విడుదల తేదీ : సెప్టెంబర్ 30, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రభు, ఆర్. శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, ఆర్. పార్తిబన్
దర్శకత్వం : మణిరత్నం
నిర్మాత: మణిరత్నం, సుభాస్కరన్ అల్లిరాజా
సంగీతం: ఏ ఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
ఎడిటర్: ఎ. శ్రీకర్ ప్రసాద్
సంబంధిత లింక్స్: ట్రైలర్
విజువల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, కార్తి, జయం రవి కీలక పాత్రల్లో వచ్చిన పీరియాడిక్ డ్రామా ‘ పొన్నియిన్ సెల్వన్’. కాగా ఐశ్వర్య రాయ్, త్రిష కృష్ణన్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం పార్ట్-1 ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
కథ :
10వ శతాబ్దం నేపథ్యంలో చోళ రాజవంశం చుట్టూ సాగుతూ ఈ కథ మొదలైంది. చోళ రాజ్యాన్ని హస్త గతం చేసుకోవడానికి ఆ కుటుంబంలోని ఆ రాజు అన్నయ్య కుమారుడే కుట్రలు పన్నుతాడు. మరో వైపు చోళ రాజ్య యువరాజు ఆదిత్య (విక్రమ్) గతంలో పాండ్య రాజును చంపినందుకు ఐశ్వర్య రాయ్ (నందిని) కుట్రలు పన్నుతూ.. చోళ రాజ్యం నాశనానికి పునాదులు తవ్వుతూ ఉంటుంది. కానీ, అప్పటికే చోళ రాజ్యపు యువరాజు ఆదిత్య (విక్రమ్), అతని తమ్ముడు అరుణ్ మోళి (జయం రవి) ఇతర రాజ్యాల పై యుద్దానికి వెళ్తారు. ఇద్దరు దండయాత్ర చేస్తూ.. చేరే రాజ్యం వైపు వెళ్తారు. ఈ క్రమంలో చోళ రాజ్యం పై జరుగుతున్న కుట్రలను అడ్డుకోవడానకి తన మిత్రుడు వల్లవ్ రాయ్ (కార్తీ) ని ఆదిత్య చోళ రాజ్యపు రాజు (ప్రకాష్ రాజ్) దగ్గరకు పంపుతాడు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది ?, చోళ రాజ్యపు యువరాణి (త్రిష), వల్లవ్ రాయ్ (కార్తీ)కి ఏం చెప్పింది ?, వల్లవ్ రాయ్ (కార్తీ) అరుణ్ మోళి (జయం రవి) దగ్గరకు ఎందుకు వెళ్ళాడు ?, చివరకు మొదటి భాగం కథ ఎలా ముగిసింది? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
చోళ రాజ్యంలో జరిగిన సమరమే ఈ చిత్రంలో ప్రధాన హైలైట్. అలాగే చరిత్రలో దాగిన వీరుల కథలకు ఫిక్షనల్ అంశాలని జోడించి మణిరత్నం ఈ సినిమాని విజువల్ గా చాలా బాగా తెరకెక్కించాడు. చరిత్రలో చోళ రాజ్యానికి చాలా ప్రత్యేకత వుంది. చాలా ఏళ్ల పాటు సుదీర్ఘంగా పాలించిన ఘనత చోళ రాజులది. లార్జర్ దేన్ లైఫ్ స్టోరీ కావడంతో మొదటి పార్ట్ లో కూడా చాలా కథను రివీల్ చేయాల్సి వచ్చింది. అలాగే, చోళ రాజ్యపు అంతః పురం వ్యూహాలు, కుట్రలు కుతంత్రాల సమాహారంగా సాగే సన్నివేశాలు కూడా బాగున్నాయి.
ఈ చిత్రంలోని నటీనటుల ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. చోళ రాజ్యపు యువరాజుగా విక్రమ్, పగతో రగిలిపోయే నందిని పాత్రలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, గొప్ప వీరుడిగా జయం రవి అధ్భుతంగా నటించారు. అయితే, ఈ మొదటి పార్ట్ ను నడిపిన ప్రధాన పాత్ర మాత్రం కార్తీ దే. తన పాత్రలో కార్తీ చాలా బాగా నటించాడు. అలాగే త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రభు, ఆర్. శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్ ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు.
మైనస్ పాయింట్స్ :
చోళ రాజ్యానికి సంబధించిన చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ భారీ హిస్టారికల్ చిత్రంలో మోతాదుకు మించిన భారీ తనం ఉంది గానీ, ఆకట్టుకునే కంటెంటే మిస్ అయింది. మంచి నేపథ్యం, బలమైన పాత్రలను తీసుకున్నప్పటికీ.. టిపికల్ నేరేషన్ తో, పూర్తి ఆసక్తికరంగా సాగని గందరగోళ డ్రామాతో సినిమాను ఆకట్టుకునే విధంగా దర్శకుడు మణిరత్నం మలచలేకపోయారు. దీనికి తోడు సినిమా స్లోగా సాగుతూ చాలా చోట్ల బోర్ కొడుతుంది.
దీనికితోడు మణిరత్నం ల్యాగ్ సీన్స్ కూడా కాస్త ఇబ్బంది పెడతాయి. నిజానికి ఆర్టిస్ట్ ల పరంగా చూసుకుంటే సినిమా మీద ప్రేక్షకుడికి ప్రతి ఇరవై నిమిషాలకు ఇంట్రెస్ట్ పుట్టించే స్కోప్ ఉంది. అయినప్పటికీ దర్శకుడు మాత్రం.. అవన్నీ వదిలేసి, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపేశాడు. పైగా ఐశ్వర్య రాయ్ రెండో పాత్రకు సంబంధించి ప్లే లో రాసుకున్న ట్విస్ట్ కూడా పెద్దగా పేలలేదు.
మొత్తానికి సినిమా నిండా ఎమోషన్ ఉన్నట్లే అనిపిస్తోంది కానీ.. ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యే విధంగా మాత్రం, ఆ ఎమోషన్ సరిగ్గా ఎలివేట్ కాలేదు. కనెక్ట్ కాలేదు. అదే విధంగా సినిమా ఎక్కువుగా తెలుగు నేటివిటీకి దూరంగా సాగడం కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందే చెప్పుకున్నట్లు స్రిప్ట్ లో తప్ప, టేకింగ్ అండ్ మేకింగ్ పరంగా సినిమా బాగుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి క్రాఫ్ట్ లో డెప్త్ ఉంది. అందుకే సాంకేతికంగా పెద్దగా ఎక్కడా లోపాలు కనిపించవు. వీ.ఎఫ్.ఎక్స్ దగ్గర నుంచీ కెమెరా వర్క్, నేపథ్య సంగీతం వరకూ ప్రతి క్రాఫ్ట్ వర్క్ చక్కగా కుదిరింది. చివరగా నిర్మాణ విలువలు అద్భుతం. కాకపోతే దర్శకుడు మణిరత్నం కథనం పై ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.
తీర్పు :
విజువల్ వండర్ గా సాగిన ఈ ఎమోషనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో.. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. అలాగే విక్రమ్, ఐశ్వర్య, జయం రవి, కార్తీ, త్రిష ఇలా భారీ తారాగణం అంతా తమ నటనతో ఆకట్టుకున్నారు. అయితే స్లో నేరేషన్, బోరింగ్ ప్లే, అండ్ రెగ్యులర్ యాక్షన్ అండ్ ల్యాగ్ సీన్స్ వంటి అంశాలు కారణంగా ఈ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. సినిమాలో బలహీనమైన పాత్రలు కూడా ఎక్కువగా ఉండటం.. ఆ పాత్రల తాలూకు సన్నివేశాలు కూడా ఉత్కంఠ కలిగించలేకపోయాయి. ఓవరాల్ గా ఈ సినిమా ఆకట్టుకోలేక పోయింది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team