ఆడియో సమీక్ష : రారండోయ్ వేడుక చూద్దాం – వినండోయ్ పాటలు బాగున్నాయ్ !


అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ లు జంటగా నటించిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. కళ్యాణ్ కృష్ణ కురసాల రూపొందిన ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. మే 26న విడుదలకానున్న ఈ చిత్రం యొక్క ఆడియోను నిన్ననే రిలీజ్ చేశారు. మరి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

1. పాట : రారండోయ్ వేడుక చూద్దాం

గాయనీ గాయకులు : గోపిక పూర్ణిమ, రంజిత్
రచన : రామ జోగయ్య శాస్త్రి

‘బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ.. ‘ అంటూ మొదలయ్యే ఈ పాట కుటుంబమంతా ఒక పెళ్లి వేడుకలో కలిసినప్పుడు పాడుకునే పాట. అచ్చ తెలుగులో ఉండే ఈ పాటలో ‘ఇద్దరి కూడిక కాదు ఇది.. వందల మనసుల కలయికిది’ వంటి అర్థవంతమైన సాహిత్యంతో పెళ్లి గొప్పతనాన్ని, అందులో కుటుంబాల ప్రాముఖ్యతని బాగా వివరించారు రామ జోగయ్య శాస్త్రి. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతంతో కొత్త ప్రయోగమేమీ చేయకపోయినా డోలు, సన్నాయిలాంటి సంప్రదాయకమైన శబ్దాలతో ఆహ్లాదకరమైన సంగీతమే అందించారు. గోపిక పూర్ణిమ, రంజిత్ లు కూడా మంచి గొంతుకతో పాటకు అందం తీసుకొచ్చారు.

2. పాట : నీవెంటే నేనుంటే
గాయనీ గాయకులు : కపిల్, శ్వేతా మోహన్
రచన : శ్రీమణి

‘నీవెంటే నేనుంటే.. ‘ అంటూ సాగే ఈ రెండవ పాట మరీ ఆకట్టుకునే విధంగా లేకపోయినా బోర్ కొట్టించకుండా సాగిపోతూ ఉంటుంది. హీరో హీరోయిన్ ను ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పే రోటీన్ సందర్భంలో వచ్చే పాట ఇది. ఇందులో రచయిత శ్రీమణి ‘నువ్వే ఒక పుస్తకమైతే.. నెమలీకై నేనుంటా’ అంటూ చేసిన వాఖ్య ప్రయోగం బాగుంది. గాయని శ్వేతా మోహన్ వాయిస్ పాటకు మంచి అందాన్ని తీసుకొచ్చింది. ఇక దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటకు సింపుల్ సంగీతాన్నే అందించారు.

3. పాట : భ్రమరాంభకు నచ్చేశాను
గాయనీ గాయకులు : సాగర్
రచన : శ్రీమణి

‘మేఘాల్లో డ్యాన్సింగ్ నేను.. మెరుపుల్తో రేసింగ్ నేను’ అంటూ మంచి టెంపో లిరిక్స్ తో మొదలయ్యే ఈ పాట ఆద్యంతం హుషారుగా సాగుతుంది. దేవి శ్రీ తన మార్కును చూపిస్తూ అటు మాస్, ఇటు క్లాస్ అందరికీ నచ్చేలా మ్యూజిక్ చేశారు. ‘జాబిలిపై జంపింగ్ నేను.. సంతోషాన్నే సిప్పింగ్ నేను’ వంటి కల్పనా సాహిత్యంతో శ్రీమణి చేసిన పద విన్యాసం వినగానే రిజిస్టర్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా సాగర్ పాడిన విధానం పాటను ఇంకోసారి వినాలనిపించేలా ఉంది. ఆల్బమ్ లోని బెస్ట్ సాంగ్స్ లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు.

4. పాట : బ్రేకప్
గాయనీ గాయకులు : సింహ, ధనుంజయ్
రచన : భాస్కర భట్

బ్రేకప్ యొక్క గొప్పతనాన్ని వివరిస్తానంటూ ఆరంభమయ్యే ఈ పాట ఆల్బమ్ లో కెల్లా సాదాసీదాగా ఉంది. రొటీన్ బ్రేకప్ సిట్యుయేషన్లో వచ్చే ఈ సాంగ్ ‘ఆడోళ్ళంతా ఇంతే బ్రో.. ఆడేసుకుంటారు ఇంతే బ్రో’ అనే సామాన్యమైన లిరిక్స్ తో వినడానికి కూడా రొటీన్ గానే ఉంది. సాధారణంగా ఇలాంటి మాస్ సిట్యుయేషన్ లోని పాటలకు రఫ్ఫాడించే ట్యూన్స్ ఇచ్చే దేవి ఈ పాటకు ఆశించిన స్థాయిలో మ్యూజిక్ ఇవ్వలేదనే చెప్పాలి. కానీ పాట చివర్లో మాత్రం కాస్త వెరైటీ లిరిక్స్ వినిపిస్తున్నాయి. కనుక విజువల్స్ తో కలిపి చూస్తే ఈ ఏమన్నా కొత్తదనం ఉండొచ్చని ఆశించవచ్చు.

5. పాట : తకిట తకజం
గాయనీ గాయకులు : జావేద్ అలీ
రచన : శ్రీమణి

‘తకిట తకజం తకిట తకజం పలికెనే నా గుండెలో..’ అంటూ మొదలయ్యే ఈ రొమాంటిక్ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది. గాయకుడు జావేద్ అలీ ప్రాణం పెట్టి గొప్ప ఫీల్ తో పాటను ఆలపించారు. వినగానే నాలుక మీద ఆడేలా ఉన్న ఈ పాట ఆల్బమ్ మొత్తానికి మొదటి స్థానంలో నిలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ కూడా సంగీతాన్ని భిన్నమైన రీతిలో అందించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వయోలిన్ శబ్దం మైమరపించింది. ఇక లిరిసిస్ట్ శ్రీమణి ‘వందేళ్ల ఊపిరిపై నీ పేరు రాసివ్వు, రెప్పనార్పే కన్నుకా అలవాటునాపావు’ వంటి సాహిత్యంతో పాటకు పరిపూర్ణత తీసుకొచ్చారు.

6. పాట : తకిట తకజం (రాక్)
గాయనీ గాయకులు : జావేద్ అలీ
రచన : శ్రీమణి

ఐదవ పాటకు ఈ పాటకు చాలా పోలికలతో పాటు తేడాలు తేడాలు కూడా ఉన్నాయి. సంగీతం పరంగా ఆరంభంలో ఈ రెండు పాటలు ఒకేలా ఉన్నా వేగంలో ఈ 6వ పాట వేగంగా ముందుకెళుతూ ఉంటుంది. ఇది హీరోయిన్ తో హీరోకు ఎడబాటు ఏర్పడిన సందర్భంలో వచ్చే పాటలా ఉంది. ‘ఆగడాన్నే మరిచిపోనా నిన్ను నడిపిస్తూ ఇలా, ప్రేమ తన హృదయానికై రాసే పరీక్షల్లే నీ వంద జన్మల ప్రేమకై ఇవి నా నిరీక్షణలే’ వంటి లిరిక్స్ తో శ్రీమణి ఆకట్టుకోగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మంచి స్థాయిలోనే ఉంది. ఇక జావేద్ అలీ ఎప్పటిలాగే తన గాత్రంతో పాటకు ప్రాణంగా నిలిచాడు.

తీర్పు:

సాధారణంగా కుటుంబ కథా చిత్రాలంటే సంగీతానికి ప్రాముఖ్యతతో పాటు పట్టింపులు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఆల్బమ్ లో ఎక్కడా అభ్యంతరకరమైన పాటలు లేకుండా చూసుకోవాలి. ఈ విషయంలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ టీమ్ సక్సెస్ అయింది. పాటలను సంప్రదాయానికి
దగ్గరగా ఉంటూనే కాస్త ట్రెండీగా, రొమాంటిక్ గా పాటల్ని రూపొందించారు. ఈ పాటల్లో ‘తకిట తకజం, భ్రమరాంభకు నచ్చేశాను వంటి పాటలు బాగుండగా ‘బ్రేకప్, నీవెంటే నేనుంటే’ సాంగ్స్ ఫర్లేదనిపించాయి. కనుక ట్రెడిషనల్ అండ్ ట్రెండీగా ఉన్న ఈ పాటలు వినండోయ్ బాగున్నాయ్ అనేలా అనేలా ఉన్నాయ్.

సంబంధిత సమాచారం :