఈ సినిమా పెద్దగా థ్రిల్ అయితే ఇవ్వదు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు