విడుదల తేదీ : జూన్ 16, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, సోనాల్ చౌహన్, దేవదత్త నాగే
దర్శకుడు : ఓం రౌత్
నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్
సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ : అజయ్ – అతుల్ మరియు సంచిత్ బల్హార, అంకిత్ బల్హార
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని
ఎడిటర్: అపూర్వ మోతివాలే సహాయ్, ఆశిష్ మ్హత్రే
సంబంధిత లింక్స్: ట్రైలర్
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ:
రాఘవ (ప్రభాస్) తన సతీమణి జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసంలో ఉండగా రావణ (సైఫ్ అలీ ఖాన్) సాధువు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. తన సోదరి శూర్పణఖ చెప్పిన మాటలకు తోడు సహజంగా తన స్వభావం కారణంగా రావణ జానకి పై ఆశ పెంచుకుంటాడు. అనంతరం రాఘవ తన సతీమణి జానకిని దక్కించుకోవడానికి ఏం చేశాడు?, ఈ మధ్యలో హనుమంతుడి శక్తి ఎలా సాగింది ?, అలాగే ఈ యుద్ధంలో వానర సైన్యం పోరాట పటిమ ఎలా సాగింది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
రామాయణంలోని ప్రధాన ఘట్టాలను యుద్ద నేపథ్యంలో పూర్తిగా 3డిలో తెరకెక్కించడమే ఈ సినిమా ప్రధాన ప్లస్ పాయింట్. పైగా అన్ని ముఖ్య పాత్రలకు అగ్ర నటీనటులు నటించడం.. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో చాలా బాగా నటించారు. పైగా అత్యంత భారీ అంచనాలతో పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్, భారీ నిర్మాణ విలువలు ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్లు.
ఇన్నాళ్లు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓం రౌత్ ఈ సినిమా రూపంలో గుర్తుపెట్టుకునే మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. సినిమా చూస్తున్నంత సేపూ ఓ అత్యుత్తమైన హాలీవుడ్ యాక్షన్ మూవీ చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ప్రభాస్ తన పరిపక్వతమైన నటనతో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యుద్ద సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.
ఇక కథానాయికగా నటించిన కృతి సనన్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ కృతి సనన్ పలికించిన హావభావాలు అలరించాయి. సైఫ్ అలీ ఖాన్ గెటప్ ఇబ్బంది పెట్టినా.. నటన బాగుంది. అలాగే సన్నీ సింగ్, సోనాల్ చౌహన్, దేవదత్ నాగ్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ అంటే కథనమే. ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నంత సేపూ తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోతూ ఉంటుంది. అలాగే సినిమాలో పాత్రల గెటప్ లు అండ్ సెటప్ కూడా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావు. దర్శకుడు ఓం రౌత్ 3డి విజువల్స్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథాకథనాలు మీద పెట్టలేదనిపిస్తుంది.
సినిమాలోని ఒక్కో సన్నివేశం విడిగా చూస్తే, ఆ సన్నివేశాలన్నీ పాత సినిమాల్లో చూసిన ఫీలింగే కలుగుతుంది. దీనికి తోడు సినిమా మొత్తం స్లోగా సాగుతూ ఉండటం వల్ల..ప్రేక్షకులు కొంత అసహనానికి గురి అవుతారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను అనవసరంగా లాగడం వల్ల ఆ సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అయింది. ఇంకా టైట్ స్క్రీన్ ప్లే మరియు ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉండి ఉంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను చాలా అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగుంది. సంగీత దర్శకులు అజయ్ – అతుల్ మరియు సంచిత్ బల్హార, అంకిత్ బల్హార సమకూర్చిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు కూడా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. దర్శకుడు ఓం రౌత్ 3డిలో భారీ విజువల్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినా.. మెయిన్ గా కథనంలో ఇంట్రెస్ట్ మిస్ అయింది. నిర్మాతల నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.
తీర్పు :
రామాయణం లాంటి అత్యద్బత దృశ్య కావ్యాన్ని.. ‘ఆదిపురుష్’ అంటూ 3డిలో వచ్చిన ఈ మైథలాజికల్ విజువల్ యాక్షన్ డ్రామా బాగానే ఆకట్టుకుంది. 3డి ఎఫెక్ట్స్, ప్రభాస్ – కృతి సనన్ ల నటన, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. అయితే, తెలిసిన కథ కావడం, పైగా సెకెండ్ హాఫ్ పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ గా సాగకపోవడం వంటి అంశాలు సినిమాని బలహీనపరుస్తాయి. అయితే ప్రభాస్ తన స్టార్ డమ్ తో ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకు వెళ్లారు. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రభాస్ ఫాన్స్ ను, చిన్న పిల్లలను చాలా బాగా ఆకట్టుకుంటుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team