ఆడియో సమీక్ష : ప్రేమమ్ – మళ్ళీ మళ్ళీ వినాలనేంత ప్రేమంగా..!

ఆడియో సమీక్ష : ప్రేమమ్ – మళ్ళీ మళ్ళీ వినాలనేంత ప్రేమంగా..!

Published on Sep 20, 2016 5:48 PM IST

Premam-m
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మళయాలంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్‌’కు రీమేక్ అయిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల కానుంది. ఇక నేడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రేమమ్ ఆడియోను విడుదల చేశారు. మళయాల వర్షన్‌కు రాజేష్ మురుగేశన్ అందించిన నాలుగు పాటలను తెలుగులోనూ అలాగే ఉంచగా, మిగతా మూడు పాటలకు గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. మరి భారీ అంచనాల మధ్యన విడుదలైన ఈ ఆడియో ఎలా ఉందీ? చూద్దాం..

1. పాట : ఎవరే2
గాయనీ గాయకులూ : విజయ్ యేసుదాసు
సాహిత్యం : శ్రీమణి

‘ఎవరే’ని నిస్సందేహంగా ఈ ఆల్బమ్‍లో బెస్ట్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. రాజేశ్ మురుగేశన్ అందించిన అద్భుతమైన ట్యూన్‌కు విజయ్ యేసుదాసు అనితర సాధ్యమైన గానం తోడై పాట స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఇక శ్రీమణి అందించిన సాహిత్యం గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. ‘గదిలాంటి మదిలో, నదిలాంటి నిన్నే, దాచేయాలనుకుంటే అది నా అత్యాశే!’ లాంటి ప్రయోగాలను శ్రీమణి అడుగడుగునా చేశాడు. విన్న వెంటనే ఎక్కేసే ఈ పాట అలా వెంట వచ్చేసేంత హాయిగా ఉంది. విజువల్స్‌తో కలిపి చూస్తే ఇంక పాటకు తిరుగుండదనే ఆశించొచ్చు.

2. పాట : అగరొత్తుల7
గాయనీ గాయకులూ : నరేష్ అయ్యర్
సాహిత్యం : పూర్ణా చారి

‘అగరొత్తుల..’ అంటూ సాగే ఈ ఫన్ అండ్ రొమాంటిక్ నంబర్ కూడా వినగానే ఎక్కేసేలా చాలా బాగుంది. రాజేశ్ మురుగేశన్ అందించిన అదిరిపోయే ట్యూన్‌కు పూర్ణాచారి సాహిత్యం తోడై పాటకు మంచి ఎనర్జీ వచ్చింది. ‘అగరొత్తుల కురులే వలగా విసిరేసావే..’ లాంటి ప్రయోగాలతో పాట అడుగడుగునా వినసొంపుగా సాగిపోయింది. ముఖ్యంగా నరేష్ అయ్యర్ గానం పాటకు ఓ ప్రత్యేక స్థాయిని తీసుకొచ్చింది. అందాన్ని పొగుడుతూ వచ్చే ఈ పాట విజువల్స్‌తో కలిపి చూస్తే ఇంకెంత బాగుంటుందో చెప్పనవసరం లేదు.

3. పాట : నిన్న లేని3
గాయనీ గాయకులూ : కార్తీక్
సాహిత్యం : కృష్ణ మదినేని

నిన్నలేని అంటూ వచ్చే మూడో పాట కూడా మళయాలం ఒరిజినల్ పాటే! తెలుగు వర్షన్ కోసం ట్యూన్‌లో చేసిన మార్పులు పాటకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. రాజేశ్ మురుగేశన్ ట్యూన్‌కు ఎక్కడా వంక పెట్టడానికి లేదు. దానికి కృష్ణ మాదినేని సాహిత్యం, కార్తీక్ గానం తోడై పాటను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. సంగీతం, గానం, సాహిత్యం.. మూడూ పద్ధతిగా కలిస్తే ఎలా ఉంటుందో ఈ పాటలోనూ చూడొచ్చు. ఇది కూడా వినగానే ఎక్కేసే పాటగా చెప్పుకోవచ్చు.

4. పాట : ప్రేమ పూసెనే6
గాయనీ గాయకులూ : కార్తీక్
సాహిత్యం : పూర్ణా చారి

‘ప్రేమ పూసెనే..’ అంటూ వచ్చే ఈ పాట కూడా వినగానే ఎక్కేసేలా చాలా బాగుంది. ఈ పాటకు పూర్ణా చారి అందించిన సాహిత్యం బలంగా చెప్పుకోవచ్చు. లవ్ ఫెయిల్ నేపథ్యంలో వచ్చే పాటకు సాహిత్యం సరిగ్గా సరిపోయేలా ఉంది. రాజేశ్ మురుగేశన్ ట్యూన్ కూడా చాలా బాగుంది. కార్తీక్ పాటలో ఫీల్‌ను చాలా బాగా పట్టుకున్నట్లు కనిపించింది.

5. పాట : బ్యాంగ్ బ్యాంగ్bang
గాయనీ గాయకులూ : హరిచరణ్
సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి

‘బ్యాంగ్ బ్యాంగ్ బ్లాస్ట్ ఇదీ..’ అనే ఈ పాట గోపీ సుందర్ తెలుగు వర్షన్ కోసం అందించినది. ఒరిజినల్ ప్రేమమ్‌లో లేని ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం బాగా ఆకట్టుకుంది. ‘ఓ మై గాడ్ ఏంటిదీ.. గుండెసడీ స్పీడైనదీ..’ లాంటి తెలుగు-ఇంగ్లీష్ పదాలతో సాగే రామ జోగయ్య శాస్త్రి స్టైల్ సాహిత్యం కొత్తగా ఉంది. హరిచరణ్ గానం కూడా పాట ఎనర్జీకి తగ్గట్టుగా బాగా కుదిరింది.

6. పాట : ఎన్నోసార్లు1
గాయనీ గాయకులూ : సచిన్ వారియర్
సాహిత్యం : వనమాలి

ఎన్నోసార్లు అంటూ వచ్చే ఈ పాట గోపీ సుందర్ స్టైల్లో వచ్చే మంచి పాటగా చెప్పుకోవచ్చు. సచిన్ వారియర్ గానం పాటకు మరింత అందాన్ని తెచ్చింది. వనమాలి అందించిన సాహిత్యం కూడా చాలా బాగుంది. ‘ఇలాంటప్పుడే రవ్వంత.. ఎలా నమ్మడం ఇదంతా.. అనే డౌటులే ఎదంతా..’ లాంటి పదాలతో చేసిన మ్యాజిక్, దానికి సచిన్ గానం కూడా సరిగ్గా తోడవడం లాంటివి పాటకు ఓ స్థాయి తెచ్చాయి. ముఖ్యంగా గోపీసుందర్ ఇన్స్ట్రుమెంట్స్‌తో చేసిన మ్యాజిక్ చాలా బాగా ఆకట్టుకుంది. వినగానే ఎక్కేసేలా లేకపోయినా వినగా వినగా ఈ పాట కూడా చాలా బాగా ఆకట్టుకునేలా ఉందనే చెప్పొచ్చు.

7. పాట : ఎవడు ఎవడు4
గాయనీ గాయకులూ : రంజిత్
సాహిత్యం : శ్రీమణి

ప్రేమమ్ సినిమాలోని ఇతర పాటల ఫీల్‌ను ఏమాత్రం పోగొట్టుకుండానే బాగా ఆకట్టుకున్న డిఫరెంట్ ఎనర్జీ నెంబర్ ‘ఎవడు ఎవడు..’. హే మచ్చి హే మచ్చి అన్నప్పుడల్లా పాటలోని ఎనర్జీ స్థాయి గురించి ఎంత చెప్పినా తక్కువే! రంజిత్ గానంలో పాట ఎనర్జీని, మధ్యలోని ఫీల్‍నూ ఒకేసారి అందుకోవడం మ్యాజిక్‌గానే చెప్పొచ్చు. శ్రీమణి అందించిన సాహిత్యం కూడా పాట ఎనర్జీకి తగ్గట్టే చాలా బాగుంది.

తీర్పు :

‘ప్రేమమ్’ మళయాలంలో ఎంత పెద్ద విజయం సాధించిందో, ఆ సినిమా ఆల్బమ్ కూడా అంతే పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు రీమేక్ అయిన ఈ ‘ప్రేమమ్’ ఆడియో కూడా అంచనాలకు ఎక్కడా తగ్గకుండా మనసుల్ని హత్తుకునేంత హాయిగా ఉందనే చెప్పాలి. మళయాల వర్షన్‌లోని నాలుగు పాటలను అలాగే తీసుకున్నా, ఆ పాటలను తెలుగులో కూడా ఎక్కడా చెడగొడ్డకుండా అద్భుతంగా మళ్ళీ కూర్చడం చాలా బాగుంది. ఇక గోపీ సుందర్ కొత్తగా ఇచ్చిన మూడు పాటలు కూడా ఆల్బమ్ స్థాయిని పెంచేవిగానే ఉండడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతీ పాటలోనూ సంగీతం, సాహిత్యం, గానంలతో చేసిన మ్యాజిక్ కనిపిస్తూ ఉండే ఈ ఆల్బమ్‌లో ప్రత్యేకించి ఈ పాట బాగుందని చెప్పడం కష్టమే. అయితే ఎవరే, నిన్నలేని, అగరొత్తుల పాటలు అరుదుగా వచ్చి, ఎప్పటికీ నిలిచేవాటిల్లో ఉంటాయని చెప్పొచ్చు. చివరగా.. ‘ప్రేమమ్’ పాటలు ఎలా ఉంటాయో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న వారందరినీ మెప్పించడమే కాక, వారు రోజూ వినే ఆల్బంలలో ఒకటిగా చేరిపోయేంత వినసొంపుగా ‘ప్రేమమ్’గా ఈ ఆడియో ఉంది.

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు