ఈ వేసవిలో రానున్న పెద్ద చిత్రాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యొక్క ‘రంగస్థలం’ కూడ ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పూర్తి పాటలు ఈరోజే విడుదలయ్యాయి. మరి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…
గాయనీ గాయకులు : దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం : చంద్రబోస్
ఏరు సెనగ కోసం మట్టిని తవ్వితే.. అంటూ మొదలయ్యే ఈ పాట అన్ని పాటలకన్నా ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. అందుకు మొదటి కారణం రచయిత చంద్రబోస్ అందించిన అచ్చ తెలుగు సాహిత్యం. పల్లెటూరి నైపథ్యాన్ని మాత్రమే వాడుకుని చంద్రబోస్ రాసిన లిరిక్స్ ను దేవి శ్రీ గ్రామ ప్రజల వాడుక భాషలో సౌమ్యంగా పాడిన విధానం మళ్ళీ మళ్ళీ పాటను వినాలనేలా చేసింది. పాట వింటుంటే విజువల్స్ కళ్ళ ముందే కదులుతున్న అనుభూతిని కలిగించిన ఈ పాట ఆల్బమ్ లోనే ఉత్తమమైనదిగా నిలుస్తుంది.
గాయనీ గాయకులు : రాహుల్ సిప్లిగంజ్
సాహిత్యం : చంద్రబోస్
పక్కా మాస్ బీట్లతో సాగే ఈ పాట కూడ ఆసక్తికరంగానే ఉంది. సగటు మనిషి జీవితాన్ని విశ్లేషించే విధంగా ఉన్న ఈ పాటలో ‘రంగస్థలాన రంగు పూసుకోకున్నా, వేషం వేసుకోకున్నా మనమంతా ఆట బొమ్మలం అంట, కనబడని సెయ్యేదో ఆడిస్తున్న ఆట బొమ్మలం అంట’ అంటూ చంద్రబోస్ రాసిన లిరిక్స్ దేవుడికి, మనిషికి మధ్యన ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. ఇక రాహుల్ సిప్లిగంజ్ తన మాస్ స్టైల్లో పాటను పాడి మరింత ఆకట్టుకోగా దేవి శ్రీ కాళ్ళు కదపాలనిపించేలా సంగీతాన్ని అందించాడు.
3. పాట : రంగమ్మా మంగమ్మా
గాయనీ గాయకులు : ఎం.ఎం. మానసి
సాహిత్యం : చంద్రబోస్
సినిమాలోని ఈ రొమాంటిక్ పాట ఇది వరకే విడుదలై శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంది. ‘రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు’ అంటూ కథానాయిక హీరోని సరదాగా ఆటపట్టించే తరుణంలో వచ్చే ఈ పాటకు ఎం.ఎం. మానసి గాత్రం గొప్ప బలం. ఆమె పాడిన తీరు మాస్, క్లాస్ రెండు వర్గాల్ని ఆకట్టుకునేలా ఉంది. చంద్రబోస్ సాహిత్యం కూడ కొత్తగా ఉండగా దేవి శ్రీ ఎప్పటిలాగే అదిరిపోయే సంగీతాన్ని అందించి మెప్పించారు.
గాయనీ గాయకులు : శివ వాగులు
సాహిత్యం : చంద్రబోస్
‘ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టు కోస్తావా’ అంటూ మొదలయ్యే ఈ పాట లోకల్ పాలిటిక్స్ నైపథ్యంలో సాగేదిగా ఉంది. ఎండు వేరు వేరు పార్టీల మధ్యన తేడాను సామాన్య జనానికి అర్థమయ్యేలా వివరించే ఈ పాట రేసీగా అనిపిస్తుంది. వాస్తవికతకు దగ్గరగా ఉండేలా చంద్రబోస్ రాసిన లిరిక్స్ బాగున్నాయి. దేవి శ్రీ కూడ పాత కాలం నాటి సంగీతాన్ని తలపించేలా స్వరాలు అందించారు.
5. పాట : జిగేల్ రాణి
గాయనీ గాయకులు : రేల కుమార్, గంట వెంకట లక్ష్మి
సాహిత్యం : చంద్రబోస్
వ్యక్తుల మధ్య సంభాషణలతో, సుకుమార్ వాయిస్ తో మొదలయ్యే పాట మాస్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గీతంలా అనిపిస్తోంది. ‘ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి, కన్నైనా కొట్టవే జిగేలు రాణి’ అంటూ సాగే ఈ పాటలో గిలిగింతలు పెట్టె లిరిక్స్ రాశారు చంద్రబోస్. ఇక దేవి శ్రీ ప్రసాద్ కూడ హుషారెత్తించే సంగీతాన్ని అందించి పాటలో ఊపును ఇంకాస్త పెంచారు.
తీర్పు:
చాలా రోజులుగా ఒకే తరహాలో స్టైలిష్ పాటల్ని మాత్రమే రూపొందిస్తూ వచ్చిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ‘రంగస్థలం’కు మాత్రం పూర్తి స్వేచ్ఛను వాడుకుని ఒక్కో పాటను ఒక్కో విధంగా మలిచాడు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు ప్రత్యేకం అనేలా ఉన్న ఈ పాటలకు థియేటర్లో రెస్పాన్స్ తారా స్థాయిలో ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అచ్చ తెలుగులో అర్థవంతమైన, అర్థమున్న చంద్రబోస్ లిరిక్స్ పాటల స్థాయిని పెంచగా, గాయనీ గాయకులు వినసొంపుగా పాటల్ని ఆలపించారు. వేగంగా హిట్టైన ఎంత సక్కగున్నావే, రంగ రంగ రంగస్థలాన, రంగమ్మా మంగమ్మా పాటలు మేజర్ హైలెట్స్ గా నిలిచిన ఈ ఆడియో సినిమా విజయానికి తప్పక తొడ్పడుతుందని చెప్పొచ్చు.
Click here for English Music Review