సమీక్ష : పులి – గర్జించలేకపోయిన పులి.!

shivam review

విడుదల తేదీ : 2 అక్టోబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : చింబుదేవన్ డి

నిర్మాత : శోభ, శిభు థమీన్స్, సెల్వ కుమార్

సంగీతం : దేవీశ్రీ ప్రసాద్

నటీనటులు : విజయ్, శ్రీదేవి, శృతి హాసన్, హన్సిక, సుధీప్..


‘తుపాకి’ ఫేం తమిళ స్టార్ హీరో ఇలయథలపథి విజయ్ హీరోగా నటించిన సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ ‘పులి’. చాలా కాలం తర్వాత ఎవర్గ్రీన్ బ్యూటీ నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో నటించిన ఈ సినిమాలో శృతి హాసన్, హన్సికలు హీరోయిన్స్ గా నటించారు. కన్నడ స్టార్ సుధీప్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాకి చింబుదేవన్ దర్శకుడు. భారీ బడ్జెట్ తో, ఉన్నత గ్రాఫిక్స్ విలువలతో సుమారు ఏడాదిన్నర పాటు తీసిన ఈ సినిమా అక్టోబర్ 1న రిలీజ్ కావాలి, కానీ ఫైనాన్సియల్ గా ఇబ్బందులు ఎదురవడం వల్ల తమిళంలో అదే రోజు రిలీజ్ అయినా తెలుగులో మాత్రం అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం షోస్ నుంచి సినిమాని రిలీజ్ చేసారు. మరి ఈ సోషియో ఫాంటసీ ఏ మేరకు మెప్పించిది అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

పులి కథని మొదలు పెడితే.. అనగనగా.. అనగనగా.. అఘోరా ద్వీపం నుంచి భేతాళ జాతికి చెందిన కొంతమంది వచ్చి దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకొని దానికి భేతాళ దేశంగా పేరు పెట్టి వారి కింద ఉన్న 56 ఊర్లని పరిపాలిస్తూ ఉంటారు. ఆ భేతాళ దేశాన్ని పరిపాలించే రాణి యవ్వనరాణి(శ్రీదేవి). ఆమెకి దళపతి అయిన జలంధరుడు(సుధీప్) ప్రజలని హింసలు పెడుతూ, వారిని బానిసలుగా ట్రీట్ చేస్తూ వారి పంట, ధనాన్ని లాక్కుంటూ ఉంటారు. కానీ ఆ భేతాళ దేశం కింద ఉండే గ్రామాల్లో భైరవ కోన ఒకటి. ఆ భైరవకోనకి నాయకుడు నరసింగ నాయకుడు(ప్రభు). అతనికి నదిలో కొట్టుకు వచ్చిన ఓ బిడ్డ దొరుకుతాడు. ఆ బిడ్డకు మనోహరుడు(విజయ్) అని పేరు పెడతాడు.

నరసింగ నాయకుడు మనోహరుడుని భేతాళ జాతిని అడ్డుకోగల వీరుడిలా తయారు చేస్తాడు. ఇదిలా ఉండగా మనోహరుడు అదే కోనలో ఉండే మందార మల్లి(శృతి హాసన్)తో ప్రేమలో పడతాడు. వీరిద్ద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. అదే సమయంలో భేతాళ జాతి వారు వచ్చి భైరవ కొనలోని వారిని కొట్టి, మందార మల్లిని ఎత్తుకొని వెళ్ళిపోతారు. దాంతో మన మనోహరుడు మందార మల్లి కోసం భేతాళ దేశానికి బయలు దేరుతాడు. కానీ అక్కడికి వెళ్ళాలి అంటే పలు చిక్కులు ఉంటాయి. ఆ చిక్కులను దాటుకుంటూ వెళ్ళిన మనోహరుడు మందార మల్లిని ఎలా కాపాడాడు.? అలాగే ఆ భేతాళ దేశంలో మనోహరుడు తన గురించి తనకు తెలియని విషయాలను ఏం తెలుసుకున్నాడు.? మనోహరుడు ఒంటరిగా భేతాళ దేశంలో తను అనుకున్నది సాధించాడు అన్నదే మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సింది.

ప్లస్ పాయింట్స్ :

పులి సినిమాలో స్టార్ నటీనటులు చాలా మందే ఉన్నారు.. ముందుగా హీరో విజయ్ రెండు పాత్రల్లో బాగానే చేసాడు. ముఖ్యంగా పోరాట సన్నివేశాలతో పాటు తన మార్క్ కామెడీతో ఆడియన్స్ ని నవ్వించడానికి ట్రై చేసాడు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శ్రీదేవి చాలా బాగా చేసింది. ఓ రాజ్యానికి అధినేతగా, ఈవిల్ క్వాలిటీస్ ఉన్న క్వీన్ గా అందరినీ మెప్పించింది. ఇప్పటికీ వన్నెతగ్గని అందంతో హీరోయిన్స్ కి పోటీని ఇచ్చింది. ఇక శృతి హాసన్- హన్సికలు ఇద్దరూ తమ అందచందాలతో బాగా ఆకట్టుకున్నారు. శృతి హాసన్, హన్సికల స్కిన్ షో సినిమాకి అదనపు ఆకర్షణ. ఈగ సుధీప్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మరోసారి మెప్పించాడు. విజయ్ – సుధీప్ మధ్య జరిగే పోరాటం ఆకట్టుకుంటుంది. చిన్న పాత్రలలో కనిపించే నందిత శ్వేత, ప్రభు, విజయ్ కుమార్ లు తమ తమ పాత్రల్లో పరవాలేధనిపించారు. తంబిరామయ్య కామెడీ అక్కడక్కడా బాగానే పేలింది.

ఇదొక సోషియో ఫాంటసీ సినిమా.. అనగా ఇందులో మనకు ముందెన్నడూ కనిపించని ఓ భారీ భారీ కోటలు, సర్ప్రైజ్ చేసే మిస్టరీ ఎఫెక్ట్స్ ఉండాలి. వాటితో పాటు రకరకాల మనుషులను, భారీ భారీ ఆకారాలను, లిల్లీ పుట్స్ లాంటి వారిని చూపించాలి. ఈ అన్ని విషయాల్లోనూ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే తను చూపించిన గ్రాండియర్ విజువల్స్ సినిమాకి చాలా పెద్ద ప్లస్. ఎందుకంటే సినిమా ఆసక్తికరంగా లేకపోయినా విజువల్స్ మాత్రం మిమ్మల్ని చూపు తిప్పుకోనివ్వవు. ఇక సినిమా పరంగా సినిమా ప్రారంభం బాగుంటుంది. అలాగే విజయ్ పై వచ్చే కొన్ని సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి. సెకండాఫ్ లో శ్రీదేవి – విజయ్ – సుధీప్ మధ్య వచ్చే ఎపిసోడ్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

పులి అనే సోషియో ఫాంటసీ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ గా నిలిచిన అంశం కథ. ఎందుకంటే బేసిక్ రివెంజ్ స్టొరీ అనగా తండ్రి పగని కొడుకు తీర్చుకునే కథకి కొత్తదనం యాడ్ చెయ్యాలని సోషియో ఫాంటసీ అనే జానర్ ని కలిపాడు. కానీ కథకి అస్సలు హెల్ప్ కాలేదు. చెప్పాలంటే అమర చిత్ర కథల్లో, చందమామ కథల్లో ఉండే ఆసక్తిని కూడా పులి సినిమా కథలో లేదు. కథతో పాటు కథనం కూడా సినిమాకి చాలా పెద్ద మైనస్. సినిమాలో ఎక్కడా అబ్బా సూపర్ ఉందే అని అనిపించుకునే పాయింట్ లేదు. కొద్ది సేపటికే కథ అర్థమయ్యాక అంతా ఊహాజనితంగా సాగుతుంది. దానికి తోడు సినిమా నేరేషన్ చాలా అంటే చాలా స్లోగా సాగుతుంది.

సినిమాలో కథకి అవసరం అయిన వాటి కంటే అనవసరం అనిపించుకునే సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఊ అన్నా, ఆ అన్నా పాట వచ్చేస్తుంది. అన్ని పాటలు అవసరం లేదు. అనవసరపు సీన్స్, సాంగ్స్ ని కలుపుకొని 30 నిమిషాల సినిమాని ఈజీగా కట్ చేసి సినిమా రన్ టైంని తగ్గిస్తే చూసే ఆడియన్స్ కి బెటర్ ఫీలింగ్ వస్తుంది. ఇక డైరెక్టర్ గా విజువల్స్ ని అయితే చూపించగలిగాడు కానీ పేపర్ మీద రాసుకున్న సీన్స్ ని స్క్రీన్ పైకి తీసుకురాలేకపోయాడు. ఏ సీన్ లోనూ పర్ఫెక్ట్ ఎమోషన్ కనిపించదు. ఒకవైపు విలన్స్ ని సీరియస్ గా చూపిస్తున్నా, హీరో సైడ్ నుంచి మాత్రం కథని కామెడీగా చూపిస్తూ ఉంటాడు. ఆ పాయింట్ ఆడియన్స్ కి అస్సలు కనెక్ట్ అవ్వదు. అలాగే సినిమాకి మెయిన్ అనిపించుకునే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా సిల్లీగా అనిపించడంతో క్లైమాక్స్ పై ఆసక్తి పోతుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో చెప్పుకోదగిన వాటిలో మొదటిది నటరాజన్ సుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తను బ్లూ మాట్ షాట్స్ ని బట్టి పెట్టుకున్న ఫ్రేమ్స్, విజువల్స్ ని చూపిన విధానం సూపర్బ్. బ్లూ మాట్ షాట్స్ కి చేసిన సిజి వర్క్ 80% సూపర్బ్ గా ఉంది. మిగతా 20% మత్రం నాశిరకంగా ఉంది. ముత్తు రాజ్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. అసలు లేని కోట్లని ఇలా ఉంటాయేమో అని ఊహించి గీసిన కట్టడాలు బాగున్నాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అస్సలు బాగలేదు. చాలా చాలా స్లోగా ఉంది. సినిమాకి అదో పెద్ద మైనస్. తెలుగులో డైలాగ్స్ బాలేవు.

దేవీశ్రీ ప్రసాద్ అందించిన్ సాంగ్స్ తెలుగులో ఒకటి కూడా వినేలా లేవు. ఇకపోతే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక చింబుదేవన్ కథ – చాలా సింపుల్ అండ్ రొటీన్ ఓల్డ్ ఫార్మాట్ రివెంజ్ స్టొరీ. కథనం – వెరీ స్లో కావడం మేజర్ డ్రాబాక్. ఇక డైరెక్టర్ గా కూడా తను అనుకున్న దానిని సరిగా ప్రెజంట్ చేయలేకపోయాడు. ఇక శిభు థమీన్స్, సెల్వ కుమార్ నిర్మాణ విలువలు సూపర్బ్ అనిపించుకుంటే శోభ డబ్బింగ్ వర్క్స్ యావరేజ్ గా ఉన్నాయి.

తీర్పు :

చాలా కాలం తర్వాత వస్తున్న సోషియో ఫాంటసీ మూవీగా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘పులి’ సినిమా ప్రేక్షకులను నిరాశాపరిచేలా ఉంది. ఈ సినిమా సినీ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోవడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ పేపర్ మీద రాసుకున్న కథని తెరపై చూపించలేకపోవడం. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఆడియన్స్ కి ఓ బోరింగ్ సినిమా చూసాం అనిపిస్తే, విజువల్స్ పరంగా, గ్రాండియర్ పరంగా చూసుకుంటే మాత్రం భలే ఉన్నాయే సెట్స్ అనిపిస్తుంది. భారీ భారీ సెట్స్, గుడ్ సిజి వర్క్, హీరోయిన్స్ గ్లామర్ సినిమాకి ప్లస్ అయితే ఆకట్టుకోలేకపోయిన కథ, కథనం, నేరేషన్, డైరెక్షన్, రన్ టైం, అనవసరపు సాంగ్స్ మేజర్ మైనస్ పాయింట్స్. సూపర్బ్ విజువల్స్, భారీ సెట్స్ చూసి సర్ప్రైజ్ అవ్వాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఫైనల్ గా పులి సినిమా విజువల్స్ పరంగా సూపర్, కానీ కంటెంట్ ఎగ్జిక్యూషన్ పరంగా జస్ట్ యావరేజ్.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version