సమీక్ష : రాధ – రొటీనే కానీ.. సరదాగా ఉంది

Radha movie review

విడుదల తేదీ : మే 12, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : చంద్ర మోహన్

నిర్మాత : భోగవల్లి బాపినీడు

సంగీతం : రాధన్

నటీనటులు : శర్వానంద్, లావణ్య త్రిపాఠి

ఈ సంవత్సరం ‘శతమానం భవతి’ చిత్రంతో కెరీర్లోనే అతి పెద్ద హిట్ అందుకోవడమేకాక తన మార్కెట్ స్థాయిని కూడా పెంచుకున్న యంగ్ హీరో శర్వానంద్ చేసిన మరొక చిత్రం ‘రాధ’. నూతన దర్శకుడు చంద్ర మోహన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:
చిన్నప్పటి నుండి కృష్ణుడంటే ఎక్కువగా ఇష్టపడే కుర్రాడు రాధాకృష్ణ (శర్వానంద్) తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటనతో పెద్దయ్యాక పోలీస్ అవ్వాలని నిర్ణయించుకుని చివరికి పోలీస్ అయి ఒక పల్లెటూరిలో పోస్టింగ్ కు వెళతాడు. అలా డ్యూటీ మీద ఆ ఊరికి వెళ్లిన రాధాకృష్ణ అదే ఊరిలో ఉండే రాధ (లావణ్య త్రిపాఠి) ని ప్రేమిస్తాడు.

ఇంతలోనే అతనికి హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా హైదరాబాద్ వచ్చిన అతనికి లోకల్ గా ఉండే పొలిటీషియన్ చేసిన దుర్మార్గాలు, పోలీస్ డిపార్ట్మెంట్ కు తలపెట్టిన ద్రోహం తెలిసి ఎలాగైనా అతన్ని నాశనం చేయాలని ఫిక్సవుతాడు. అసలు ఆ పొలిటీషియన్ చేసిన తప్పులేంటి ? అతన్ని రాధ ఎలా దెబ్బకొట్టాడు ? ఈ మధ్యలో రాధ ప్రేమ కథ ఎలా సాగింది ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

దర్శక నిర్మాతలు పక్కా కమర్షియల్ ఫార్ములాని అనుసరించి ఈ సినిమాను రూపొందించడమే ఈ సినిమాలోని ప్రధాన ప్లస్ పాయింట్. సినిమా ఆరంభమే కాస్త ఎంటర్టైనింగా, ఆసక్తిగా ఉంటుంది. ఇక హీరో శర్వానంద్ అయితే సినిమా మొత్తాన్ని తన భుజాల మీదే మోస్తూ ఆద్యంతం అలరించాడు. పోలీసాఫీసర్ అవ్వాలనే అతి తపన ఉన్న కుర్రాడిగా అతని పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. అతని పాత్రకు రాసిన డైలాగ్స్ కూడా డిఫరెంట్ గా బాగున్నాయి.

కానిస్టేబుల్ షకలక శంకర్ తో కలిసి శర్వానంద్ అందించిన ఫన్ వర్కవుటైంది. ఇంటర్వెల్ సన్నివేశం కూడా కాస్త థ్రిల్లింగా అనిపించింది. సెకండాఫ్ సినిమా అంతా హీరో, విలన్ ల మధ్యే నడిచే సీరియస్, కామెడీ సన్నివేశాలు, వాటి మధ్యలో హీరో – హీరోయిన్లతో కూడిన కొన్ని ఫన్నీ రొమాంటిక్ సన్నివేశాలతో నిండి సరదాగా సాగింది. సినిమా ఆఖరున అసలు రాధ ఆ పొలిటీషియన్ ను అంత సీరియస్ గా తీసుకోవడానికి కారణం ఏమిటి, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాముఖ్యత ఏమిటి అని చెప్పే ఎపిసోడ్స్ ఎమోషనల్ గా కాస్త టచ్ చేశాయి.

సినిమాలో అసలు కథ ఆరంభమైన దగ్గర్నుంచి చివరి వరకు అది ఒకే ట్రాక్లో నడవడంతో ఎలాంటి డీవియేషన్స్ లేకుండా సినిమా చూడొచ్చు. విలన్ గా చేసిన రవి కిషన్ తన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఫస్టాఫ్ ఆరంభం బాగానే ఉన్నా కూడా ఆ తర్వాత హీరోపై రన్ చేసిన సీన్లు ఒకే విధంగా ఉంటూ మరీ ఎక్కువై కాస్త బోర్ అనిపించాయి. హీరో, హీరోయిన్ ను ప్రేమలోకి దింపడమనే సీక్వెన్స్ మరీ ఫన్నీగా తోచింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్టాఫ్ చివరికి గాని సినిమా అసలు కథలోకి వెళ్ళకపోవడం తో ఫస్టాఫ్ చాలా వరకు నీరసంగానే ఉండి రన్ టైమ్ కోసమే రూపొందించినట్టుంది.

కథలోకి అసలు ట్విస్ట్ ఒకసారి తెలిసిపోయాక ఇకపై జరిగే ప్రతి సన్నివేశాన్ని చాలా సులభంగా ఊహించేయవచ్చు. పైగా కథలో కూడా కొత్తదనమంటూ ఏమీ దొరకదు. అలాగే సెకండాఫ్లో హీరో విలన్ల మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడూ హీరోదే పై చేయి అవడంతో కథనంలో దమ్ము తగ్గింది. ఇక మధ్య మధ్యలో వచ్చే పాటలు ఏమంత గొప్పగా ఆకట్టుకోలేకపోయాయి.

సాంకేతిక విభాగం:

దర్శకుడు చంద్ర మోహన్ అన్ని కమర్షియల్ హంగులతో రొటీన్ ఎంటర్టైనర్ గా సాగే కథను సిద్ధం చేసుకున్నా కూడా ఫస్టాఫ్ కొన్ని చోట్ల డ్రైగా ఉండటం, అసలు కథ విశ్రాంతి సమయానికి కానీ మొదలవకపోవడం వంటి పొరపాట్లు చేశారు.

శర్వానంద్ పాత్రకు రాసిన డైలాగులు బాగున్నాయి. రాధన్ సంగీతం కమర్షియల్ సినిమాల స్థాయికి తగ్గట్టు లేకుండా సాదాసీదాగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు తెరపై ఖరీదుగానే కనిపించాయి.

తీర్పు:

భిన్నమైన పాత్రల నుండి కాస్త బ్రేక్ కోరుకుని హీరో శర్వానంద్ చేసిన కమర్షియల్ చిత్రమే ఈ ‘రాధ’. సినిమా కథ అన్ని వాణిజ్య చిత్రాల్లానే రొటీన్ గానే ఉన్నా అక్కడక్కడా మంచి ఫన్, శర్వానంద్ పెర్ఫార్మెన్స్, సెకండాఫ్ లో కనిపించే ఎమోషన్ ఆకట్టుకునే అంశాలుగా ఉండగా ఫస్టాఫ్ చాలా వరకు చప్పగా నడవడం, సెకండాఫ్ అంతా ఊహాజనితమైన సీన్లు, ఇంటర్వెల్ సమయానికి గాని అసలు కథ మొదలవకపోవడం నిరుత్సాహపరిచే అంశాలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే రొటీన్ కమర్షియల్ ఎంటరటైనర్లను ఇష్టపడే ప్రేక్షకులను ‘రాధ’ మెప్పిస్తాడు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version