షారూక్ ఖాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్రం ‘రా. వన్’. ఎలాంటి వ్యయ ప్రయాసలకు లెక్కచేయక తెరకెక్కించిన సినిమా ఇది. అత్యంత ఉన్నత సాంకేతిక విలువలతో తీసిన ఈ సినిమా తీరు తెన్నులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
చిత్ర కథ గురించి : శేఖర్ సుబ్రమణియన్ (షారూక్ ఖాన్) లండన్ లో పనిచేసే ఒక వీడియో గేమ్ డిజైనర్. అతని భార్య సోనియా (కరీనా కపూర్). కుమారుడు (అర్మాన్ వర్మ) కోరిక మేరకు ఒక బలమైన ప్రతినాయకుడు గల ఒక గేమ్ సృష్టిస్తాడు శేఖర్. దాని పేరే ‘రా. వన్’. మేధావి అయిన శేఖర్ తన కృత్రిమ మేధా సంపత్తి, పదిమంది ప్రతినాయకుల ప్రేరణ తో రా. వన్ ని తయారు చేస్తాడు. అయితే ఈ గేమ్ మొదటి లెవెల్ లోనే బాలుని చేతిలో రా. వన్ ఓటమి పాలవటం అతని అహాన్ని దెబ్బతీస్తుంది. దీంతో రా.వన్ బయటకొచ్చి ఆ బాలుడిని మట్టుబెట్టాలని ప్రయత్రిస్తాడు. ఈ పరిస్తితుల్లో ఆ బాలుడు తండ్రి , మరో సృష్టి జి.వన్(షారూక్ ఖాన్) ను రా.వన్ ను మట్టు బెట్టటానికి ప్రయోగిస్తాడు. అత్యంత శక్తి వంతునిగా రూపొందిన రా. వన్ ను, జి. వన్ ఎలా ఎదుర్కొంటాడు అనేది తెరపైనే చూడాలి.
ఇవి బాగున్నాయి : శేఖర్ సుబ్రమణియన్ పాత్రలో షారూక్ ఖాన్ నటన ఆకర్షణీయంగా ఉంది. కొన్ని చోట్ల అతని నటనకు నవ్వకుండా ఉండలేం. జి.వన్ పాత్రలో అతని యాక్షన్ సన్నివేశాలు అబ్బుర పరుస్తాయి. షారూక్ నటన ఆయా పాత్రలకు జీవం పోసింది. కరీనా కపూర్ – షారూక్ ల మద్య కెమిస్ట్రీ బావుంది. వీరి డ్యాన్స్ ఆకట్టుకొనేలా సాగింది. మరోవైపు అర్జున్ రాంపాల్ వేష ధారణ, శరీరాకృతి, అతని గెటప్ తో ఎదురులేని విలన్ గా కనిపించాడు. హీరో కొడుకుగా అర్మాన్ వర్మ నటన అందరి మన్ననలు పొందుతుంది. ప్రియాంకా చోప్రా, సంజయ్ దత్ మరియు రజినీకాంత్ అతిధి పాత్రలు పోషించారు. నమ్మశక్యంకాని విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా హాలీవుడ్ మూవీ లకు ఏమాత్రం తీసిపోకుండా ఉంది.
ఇవి బాగులేవు : చూడ్డానికి సినిమాను విజువల్ గా రక్తి కట్టించినప్పటికీ, భావోద్వేగాలు రేకెత్తియించలేకపోయారు. జి. వన్ – కిడ్ ల మధ్య అనుసంధానం అంతగా ఆకర్షించలేదు. తెలుగు ఫిలిం ‘అంజి’ చూసిన వారికి క్లైమేక్స్ ఓ అవగాహనా ఏర్పడిపోతుంది.
సాంకేతిక విభాగాలు : భావోద్వేగాల సంగతి పక్కన పెడితే, ఈ మూవీ లో సాంకేతిక విభాగాల పనితనం అత్యద్భుతంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం సోనీ టివి అందించిన టీవీ షోనే వీటికి ప్రేరణగా ఉందనిపిస్తుంది. నికోలా పెకరిని, మనికందన్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్. భావోద్వేగాలు రేకెత్తించటంలో విశాల్, శేఖర్ ల సంగీత పటిమ చెప్పనలవి కాదు. ఎడిటింగ్ కూడా ఇదే స్తాయిలో ఉంది. ఫైటింగ్, నృత్యాల కూర్పులో ఇది కనిపిస్తుంది. మొత్తంగా దర్శకుడు విజువల్ రిచ్ నెస్, ఉన్నత సాంకేతిక విలువలతో ఒక మాంచి మసాల హిందీ మూవిని అందించినట్టు కనిపిస్తుంది.
ఫైనల్ పాయింట్ : వీడియో గేమ్స్ ను ఇష్టపడేవారికి, షారుక్ అభిమానులకు ఈ మూవీ నచ్చుతుంది. అద్భుతమైన రా.వన్ ప్రయాణం విస్తు గొలిపే విధంగా ఉంటుంది. గిలిగింతలు పెట్టే హాస్యం ఉంటుందని మాత్రం సినిమాకు వెళ్లక్కరలేదు.
– నారాయణ ఎ.వి