సమీక్ష : రాజమండ్రికి 50కి.మీ. దూరంలో – షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్‌తో ఫీచర్ ఫిల్మ్..!

Naalo Okkadu

విడుదల తేదీ : 8 మే 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : విజయ్ సూర్య

నిర్మాత : వి. జ్యోతి

సంగీతం : ఆకాష్

నటీనటులు : హేమంత్, నైరుతి


నిశాంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వి. జ్యోతి నిర్మాతగా తెరకెక్కించిన సినిమా ‘రాజమండ్రికి 50 కి.మీ. దూరంలో..’. హేమంత్, నైరుతి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విజయ్ సూర్య దర్శకుడు. క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమిఆ ఏ రేంజ్‌లో ఆకట్టుకుందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

రాజమండ్రికి 50 కి.మీ. దూరంలో గల కోటిపల్లి అనే చిన్న గ్రామంలో వరుసగా ప్రేమికులపై దాడులు జరుగుతుంటాయి. అక్కడి పొలాల్లో ప్రేమ కలాపాలను తీర్చుకోడానికి వచ్చే ప్రేమజంటలపై కొందరు దుండగులు దాడి చేసి అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అక్కడి పోలీసులు ఆ ఊరికి వచ్చే కొత్త వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచుతారు.

ఇదే సమయంలో అక్కడికి రవి (హేమంత్), ప్రియ (నైరుతి)లు జాలీగా గడపడానికి వస్తారు. మూడు గంటలు అక్కడ గడిపి వెళ్ళిపోవాలనుకున్న వారు, రవి చర్యల వల్ల ఆ రాత్రి అక్కడే ఉండాల్సి వస్తుంది. ప్రియతో జాలీగా గడపడానికి వచ్చిన రవి మధ్య మధ్యలో విచిత్రంగా ప్రవర్తిస్తూ, ఏదో ప్లాన్ చేస్తుంటాడు. రవి విచిత్రంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి? అతడు వేసే ఆ సీక్రెట్ ప్లాన్ ఏంటి? పోలీసులు వెతుకుతున్న దుండగులు దొరికారా? అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్రధాన ప్లస్‌పాయింట్‌గా కథాంశాన్ని చెప్పుకోవాలి. ప్రేమికులు ప్రేమ అనే మోజులో చేసే విపరీత చర్యలకు ఎలాంటి ఫలితాలను అనుభవించాల్సి వస్తుందనే మెసేజ్ చెప్పడం బాగుంది. చెప్పాలనుకున్న పాయింట్‌ను సరిగ్గా చెప్పడంలో కొంతమేరకు బాగానే సక్సెస్ అయ్యారు.

హీరో హీరోయిన్లుగా నటించిన హేమంత్, నైరుతిలు బాగానే నటించారు. సినిమా మొత్తం వాళ్ళ చుట్టూనే తిరిగేది కావడంతో వారిద్దరి నటన కథా గమనానికి బాగానే ఉపయోగపడింది. ఇక హీరో క్లాస్‌మేట్స్‌గా నటించిన ఇద్దరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు మంచి రిలీఫ్‌ను ఇస్తాయి. కానిస్టెబుల్స్‌గా నటించిన వారిద్దరూ నవ్వించే ప్రయత్నం చేశారు. సినిమా పరంగా చెప్పుకుంటే ఫస్టాఫ్‌లోని మొదటి ఇరవై నిమిషాలు, ఇంటర్వెల్ బ్లాక్ బాగున్నాయి. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలతో సినిమాకో అర్థం వచ్చింది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే.. పాయింట్ దగ్గరే ఆగిపోయిన కథ గురించి చెప్పుకోవాలి. చెప్పాలనుకున్న పాయింట్ బాగున్నా, ఓ ఫీచర్ ఫిల్మ్ కు సరిపడేంత కథగా ఆ పాయింట్‌ను మలచలేకపోయారు. సినిమా కథ మరీ చిన్నది కావడం, కథనంలోనూ పెద్దగా థ్రిల్స్ లేకపోవడం నిరుత్సాహపరుస్తుంది. ఇక ఒకే సన్నివేశాన్ని మార్చి మార్చి చెప్పే ప్రయత్నం చేయడం సాగతీతగాగా తయారై విసుగు తెప్పిస్తుంది.

సినిమాలో చాలా సన్నివేశాల్లో దర్శకుడికే క్లారిటీ లోపించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమికుల అతి చర్యలను కొన్నిసార్లు సమర్ధించినట్టు, కొన్నిసార్లు మంచిది కానట్టు చూపించడం ఆకట్టుకోదు. ఫస్టాఫ్‌లో, సెకండాఫ్‌లో సినిమాకు బలంగా నిలవాల్సిన చాలా సన్నివేశాల్లో క్లారిటీ లోపించింది.

సాంకేతిక విభాగం :

సాంకేంతికంగా ఓ చిన్న సినిమా అయినా కూడా బాగానే తెరకెక్కించారని చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా సన్నివేశాల్లో క్రైం మూడ్‌ను బాగా క్యాప్చర్ చేసింది. నైట్ మోడ్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ ఫర్వాలేదనేలా ఉంది. సంగీతం విషయానికి వస్తే.. ఉన్న ఒకే ఒక్క పాట వినడానికి బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా చాలా చోట్ల ఎక్కడో విన్న ఫీలింగ్ కలుగుతుంది. కథా, కథనాల పరంగా దర్శకుడు కొత్తగా చేసిందేమీ లేదు. అయితే దర్శకత్వం విషయంలో మాత్రం కొన్ని చోట్ల ఆకట్టుకుంటాడు. కథా విస్తరణలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటే మంచి మెసేజ్ ఓరియెంటేడ్ సినిమాగా మిగిలిపోయేది.

తీర్పు :

ఓ బలమైన పాయింట్‌ను అతి చిన్న కథతో చెప్పిన ప్రయత్నమే ‘రాజమండ్రికి 50 కి.మీ దూరంలో’. పాయింట్ బలమైనదే అయినా కథా, కథనాల్లో కొరవడిన డీటైల్ ఈ సినిమాను ఓ సాధారణ సినిమాగానే నిలుపుతుంది. ఓ మంచి మెసేజ్, కొత్త వాళ్ళైనా బాగా చేశారన్న ఫీల్, నేటి సమాజానికి అద్దం పట్టే కొన్ని సన్నివేశాలు ఈ సినిమాకు కలిసివచ్చే అంశాలు. ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఒక షార్ట్‌ఫిల్మ్ కు సరిపోయే కథను ఓ ఫీచర్ ఫిల్మ్ కథగా రూపొందించే క్రమంలో ఎక్కడో వేసిన తప్పటడుగుల వల్ల ఈ సినిమా అర్థవంతమైన చిన్న సినిమా కోరుకునే ప్రేక్షకులకు చాలా దూరంలో ఆగిపోయింది.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

Exit mobile version