విడుదల తేదీ : నవంబర్ 17, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : గోవర్ధన్ గజ్జల
నిర్మాత : గోవర్ధన్ గజ్జల
సంగీతం : జితిన్ రోషన్
నటీనటులు : చంద్రకాంత్ దత్త, రాధికా మెహరోత్ర, పల్లవి డోర
ఎన్నారై గోవర్ధన్ గజ్జల దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ ఈరోజే విడుదలైంది. ప్రమోషన్లు, ట్రైలర్ ద్వారా మంచి ఆసక్తిని కలుగజేసిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
జై (చంద్రకాంత్ దత్త) తాను ప్రేమించిన అమ్మాయి మైథిలి (రాధికా మెహరోత్ర) కోసం యూఎస్ యూఎస్ వెళతాడు. అమెరికాలో ప్రేయసిని వెతుకుతున్న సమయంలో అతని జీవితంలోకి సారా (పల్లవి డోర) ఎంటరవుతుంది. జై కూడా ప్రేమించిన అమ్మాయి వివరాలను కనుక్కోవడం కోసం ఆమెతో క్లోజ్ గా ఉంటాడు.
అలా జైకు దగ్గరైన సారా అతన్ని గాఢంగా ప్రేమిస్తుంది. కానీ జై మాత్రం మైథిలీనే ఇష్టపడుతూ ఆమెనే వెతుకుతుంటాడు. దాంతో మనస్తాపం చెందిన సారా అతని ప్రేమకు అడ్డుతగులుతూ ఇబ్బందులు పెడుతుంటుంది. ఆ ఇబ్బందుల నుండి జై ఎలా బయపడ్డాడు, తాను ప్రేమించిన మైథిలిని కలుసుకున్నాడా లేదా, చివరికి అతని ప్రేమ ఏమైంది అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
దర్శకుడు గోవర్థన్ గజ్జల ప్రేమ కథను ఎంచుకోవడమే ఈ సినిమాకి ప్రధాన బలం. ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని ఆయన డీల్ చేసిన విధానం బాగుంది. అంతేగాక స్క్రీన్ ప్లేను రాసుకున్న తీరు కూడా ఆకట్టుకుంది. కాసేపు ప్రస్తుతంలో నడిపి ఇంకాసేపు గతంలోకి తీసుకెళ్లి సెకండాఫ్లో పూర్తిగా ప్రెజెంట్లో కథను చెప్పడంతో సినిమా చాలా స్పష్టంగా అర్థమైంది. అంతేగాక హీరోగా చంద్రకాంత్ దత్త పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అతనిది మొదటి సినిమా అంటే నమ్మడం కొంచెం కష్టమే.
ఇక రాధికా మెహరోత్ర మైథిలి పాత్రలో ఇన్నోసెంట్ గా కనిపిస్తూనే ఉన్నట్టుండి నెగటివ్ షేడ్స్ ను ప్రదర్శించడం కూడా బాగుంది. హీరో హీరోయిన్ల మధ్య రాసిన ప్రేమ తాలూకు కొన్ని సన్నివేశాలు, డైలాగులు బాగా కనెక్టయ్యాయి. జెమినీ గణేష్ కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయింది. జితిన్ రోషన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కూడా రిఫ్రెషింగా అనిపించాయి. ఇంటర్వెల్ సమయంలో రివీల్ అయ్యే కీలక మలుపు మంచి థ్రిల్ ను అందించింది.
మైనస్ పాయింట్స్ :
సినిమాలోని స్క్రీన్ ప్లే బాగున్నా కూడా గుతుండిపోయే బలమైన సన్నివేశాలు లేకపోవడం ప్రధాన బలహీనత. ఎమోషనల్ గా ఉండాల్సిన సన్నివేశాలు కూడా ఏదో అలా అలా తెలిపోయాయి. కీలకమైన ఆ సీన్లపై ఇంకొంచెం వర్క్ చేసి ఎమోషన్ ను పండించి ఉంటే సినిమా రిజల్ట్ ఇంకాస్త బెటర్ గా ఉండేది. ఇంటర్వెల్ సమయంలో ముఖ్యమైన ట్విస్ట్ తేలిపోగానే సెకండాఫ్లో ప్రీ క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుందో సీన్ టు సీన్ ఊహించేయవచ్చు. దాంతో రెండవ అర్థ భాగం ఆసాంతం సాగదీసిన ఫీలింగ్ కలిగింది.
ముగింపులో హీరో తల్లి కోణం నుండి రివీల్ చేసే ఒక పాయింట్ బాగుంటుంది. దాన్నే ఇంకాస్త డీప్ గా కథలో ఇన్వాల్వ్ చేసి ఉంటే అండర్ ప్లేలో మథర్ సెంటిమెంట్ పండి సినిమా ఇంకాస్త రక్తికట్టేది. కానీ దర్శకుడు ఆ అంశాన్ని కేవలం రెండు నిముషాల క్లైమాక్స్ కోసం మాత్రమే వాడుకున్నాడు. ఇక హీరో నిర్లక్ష్యానికి గురైన అమ్మాయి హీరో ప్రేమకి అడ్డుతగలడం అనే కాన్సెప్ట్ పాతదే అయినా బలమైన సన్నివేశాలతో చెప్తే ప్రభావంతంగా కనెక్ట్ అయ్యే అవకాశముంది. కానీ దర్శకుడు అలంటి సీన్లను రాసుకోకపోవడంరతో అది కాస్త బలహీనపడి సినిమాపై ఆసక్తిని సన్నిగిల్లేలా చేసింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు గోవర్థన్ గజ్జల పార్టీ స్థాయి సినిమాల్లో అనుభవం లేకుండానే తీసిన ఈ సినిమా అతనిలోని సృజనాత్మకతను బయటపెట్టి సినిమాను హ్యాండిల్ చేయగల సత్తా అతనిలో ఉందని ప్రూవ్ చేసింది. నార్మల్ కథకు రెండు ట్విస్టులను జోడించి కొంత భిన్నమైన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్న ఆయన సన్నివేశాలని ఎమోషనల్ గా ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే బాగుండేది.
జితిన్ రోషన్ నైపథ్య సంగీతం బాగుంది. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నేచ్యురల్ లొకేషన్స్ లో బాగానే తీశారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఆ బడ్జెట్లో సినిమాను పూర్తి చేయడమంటే మెచ్చుకోదగిన విషయమే.
తీర్పు :
ఎన్నారై గోవర్థన్ గజ్జల మొదటి ప్రయత్నం ఈ ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ తో అతనిలో ఒక సినిమాను హ్యాండిల్ చేయగల స్టామినా ఉందని నిరూపించేలా ఉంది. భిన్నమైన స్క్రీన్ ప్లే విధానం, నటీనటుల పెర్ఫార్మెన్స్, సంగీతం, ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ కాగా బలహీనమైన, భావోద్వేగాలను క్యారీ చేయలేకపోయిన సన్నివేశాలు, ఊహాజనితమైన సెకండాఫ్ బలహీనతలుగా ఉన్నాయి. మొతం మీద చెప్పాలంటే ఈ చిత్రం ప్రేమ కథలను అమితంగా ఇష్టపడేవారికి నచ్చే అవకాశముంది.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team