విడుదల తేదీ :సెప్టెంబర్ 15, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు: అభయ్ నవీన్, విష్ణు ఓయ్, అనిల్ గీలా, అమూల్య రెడ్డి, తాగుబోతు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్, జబర్దస్త్ రోషిణి, జగన్ యోగిరాజ్ తదితరులు
దర్శకుడు : అభయ్ నవీన్
నిర్మాత: ఏ ఏ ఆర్
సంగీతం: కమ్రాన్
సినిమాటోగ్రఫీ: ఫహద్ అబ్దుల్ మజీద్
ఎడిటర్: రూపక్ రోనాల్డ్సన్, అభయ్ నవీ
సంబంధిత లింక్స్: ట్రైలర్
నటుడు అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన తాజా సినిమా రామన్న యూత్. ఈమూవీ ఇటీవల టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకుని ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచింది. మరి ఈ నేడు మంచి అంచనాలతో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చిన రామన్న యూత్ ఎలా ఉందో పూర్తి సమీక్ష లో చూద్దాం.
కథ :
తెలంగాణలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన రాజు (అభయ్ నవీన్) సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అయితే ఎప్పటికైనా యూత్ లీడర్ కావాలి అనేది అతని కోరిక. ఒకానొక సమయంలో స్వప్న (అమూల్య రెడ్డి) ప్రేమలో పడతాడు రాజు. అనంతరం అక్కడి ఎమ్యెల్యే అయిన రామన్న ని చూసి స్ఫూర్తి పొందిన రాజు ఆయన మాదిరిగా ఎదగాలని ఎలాగైనా ఆయన కళ్ళలో పడాలని భావిస్తాడు. అందుకోసం ఒక్కరోజు రాజు మరియు అతడి స్నేహితులు తమ గ్రామంలో ఒక బ్యానర్ కడతారు. అయితే అదే వారి జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఇంతకీ ఆ బ్యానర్ లో ఏముంది, అది ఎటువంటి పరిస్థితులకు దారి తీసింది. రాజు ఇంతకీ తన లక్ష్యాన్ని సాదించాడా అనేది మొత్తం కూడా మూవీలో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
నటుడు అభయ్ నవీన్ తన పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించాడు. ముఖ్యంగా మూవీలో తెలంగాణ ప్రజల జీవన విధానం, సంస్కృతిని ఎంతో చక్కగా చూపించారు. హీరో మరియు అతడి స్నేహితుల మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బాగుంటాయి. తాగుబోతు రమేష్, శ్రీకాంత్ అయ్యంగార్, అనిల్ గీలా తమ తమ పాత్రల యొక్క పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ బెటర్ గా ఉంటుంది. అలానే చివరి అరగంట మంచి ఎమోషనల్ నోట్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్ :
నిజానికి దర్శకుడు అభయ్ ఇవ్వాలనుకున్న మెసేజ్ బాగున్నా దానిని తీసిన విధానం మాత్రం ఆకట్టుకోదు. నిజానికి ఇటువంటి పాయింట్ కి మరింత బలమైన కథనం, బలమైన డ్రామా వంటివి ఉండాలి, కానీ అవి ఈ మూవీలో పూర్తిగా మిస్ అయ్యాయి. సినిమా యొక్క క్లైమాక్స్ లో మెసేజ్ బాగున్నా అది అసాధారణ రీతిన చూపించినట్లు అనిపిస్తుంది. క్యారెక్టర్స్ లో లోపం తోపాటు ఎమోషన్స్ కూడా ఆకట్టుకోవు. చాలా వరకు సన్నివేశాలు ఆడియన్స్ ని అలరించవు సరికదా మధ్యలో వచ్చే హీరో హీరోయిన్స్ రొమాంటిక్ ట్రాక్ కూడా కథలో సరిగా ఇమడలేదు.
సాంకేతిక వర్గం :
సంగీత దర్శకుడు కమ్రాన్ మ్యూజిక్, బీజీఎమ్ బాగున్నాయి. ఫహద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ ఆడియన్స్ కి మంచి ఫీల్ ని అందిస్తుంది. అయితే ఎడిటింగ్ విభాగం వారు మాత్రం కొన్ని అనవసర సన్నివేశాలు తొలగించి ఉంటే బాగుండేది. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. దర్శకుడిగా అభయ్ నవీన్ తీసుకున్న తీసుకున్న పాయింట్ బాగున్నా కథనంలో చాలా లోపాల వలన ఆడియన్స్ ని ఈ మూవీ అలరించదు. అందుకే సినిమాలోని బలమైన మెసేజ్ ఆడియన్స్ కి కరెక్ట్ గా చేరువ కాదు.
తీర్పు :
మొత్తంగా నటుడు అభయ్ నవీన్ స్వయంగా తెరకెక్కించిన రామన్న యూత్ మూవీ నేటి యూత్ కి మంచి మెసేజ్ ని అందించినా కథనంలో ఎంతో లోపం కారణంగా ఆడియన్స్ కి కనెక్ట్ కాదు. నటీనటులు తమ నటనతో ఆకట్టుకున్నారు, కొన్ని సీన్స్ బాగున్నాయి. అయితే బలమైన డ్రామా, ఎమోషన్స్ కూడా ఉండి ఉంటే తప్పకుండా మంచి విజయం అందుకుని ఉండేది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team